మాల్తుమ్మెద పాఠశాలలో విచారణ
పాఠశాలలో వైద్యశిబిరం..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మండలంలోని మాల్తుమ్మెద బాలుర ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి విచారణ చేపట్టారు. హెచ్‌ఎం లక్ష్మీతులసి, విద్యార్థుల తల్లిదండ్రులతో వేర్వేరుగా మాట్లాడారు. కలుషితమైన నీటితో నాసిరకంగా మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు పెడుతున్నారని తల్లిదండ్రులు ఆర్డీవోతో పేర్కొన్నారు. పాఠశాలలో 50 మందికిపైగా విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయురాలు బోధన చేస్తున్నారని, దీంతో విద్యార్థులకు బోధన సైతం సక్రమంగా జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భోజన ఏజెన్సీని వెంటనే మార్చాలని కోరారు. మధ్యాహ్న భోజనం తయారీకి వినియోగించే నీటి సంపుపై ఉన్న మూతకు సిమెంట్ పూసి మూసేయాలని హెచ్‌ఎంను ఆర్డీవో ఆదేశించారు. ఆయన వెంట నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వర్, సర్పంచ్ పుప్పాల సాయిలు, గోపాల్‌పేట కాంప్లెక్స్ స్కూల్ హెచ్‌ఎం వెంకట్రాంరెడ్డి, సీఆర్పీ రాజయ్య, పంచాయతీ కార్యదర్శి అశోక్ తదితరులున్నారు.
మాల్తుమ్మెద బాలుర ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవ్వడంతో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. విద్యార్థులందరికీ ఆర్‌బీఎస్‌కే వైద్యసిబ్బంది వైద్యపరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులను అందజేశారు.


