బ్యాగ్‌ పెయిన్‌ ! | - | Sakshi
Sakshi News home page

బ్యాగ్‌ పెయిన్‌ !

Jul 13 2026 1:34 AM | Updated on Jul 13 2026 1:34 AM

బ్యాగ్‌ పెయిన్‌ !

కడప ఎడ్యుకేషన్‌: ఆటపాటలతో సాగాల్సిన చిన్నారుల బాల్యం ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల పుణ్యమా అని మోయలేని పుస్తకాల భారంతో నలిగిపోతోంది. జిల్లావ్యాప్తంగా 2,215 ప్రభుత్వ, 866 ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 3,24,012 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ బడుల్లో సెమిస్టర్‌ విధా నం ప్రకారం పుస్తకాలు ఇస్తుండగా, ప్రైవేట్‌ బడులు ధనార్జనే ధ్యేయంగా ఒలింపియాడ్‌, జేఈఈ, నీట్‌ స్టడీ మెటీరియల్స్‌ పేరుతో ఒక్కొక్కరికి రూ.8 వేల నుంచి రూ.10 వేల విలువైన భారీ పుస్తకాలను బలవంతంగా అంటగడుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ ‘స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ’ నిబంధనల ప్రకారం 9వ తరగతి విద్యార్థి మోయాల్సిన గరిష్ట బరువు 5 కిలోలు (శరీర బరువులో 10 శాతానికి మించకూడదు) మాత్రమే. కానీ, జిల్లాలోని కార్పొరేట్‌ స్కూళ్లలో విద్యార్థులు ఏకంగా 15 నుంచి 20 కిలోల బరువును వీపున మోస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. లేత వయసులో ఈ భారీ బరువులను నిరంతరం మోయడం వల్ల పిల్లలు తీవ్ర శారీరక, మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం బరువు వెనక్కి లాగడం వల్ల వెన్నెముక వంకర తిరగడం, చిన్న వయసులోనే స్పాండిలైటిస్‌ రావడం, ఊపిరితిత్తులపై ఒత్తిడి పడి గాలి పీల్చే సామర్థ్యం తగ్గడం, మెడ–నడుము కండరాల నొప్పుల వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. విద్యాహక్కు చట్టం–2009, యశ్‌పాల్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఆరేళ్ల కిందటే స్కూల్‌ బ్యాగ్‌ పాలసీ అమల్లోకి వచ్చినా క్షేత్రస్థాయిలో అది కాగితాలకే పరిమితమైంది. స్కూళ్లలోనే లాకర్లు పెట్టడం, ఏ రోజు అవసరమైన పుస్తకాలే తెచ్చుకునేలా చూడటం, ‘నో బ్యాగ్‌ డే’ను విధిగా అమలు చేయడం వంటి ప్రత్యామ్నాయాలపై యాజ మాన్యాలు, తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు జీవోలు ఇవ్వడం, అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేయడం మినహా విద్యాశాఖ నుంచి శాశ్వత పర్యవేక్షణ కరువైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మోయలేని భారం

నలిగిపోతున్న బాల్యం

పుస్తకాలతో కుస్తీమయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement