తప్పుల తడకగా ఓటర్ల జాబితా
● ఆందోళన చెందుతున్న ఓటర్లు
● పొరపాట్లు సవరించాలని వినతులు
బాన్సువాడ : మున్సిపల్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీతో పాటు బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఆందోళనలకు దిగుతున్నారు. ముసాయిదా జాబితాలో లోపాలు ఉన్నాయంటూ మంగళవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేశారు. పక్కపక్కనున్న ఇళ్లను వేరువేరు వార్డులలో చేర్చారని, ఒక్కో వార్డులో వందల కొద్ది ఓట్లను కలిపారని ఆరోపించారు. కొత్త ఓట్లపై తీవ్ర అభ్యంతరాలున్నాయని ఆగ్రహించారు.
మచ్చుకు కొన్ని..
బాన్సువాడ బల్దియాలో గతంలో తొమ్మిదో వార్డులో ఉన్న నడిగడ్డ సగ భాగం అంటే సుమారు 100 ఓట్లు ఈసారి పదో వార్డు పరిధిలోకి వెళ్లాయి. దీనిపై ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
2020 మున్సిపల్ ఎన్నికల్లో 20,543 ఓట్లు ఉండగా.. ప్రస్తుతం ముసాయిదా జాబితా ప్రకారం 24188 ఓట్లకు పెరిగాయి. బల్దియాలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 3,600 పైచిలుకు ఓట్లు పెరగడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
11వ వార్డులో మాసాని ప్రమీల భర్త పేరు హస్బెండ్ అని, గొల్ల సంతోష్ తండ్రి పేరు ఫాదర్ అని, తోట శ్రీలక్ష్మి, తోట అపర్ణల తండ్రి పేరు తోట అని వచ్చాయి. ఇవన్నీ 11వ వార్డులోని ఒకే పేజీలో దొర్లిన తప్పులు. ఇలా ఇంకా ఎన్ని తప్పులు ఉన్నాయోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓటరు జాబితాలో మరణించినవారి పేర్లూ ఉండడం గమనార్హం. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఓటర్ల జాబితా తప్పుల తడకగా తయారయ్యిందని నాయకులు విమర్శిస్తున్నారు. తప్పులను సవరించాలని కోరుతున్నారు.


