రాష్ట్రంలో బీజేపీ గాలి | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో బీజేపీ గాలి

Published Sun, Nov 26 2023 4:30 AM

PM Narendra Modi Fires On Congress And BRS - Sakshi

సాక్షి, కామారెడ్డి/సాక్షి, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ అంతటా బీజేపీ గాలి వీస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బీఆర్‌ఎస్‌ నుంచి విముక్తి కోసం బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఏడు దశాబ్దాల కాంగ్రెస్‌ నుంచి కూడా ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిలను ఓడించి వారికి గుణపాఠం చెప్పాలని కోరారు. తెలంగాణకు బీసీని సీఎం చేస్తామని చెబుతున్నామని, అధికారం అప్పగిస్తే చెప్పినట్లు బీసీని సీఎం చేసితీరుతామని స్పష్టం చేశారు.

బీసీనైన తనకు ప్రధానమంత్రి పదవి అవకాశం ఇచ్చింది బీజేపీయేనన్నారు. దళితుణ్ణి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేస్తానన్న కేసీఆర్‌.. మోసం చేసి, సీఎం కుర్చీని కబ్జా చేశారన్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభల్లో ఆయన మాట్లాడారు.  

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నాయకులు మోసగాళ్లు  
‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నాయకులు మోసగాళ్లు, అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. లోపల మాత్రం కలిసే ఉంటున్నారు. ఆ రెండూ ఒక్కటే. కుటుంబ, అవినీతి పార్టీలు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌ కార్బన్‌ సర్కార్‌కు ఓటేసినట్లే. కేసీఆర్‌ చరిత్ర కాంగ్రెస్‌తోనే ప్రారంభమయ్యింది. 2004లో కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యాడు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా అదే పార్టీ అధినేత వద్దకు వెళ్లాడు. కాంగ్రెస్‌లో గెలుపొందిన అభ్యర్థులు బీఆర్‌ఎస్‌లో మంత్రులయ్యారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని చెప్పడానికి ఇదే నిదర్శనం.

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది. బీజేపీ ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకుంటే బీఆర్‌ఎస్‌ ఆమెను ఓడించేందుకు కుట్ర పన్నింది. కాంగ్రెస్‌ వేల కోట్ల అవినీతికి పాల్పడింది. కేసీఆర్‌ కూడా అదే స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. ఇరిగేషన్‌ స్కీంను...ఇరిగేషన్‌ స్కాంగా మార్చారు. దళిత బంధును..ఎమ్మెల్యే బంధుగా మార్చేశారు. ఆ రెండు పార్టీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వ్యతిరేకులు. బీసీ సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నాయి..’ అని మోదీ ఆరోపించారు. 

మీ పిల్లల భవిష్యత్తుకు పని చేసేది బీజేపీయే 
‘హఠాత్తుగా టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారుతుంది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ఇండియా కూటమి అవుతుంది. పేర్లు మారినంత మాత్రాన వాళ్ల బుద్ధి మారదు. అవినీతిలో మునిగి తేలుతారు. వాళ్లు వాళ్ల పిల్లల కోసమే పనిచేస్తారు. బీజేపీ మాత్రమే మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. తెలంగాణలో పేదలు, రైతులు, మహిళలు, యువత, దళితులు, ఆదివాసీల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టో రూపొందించింది. బీజేపీ చెప్పింది చేస్తుందన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది.

370 ఆర్టికల్, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు, రైతులకు పంట ఉత్పత్తుల ధరల పెంపు, రామ మందిర నిర్మాణం వంటి హామీలన్నింటినీ నెరవేర్చాం. తెలంగాణలో పసుపుబోర్డు, ఆదివాసీలకు సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీ వంటివీ నెరవేర్చాం. మాదిగ సమాజానికి న్యాయం చేయడానికి ముందుకు వచ్చాం. ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు సుప్రీంకోర్టులో కేసు విషయంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించాం. గతంలో దేశం మొత్తం మీద బీజేపీకి ఇద్దరే ఎంపీలు ఉన్నపుడు అందులో ఒకరు తెలంగాణ నుంచే. అందుకే తెలంగాణ గడ్డ మీద బీజేపీకి ఎంతో అభిమానం..’ అని ప్రధాని చెప్పారు.  

