ఏపీ తరహాలో ఒక చైర్మన్,ఇద్దరు సభ్యులతో ‘నాన్ అఫీషియల్ పీఏసీఎస్’ల ఏర్పాటు
ఎమ్మెల్యేల కనుసన్నల్లో రాజకీయ నియామకాలు జరిపేలా కసరత్తు..
విధి విధానాలు రూపొందించే పనిలో సహకార శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)కు ఎన్నికలు నిర్వహించకూడదని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. సహకార చట్టంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఎన్నికయ్యే పీఏసీఎస్‌ల స్థానంలోనే రాష్ట్రవ్యాప్తంగా ‘నాన్ అఫీషియల్ పీఏసీఎస్’లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కొత్త సంవత్సరంలో అన్ని పీఏసీఎస్‌లకు ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో కూడిన ‘త్రీమెన్’కమిటీలను ఏర్పాటు చేసి, వారిలో నుంచే డీసీసీబీ, డీసీఎంఎస్, టెస్కాబ్ కమిటీలకు కూడా పాలకుల ‘ఎంపిక’జరిగేలా కసరత్తు సాగుతోంది.
ఈ మేరకు సహకార శాఖ నూతన విధివిధానాలు రూపొందించే పనిలో ఉంది. కొత్తగా చట్టాల్లో మార్పులేమీ చేయకుండానే, సహకార శాఖ చట్టంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగానే ఈ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేలా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2017 నుంచే కొనసాగుతున్న ఈ విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే రాష్ట్రంలోని 908 పీఏసీఎస్‌లకు ‘రాజకీయ’త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ వచ్చే నెలలో మొదలుకాబోతుందని చెపుతున్నారు.
వెంటనే పర్సన్ ఇన్‌చార్జీల నియామకం
2019 సంవత్సరంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయ సహకార సంఘాల సొసైటీలకు ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. సుమారు 10 నెలల క్రితం ఈ సొసైటీల కాలపరిమితి పూర్తి కావడంతో ప్రభుత్వం ఆరునెలల చొప్పున రెండుసార్లు ఆయా సొసైటీల పదవీకాలాన్ని పొడిగించింది. కాగా సర్పంచ్‌ల ఎన్నికలు పూర్తయి, ఎన్నికల కోడ్ ముగిసిన ఈనెల 19వ తేదీనే 908 పీఏసీఎస్‌లతో పాటు 9 డీసీసీబీ, 9 డీసీఎంఎస్‌ల సొసైటీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో పాటే సొసైటీల స్థానంలో పర్సన్ ఇన్‌చార్జీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరుసటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా పర్సన్ ఇన్‌చార్జీలుగా నియమితులైన సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు, సీనియర్ ఇన్‌స్పెక్టర్లు బాధ్యతలు తీసుకున్నారు. వీరి నియామకం సందర్భంగా ఇచ్చిన జీవో 597లో ప్రభుత్వం ‘ఈ ఇన్‌చార్జీలు 6 నెలలు లేదా ఎన్నికలు జరిగేంత వరకు లేదా ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు.. వీటిలో ఏది ముందయితే అంతవరకు..’కొనసాగుతారని స్పష్టం చేసింది.
అయితే ప్రభుత్వం ఎన్నికలు రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్నందున అధికారులతో ఏర్పాటైన పర్సన్ ఇన్‌చార్జీ కమిటీల స్థానంలో నాన్ అఫీషియల్ పీఏసీఎస్‌లను నియమించాలని నిర్ణయించింది. సహకార చట్టంలో పీఏసీఎస్‌లకు ఏర్పాటయ్యే కమిటీల విషయంలో స్పష్టమైన విధివిధానాలను పొందుపరచడంతో వాటికి అనుగుణంగానే త్రీమెన్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది.
‘వ్యవసాయ సహకార సంఘానికి ఎన్నికలతో ఏర్పాటైన కమిటీ (ఎలక్టెడ్ పీఏసీఎస్) లేదా అధికారులతో కూడిన కమిటీ (అఫీషియల్ పీఏసీఎస్) లేదా అధికారులు కాని వారితో కూడిన కమిటీ (నాన్ అఫీషియల్ పీఏసీఎస్) ఉంటుంది’అనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరచడంతో ‘నాన్ అఫీషియల్ పీఏసీఎస్’లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.


