కడప రూరల్ : కడపలోని జెడ్పీ కార్యాలయ ఆవరణలోని డీపీఆర్సీ భవన్‌లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఎ) జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. అధ్యక్షుడుగా వి.రఘురామనాయుడు తోపాటు కార్యదర్శిగా ఎన్ కృష్ణ ప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎంఏ ప్రసాద్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బి.మురళి, డాక్టర్ ఎం. వెంకట చంద్రారెడ్డి, పి. సతీష్ కుమార్, బి.రామ రంజిత, ఇ. మార్క్ సుమిత్ర, కె. సుధీర్ కుమార్ రెడ్డి, గంగమ్మ, ఎన్.వెంకట సుబ్బమ్మ, కార్యనిర్వహక కార్యదర్శిగా వి.శివ శేషాద్రి రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా సి.రాజారావు, డి.రాధాకృష్ణారెడ్డి, ఎన్.సునీత, ఎం.రాజ్ కుమార్, సి.రాజేశ్వరి, పి.సంజీవయ్య, ఎస్.సుధా మాణిక్యం, ఎం.వినీల, వెంకట చిన్న, కోశాధికారిగా చంద్రశేఖర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులు నిరాశ, నిస్పృహాలతో ఉన్నారని తెలిపారు. నాలుగు డీఏలు, 2023 జూలై 1 నుంచి పీఆర్సీ పెండింగ్ లో ఉందన్నారు. అలాగే సరెండర్ లీవ్స్ బకాయిలు తదితర ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలే శరణ్యమని స్పష్టం చేశారు.
17 వరకు చైన్నె–ముంబై రైళ్లు రద్దు
కడప కోటిరెడ్డి సర్కిల్: ముంబై డివిజన్‌న్‌లోని కర్జాత్ – లోనావ్లా ( ఎస్‌ఈ) సెక్షన్‌న్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఖండాలా – మంకీహిల్ స్టేషన్ల మధ్య జరిగిన ఈ ఘటన కారణంగా ముంబై– చైన్నె (22157), చైన్నె– ముంబై (22158) వెళ్లే రైళ్లను ఈనెల 17వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు కడప చీఫ్ కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ జనార్ధన్ తెలిపారు.
థియేటర్లలో ‘సర్’
కడప సెవెన్‌రోడ్స్ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 14 వ తేదీ వరకు ప్రచార దృశ్యాలు, చిత్రాలను తప్పకుండా ప్రదర్శించాలని థియేటర్ యాజమాన్యాలు, అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ ద్వారా థియేటర్ యాజమాన్యాలకు అవసరమైన సూచనలు జారీ చేసామని కలెక్టర్ తెలిపారు. ఆయా మండలాల పరిధిలోని రెవెన్యూ అధికారులు కూడా సంబంధిత సినిమా థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందించాలన్నారు.


