ఎఫ్‌పీవోలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి
● పంట ఉత్పత్తులకు రైతుల వద్దే
అదనపు విలువ చేకూరాలి
● మహి ఎఫ్‌పీవో నేషనల్ ఫెడరేషన్
డైరెక్టర్ వంగా గురవారెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న పదివేల రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవో) అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే అందరికీ మరింతగా మేలు చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహి ఎఫ్‌పీవో నేషనల్ ఫెడరేషన్ డైరెక్టర్ వంగా గురువారెడ్డి అన్నారు. జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్‌లో ఉన్న జేఎంకేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం యూనిట్‌ను గురవారెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్డంకులను అధిగమించి, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని కష్టపడి పంటలు పండించే రైతులకు మరింత మేలు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కచ్చితమైన విధానాలను అమలు చేయాలన్నారు. దేశంలోని పదివేలకు పైగా ఉన్న ఎఫ్‌పీవోలను అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువస్తే ప్రతి ఒక్కరికీ మేలు కలుగుతుందన్నారు. రైతులు పండిస్తున్న పంట ఉత్పత్తులకు సంబంధించి రైతుల వద్దే అదనపు విలువ జోడించేలా గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేసేలా మరింతగా ప్రోత్సహించాలన్నారు. దీంతో రైతులకు లాభం పెరగడంతోపాటు వినియోగదారులకు తక్కువ ధరలకే ఉత్పత్తులు అందుతాయన్నారు. ఈ దిశగా రైతులు ఏకీకృతం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే రైతులు ఎఫ్‌పీవోల ద్వారా సేద్యం నుంచి ఎగుమతుల వరకు చేయవచ్చన్నారు. గురవారెడ్డి వెంట ఏపీలోని కృషిభారతి ఎఫ్‌పీవో డైరెక్టర్ ఈద శ్రీనివాసరెడ్డి, ఏపీకి చెందిన పసుపు రైతు ఈమని శివరాంరెడ్డి, జేఎంకేపీఎం ఎఫ్‌పీవో చైర్మన్ పాట్కూరి తిరుపతిరెడ్డి ఉన్నారు.


