
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు నిరూపించాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 48 గంటల్లో బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే లీగల్ నోటీసులిస్తా’’ అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ హెచ్చరించారు. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పటికీ, బండి సంజయ్‌కు తెలివితేటలు ఎలా పని చేస్తాయో అర్థం కాలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
అలాగే కనీస జ్ఞానం కూడా లేదు. ఆయన ఆరోపణలు హద్దు దాటాయి. ఇంత చౌకబారు వ్యాఖ్యలు ఆయనకు కొత్త కాదు.. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలలో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించమని సవాల్ విసురుతున్నా.. ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే న్యాయపరమైన చర్యలు తప్పవు’’ అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
కాగా, ఇవాళ సిట్ విచారణకు బండి సంజయ్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ఎస్‌ఐబీను సొంత అవసరాలకు కేటీఆర్ వాడుకున్నారన్న బండి సంజయ్.. కేసీఆర్ దగ్గర పనిచేసిన మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్నారు.