40 లక్షల మంది రైతులకు లబ్ధి 
‘బీఆర్‌ఎస్‌ పెద్దలకు డబ్బులు అవసరం ఉంటే సాగునీటి ప్రాజెక్టు అంటూ కొత్త పేరుతో అంచనాలు పెంచేసి దండుకుంటారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులతో జేబులు నింపుకుంటారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధితో నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. తెలంగాణలో 40 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. రూ.2,800 నుంచి రూ.3 వేలకు ఇవ్వాల్సిన యూరియా బస్తాను బీజేపీ ప్రభుత్వం రైతులకు కేవలం రూ.3 వందలకే ఇస్తోంది.

రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విషయంలో కేంద్రం ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. తెలంగాణలో వానాకాలంలో అదనంగా 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. చెరుకు పంటను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. హైదరాబాద్‌ చుట్టూ రీజినల్‌ రింగ్‌ రోడ్డును తీసుకొస్తున్నాం. బీజేపీ పేదలకు మరో ఐదేళ్లు ఉచితంగా బియ్యం అందిస్తుంది. వేగవంతమైన ప్రయాణానికి వందేభారత్‌ రైళ్లను ప్రారంభించాం. నారీ స్వశక్తి ద్వారా కోట్లాది మంది మహిళలకు న్యాయం చేస్తున్నాం..’ అని తెలిపారు. 

ఓటమి భయంతోనే రెండుచోట్ల పోటీ 
‘తెలంగాణ యువత ఎక్కువగా ఉన్న రాష్ట్రం. అయితే ఇక్కడి ప్రభుత్వం యువతకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉద్యోగ నియామకాల విషయంలో అన్యాయం చేసింది. విద్యారంగాన్ని విస్మరించింది. కాంగ్రెస్‌ వల్ల తెలంగాణలో వేలాది మంది యువత ప్రాణాలు కోల్పోయారు. ఓటమి భయంతోనే సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు రెండుచోట్ల పోటీ చేస్తున్నారు. వాళ్లిద్దరినీ ఓడించే అవకాశం కామారెడ్డి ప్రజలకు వచ్చింది. డిసెంబర్‌ 3న కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు..’ అని మోదీ అన్నారు. 

మీ కల నెరవేర్చేది మోదీ సంకల్పమే.. 
‘నేను కాశీ నగరానికి నాయకుడిని. మహేశ్వరం శివగంగా మందిర్‌కు ప్రసిద్ధి. ఈ గడ్డ మీద అడుగు పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. తెలంగాణ యువకుల్లారా నా మాట రాసి పెట్టుకోండి. రైతులు, యువకులు, కార్మీకులు, దళితులు, ఆదివాసీలు, ప్రతి ఒక్కరికీ గ్యారంటీ ఇస్తున్నా. మీ కలలను నెరవేర్చేది మోదీ సంకల్పమే.  చిన్నపాటి వర్షానికే బస్తీలు నీట మునుగుతున్నాయి. తాగునీరు లేక జనం అల్లాడుతున్నారు. బీజేపీకి సేవ చేసే అవకాశం ఇస్తే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపిస్తా. తెలంగాణలో నిజాం సుల్తాన్‌లకు చోటు లేదు..’ అని ప్రధాని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల వెంట తానుంటానని, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తానని, రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయని, తెలంగాణలో మార్పు కోసం, అవినీతి పాలనను గద్దె దించేందుకు తెలంగాణ ప్రజానీకం కంకణం కట్టుకొని ముందుకు పోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు.

బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు జి లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జుక్కల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నారాయణఖేడ్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌ అభ్యర్థులు అరుణతార, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, వడ్డెపల్లి సుభాష్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, సంగప్ప, అందెల శ్రీరాములు యాదవ్, రవికుమార్‌ యాదవ్, తోకల శ్రీనివాస్‌ రెడ్డి, నోముల దయానంద్‌ గౌడ్, అందె బాబయ్య తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement