న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ నేతలు ఎన్డీఏతో కలుస్తారా? లేదా? అన్న సందిగ్ధత నెలకొన్న వేళ రెబల్ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ మంగళవారం దీని గురించి మాట్లాడారు. ఎన్డీఏ వైపు రాజకీయంగా అడుగులు పడే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో పనిచేస్తానని చెప్పారు. ప్రస్తుతం విలీనంపై కూడా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
దస్తిదార్ ఈ వ్యాఖ్యలు పార్లమెంటరీ స్థాయి సంఘం హోం వ్యవహారాల సమావేశానికి హాజరైన సమయంలో చేశారు. పశ్చిమ బెంగాల్‌లో బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా వంటి సామాజిక సమస్యలపై ఆ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తన రాజకీయ భవిష్యత్తు, ఎన్డీఏలో చేరే అవకాశంపై జాతీయ మీడియాతో మాట్లాడిన దస్తిదార్.. విలీనానికి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు.
“ముందుగా మేము మరో పార్టీలో విలీనం కావడానికి చేస్తున్న ప్రయత్నం ఒక కొలిక్కి రావాలి. మాకు ఆమోదం లభించింది. వారు సిద్ధంగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో ఎన్డీఏతో కలిసి పనిచేస్తాం. ఈ విలీన వ్యవహారాన్ని వారు పరిశీలిస్తున్నారు” అని దస్తిదార్ చెప్పారు.
కేంద్ర పథకాలను అమలు చేయిస్తా..
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని తాను ఆరోపిస్తున్న కేంద్ర సంక్షేమ పథకాలను పశ్చిమ బెంగాల్‌లో అమలు అయ్యేలా చూడటమే తన ప్రాధాన్యమని దస్తిదార్ చెప్పారు. “పశ్చిమ బెంగాల్‌లో అమలు కాని పథకాలను ఎలా ముందుకు తీసుకురావాలన్న అంశంపై, బాలల భద్రత విషయాలపై కూడా ఇప్పుడు చర్చించాం. పశ్చిమ బెంగాల్ ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని ప్రయత్నిస్తున్నాం” అని ఆమె చెప్పారు.
పార్లమెంటరీ స్థాయీ సంఘం హోం వ్యవహారాల సమావేశంలో దస్తిదార్.. పిల్లలపై జరిగే నేరాలను అరికట్టడంలో గత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా అంశాలను ప్రస్తావించారు.
“పార్లమెంటరీ స్థాయి సంఘం హోం వ్యవహారాల సమావేశంలో పశ్చిమ బెంగాల్‌లో బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా అంశాలను లేవనెత్తాను. గత రాష్ట్ర ప్రభుత్వం వీటిని అరికట్టలేకపోయింది. ఈ విషయంపై ఏ చర్యలు తీసుకున్నారో సమావేశంలో ప్రశ్నించాను” అని దస్తిదార్ చెప్పారు.
రాజ్యసభ సచివాలయం విడుదల చేసిన నోటీసు ప్రకారం.. “పిల్లలపై నేరాలు” అంశంపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ), సంబంధిత సంస్థలు, ఇతర భాగస్వామ్య మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను తెలుసుకునేందుకు శాఖల వారీ పార్లమెంటరీ స్థాయి సంఘం జూన్ 16, 17 తేదీల్లో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది.
తొలి సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్సీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో జరిగింది. మధ్యాహ్నం 2.30 గంటలకు జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) అభిప్రాయాలను సంఘం వింది.
బుధవారం (జూన్ 17న) ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్ అనెక్సీ ఎక్స్‌టెన్షన్‌లో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సంఘం సమావేశమవుతుంది.


