సాక్షి, వైఎస్సార్: టీడీపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంగా భావించే మహానాడు ఈసారి భిన్నమైన చర్చకు దారి తీసింది. పార్టీ సిద్ధాంతాలు, నాయకుల ప్రసంగాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాల కంటే… సభకు జనాన్ని నిలబెట్టుకోవడమే స్థానిక నేతలకు పెద్ద సవాలుగా మారిన పరిస్థితి కనిపించింది. చివరకు కార్యకర్తలు, స్థానికులను ఆకట్టుకునేందుకు రికార్డింగ్ డాన్సుల వరకు వెళ్లిన వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
మహానాడును విజయవంతం చేయాలనే ఉద్దేశంతో బద్వేల్ టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆర్పీల ద్వారా మహిళలకు ప్రత్యేక ఆడియో మెసేజ్‌లు పంపిస్తూ సభకు హాజరుకావాలని కోరినట్లు స్థానికంగా ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనసమ్మర్థం కనిపించకపోవడంతో నిర్వాహకులు కొత్త మార్గాలను వెతికినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే కార్యక్రమ ప్రాంగణంలో రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఒకవైపు రాజధానిలో పార్టీ అగ్రనేతలు మహానాడు వేదికపై ప్రసంగాలు చేస్తుండగా, మరోవైపు బద్వేల్‌లో భారీ స్క్రీన్ ముందు డాన్సులు కొనసాగడం అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సభకు వచ్చిన వారు మధ్యలో వెళ్లిపోకుండా ఉంచేందుకే ఈ ఏర్పాట్లు చేశారన్న చర్చ సాగుతోంది.
ఇది చూసిన కొందరు స్థానికులు, పార్టీ సీనియర్ నేతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మహానాడు వంటి రాజకీయ కార్యక్రమంలో ఈ తరహా వినోద కార్యక్రమాలు అవసరమా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే… బద్వేల్‌లో మహానాడు రాజకీయ సభ కంటే వినోద కార్యక్రమాల కారణంగానే ఎక్కువ చర్చకు దారి తీసిన పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ‘‘అదిరిందయ్యా చంద్రం’’ అనే కామెంట్ బలంగా వినిపిస్తోంది.


