కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
● జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి
సైన్స్ ఫెయిర్ ప్రారంభం
కామారెడ్డి టౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ సూచించారు. జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్‌లో (అబ్దుల్ కలాం ప్రాంగణం) బుధవారం 53వ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్ మనక్ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ప్రారంభమైంది. షబ్బీర్ అలీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే ముఖ్యమంత్రి విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నారని పేర్కొన్నారు. తాను చదువుకున్న కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి ఎస్‌డీఎఫ్ నిధులు రూ. 5 కోట్లు కేటాయించామని, వచ్చే ఏడాది నాటికి కొత్త భవనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. అబ్దుల్ కలాంను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తన సొంత మండలమైన మాచారెడ్డి విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనల్లో జాతీయ స్థాయికి ఎదగడం తనకు గర్వకారణమన్నారు.
నూతన టెక్నాలజీపై విద్యార్థులు పట్టు సాధించాలని ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైడ్రోజన్ ఎనర్జీ, శాటిలైట్ టెక్నాలజీ వంటి ఆధునిక అంశాల్లో విద్యార్థులు రాణించేలా ఉపాధ్యాయులు చూడాలన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించడంలో సైన్స్ ఫెయిర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ నమూనాలు బాగున్నాయని, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
33 జిల్లాల నుంచి 887 ప్రదర్శనలు..
రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి మొత్తం 887 ప్రదర్శనలను ఆయా విభాగాలలో విద్యార్థులు ప్రదర్శించారు. ఒక విద్యార్థితో ఒక గైడ్ టీచర్ ఇందులో పాల్గొంటున్నారు.
సైన్స్ ఫెయిర్ ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రెస్ గ్యాలరీ ఖాళీగా కనిపించింది. దీంతో షబ్బీర్ అలీ నిర్వాహకులపై వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు ఏర్పాటు చేసిన ప్రాగణంలో దుమ్ము, ధూళి రేగడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందిపడ్డారు. సైన్స్ ప్రాజెక్ట్‌ల కోసం అనువైన స్థలం లభించక చాలామంది విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. విద్యుత్ సరఫరాకు అవసరమైన కనెక్షన్‌లు లేక కొందరు అసంపూర్తిగా ప్రదర్శనలిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్, డీఈవో రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కై లాస్ శ్రీనివాస్, నర్సింగ్‌రావు, రాజు, ఆయా ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు అనిల్, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలి


