చంద్రబాబు మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu Health - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు మెడికల్‌ రిపోర్టుపై ఎల్లో మీడియా హడావుడి చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘అనారోగ్యంతో ఉన్నప్పుడు కోర్టును రిక్వెస్ట్‌ చేయొచ్చు.. కోర్టు అనుమతిస్తే బెయిల్‌ వస్తుంది. ఆ కారణంతోనే చంద్రబాబుకు తాత్కాలిక బెయిల్‌ వచ్చింది. ఇప్పుడు ఆ బెయిల్‌పై మరికొంత కాలం బయట ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు.

‘‘గుండె సంబంధిత ఇబ్బందులు ఉంటే వెంటనే స్టంట్ వేయటమో, బైపాస్ సర్జరీనో చేయాలి. అంబులెన్స్‌ని వెంట పట్టుకుని బయట తిరగమని డాక్టర్లు రిపోర్టు ఇచ్చారంటే ఇక వారిని ఏమనాలి?. రోగం ఉంటే వైద్యం చేయించుకోవటం సహజమే. కానీ క్యాన్సర్‌ లాంటి రోగం ఉందో లేదో పరీక్షలు చేయాలని రిపోర్టు రాయటం ఏంటి?. ఇలాంటి చిత్ర విచిత్రమైన రిపోర్టులు ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పుడు సర్జరీలు చేయకపోతే మనిషి ఉంటాడో లేదో అన్నట్టుగా రిపోర్టులు తెచ్చుకోవటం చంద్రబాబుకే చెల్లింది’’ అని సజ్జల ఎద్దేవా చేశారు.

‘‘జైలులో ఉన్నంతసేపు ప్రాణాంతక వ్యాధులున్నట్టు ప్రచారం చేశారు. బెయిల్‌ రాగానే జైలు నుంచి ర్యాలీ పేరుతో హంగామా చేశారు. మెడికల్‌ రిపోర్ట్‌ ఇచ్చింది వైద్యులా లేక రాజకీయ నేతలా? చంద్రబాబుకు నిజంగా ఆ పరిస్థితి ఉంటే వెంటనే ‍ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి’’ అని సజ్జల పేర్కొన్నారు.
చదవండి: మరోసారి బయటపడ్డ చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు

‘‘చంద్రబాబు జైలులో ఉన్నా బయట ఉన్నా మాకేం ఇబ్బంది లేదు. ఈ మొత్తం వ్యవహారంలో స్కాం జరిగిందన్న విషయం పక్కకి పోతోంది. ఈ స్కాం తాను చేయలేదని మాత్రం చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు తరపు లాయర్లు కూడా స్కాంపై వాదించడం లేదు. మేనిఫెస్టో గురించి మమ్మల్ని ప్రశ్నించే ముందు చంద్రబాబు సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదే’’ అంటూ సజ్జల ధ్వజమెత్తారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top