పచ్చపాలన.. కక్ష సాధన! | - | Sakshi
Sakshi News home page

పచ్చపాలన.. కక్ష సాధన!

Jul 13 2026 1:34 AM | Updated on Jul 13 2026 1:34 AM

ఖాజీపేట మండలంలో వైఎస్సార్‌సీపీ నేతలే టార్గెట్‌

అధికారులను అస్త్రంగా మలచుకుని వేధింపుల పర్వం

దుంపలగట్టు చెరువు సాకుతో

చంద్రశేఖర్‌రెడ్డి ఇళ్లపై 4 సార్లు

సర్వేల నాటకం

27 మందికి నోటీసులు

కరీముల్లా కాంప్లెక్స్‌ ధ్వంసం

సొంత పొలంలో మట్టి తోలితే

రూ.50 వేల జరిమానా!

ఖాజీపేట : మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చురుగ్గా ఉన్న నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అధికార బలంతో బరితెగించారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణుల స్థిరాస్తులను ధ్వంసం చేయడమే ఏకై క అజెండాగా పెట్టుకుని పచ్చ నేతలు పావులు కదుపుతున్నారు. ప్రతిపక్ష నేతలను ఆర్థికంగా సర్వనాశనం చేసి, కోలుకోకుండా చేయాలన్న దుర్బుద్ధితో మండలంలో అరాచక పాలన సాగిస్తూ, ప్రభుత్వ అధికారులను తమ స్వార్థ రాజకీయాలకు అస్త్రాలుగా వాడుకుంటున్నారు.

చంద్రశేఖర్‌రెడ్డి ఇల్లే టార్గెట్‌..

కోర్టుకు చేరిన వివాదం!

దుంపలగట్టు గ్రామ చెరువును అడ్డుపెట్టుకుని కూటమి నాయకులు అత్యంత దారుణంగా రాజకీయ కక్షసాధింపునకు దిగారు. ఈ చెరువు స్థలంలో వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి ఇల్లు ఉందంటూ టీడీపీ నాయకులు కావాలనే అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు ఫిర్యాదులు చేయించారు. ఇందులో భాగంగానే అధికారులు సర్వే పేరుతో చంద్రశేఖర్‌రెడ్డిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటివరకు ఏకంగా నాలుగు సార్లు సర్వేల పేరుతో క్షేత్రస్థాయికి వచ్చి డ్రామాలు ఆడటంతో, ఈ వేధింపులపై చంద్రశేఖర్‌రెడ్డి న్యాయపోరాటానికి దిగారు. ఆయన కోర్టును ఆశ్రయించి, చట్టపరంగా సమస్యపై పోరాడుతున్నారు. రాజకీయం కోసం అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ దుంపలగట్టు గ్రామంలో ఇప్పటివరకు 27 మందికి నోటీసులు జారీ చేయగా.. అందులో 13 మంది వైఎస్సార్‌ సీపీ నాయకులే ఉండటం గమనార్హం.

మండలవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపై ‘పచ్చ’ వేధింపుల పర్వం

దుంపలగట్టు చెరువు వివాదమే కాకుండా, ఖాజీపేట మండలవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్‌ చేస్తూ సాగిస్తున్న ఐదు ప్రధాన వేధింపుల ఉదంతాలు ఇవీ:

కరీముల్లా కాంప్లెక్స్‌ ధ్వంసం : ఖాజీపేట జిల్లా పరిషత్‌ కోఆప్షన్‌ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లాను పచ్చ నేతలు తొలి టార్గెట్‌గా ఎంచుకున్నారు. వంక కాలువ కట్టపై ఉన్న ఆయన షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఆక్రమణలో ఉందనే నెపంతో రూములను దౌర్జన్యంగా పగులగొట్టించారు. అయితే, అదే కాలువ కట్టపై ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లను, అక్రమ కట్టడాలను అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం అధికారుల పక్షపాతానికి అద్దం పడుతోంది.

సొంత పొలంలో మట్టి తోలితే రూ.50 వేల ఫైన్‌: సన్నపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నేత, డీలర్‌ సుబ్బారెడ్డి తన సొంత పట్టా పొలంలో వ్యవసాయ అవసరాల కోసం మట్టిని తోలుకుంటుంటే కూటమి నేతలు సహించలేకపోయారు. అధికారులను ఉసిగొలిపి ఆయన జేసీబీ, ఇతర రవాణా వాహనాలను అక్రమంగా అదుపులోకి తీసుకుని, ఏకంగా రూ.50 వేల భారీ జరిమానా (ఫైన్‌) కట్టించి కక్ష తీర్చుకున్నారు.

మిడుతూరులో పేడదిబ్బల రాజకీయం : మిడుతూరు గ్రామంలోని ఒక వైఎస్సార్‌ సీపీ కార్యకర్తకు చెందిన సొంత పట్టా స్థలంలో ఉన్న పేడదిబ్బలను తక్షణమే తొలగించాలంటూ అధికారుల ద్వారా తీవ్ర ఒత్తిడి తెచ్చి బలవంతంగా తొలగింపజేశారు. అదే గ్రామంలో ఇతర ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు చెందిన అనేక దిబ్బలు కుప్పలుగా ఉన్నా అధికారులు వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం.

డీకేటీ స్థలాలకు తప్పుడు నోటీసులు : ప్రతిపక్ష పార్టీకి చెందిన మరో ముఖ్య నాయకుడికి ఉన్న డీకేటీ భూమిపై పచ్చ కన్ను పడింది. ఆ భూమిని లాక్కునేందుకు వీలుగా అధికారుల ద్వారా తప్పుడు నోటీసులు ఇప్పించి వేధించడంతో, సదరు నాయకుడు గత్యంతరం లేక కోర్టు మెట్లు ఎక్కి న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది.

పెద్దమ్మ గుడి స్థలం ఆక్రమణ.. దళితులపై దౌర్జన్యం: మిడుతూరు దళిత గ్రామంలోని ఊరి రాసి (పోరంబోకు) స్థలంలో గ్రామస్తులందరి సహకారంతో ’పెద్దమ్మ గుడి’ నిర్మాణం కోసం వైఎస్సార్‌ సీపీ నాయకులు బేస్‌ మట్టం వేశారు. అయితే ఆ గుడి పునాదుల పైభాగంలో ఉన్న దేవుడి భూమిని కొందరు టీడీపీ నాయకులు రాత్రికి రాత్రే ఆక్రమించి మట్టి కుప్పలు పోశారు. పవిత్రమైన గుడి స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా గ్రామంలో తీవ్ర అశాంతికి కారణమైన ఈ వ్యవహారం ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది.

ఇసుక, మట్టి అరాచకాలు..

‘పచ్చ’ తమ్ముళ్లలోనే ఘర్షణలు!

మండలంలో ఇసుక, మట్టి రవాణా విషయంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సామాన్యులు కూడా తమ సొంత అవసరాలకు కనీసం ఒక్క తట్ట మట్టిని కూడా తరలించకుండా పోలీసులు పూర్తి బెదిరింపు ధోరణితో కేసులు పెడుతున్నారు. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం పెన్నా నది, వాగుల నుండి పోటీపడి మరీ వందలాది ట్రాక్టర్ల ఇసుక, మట్టిని అక్రమంగా తరలిస్తూ లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ దోపిడీ వాటాల విషయంలో ఏకంగా టీడీపీ నాయకులే ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని ఘర్షణలకు దిగిన సంఘటనలు మండలంలో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement