సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామంపై ఎర్రగొండపాలెం(ప్రకాశం) వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. "తెలంగాణలోనూ రెడ్‌బుక్ అరాచకమే నడుస్తోందా?" అంటూ ప్రశ్నించారు.
నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఎలా సాధ్యమైంది? అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలంగాణ పోలీసులను నిలదీస్తున్నారు. ‘‘చట్టపరమైన ప్రక్రియను పక్కనబెట్టి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. 41(A) నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం చట్టబద్ధమేనా?. ఏపీ తరహాలో తెలంగాణలోనూ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందా?.. వెంటనే నాగార్జున యాదవ్‌ను విడుదల చేసి, ఈ ఘటనపై వివరణ ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు.
గుంటూరులోని తన మామ ఇంట్లో ఉన్న నాగార్జున యాదవ్‌ను ఆదివారం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన సిబ్బందిమని చెబుతూ.. స్థానిక నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే అరెస్ట్‌కు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కారణాలను కూడా స్పష్టంగా చెప్పలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరని ప్రశ్నించినందుకు.. నాగార్జున యాదవ్ భార్యతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. బూతులు తిడుతూ ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చినా స్పందన రాలేదని నాగార్జున కుటుంబ సభ్యులు వాపోయారు.
ఒకే రోజులో మూడు పోలీస్‌స్టేషన్లు తిప్పి..
నాగార్జున యాదవ్‌ను మొదట గుంటూరులోని నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని పురానా హవేలీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. అక్కడ కొంతసేపు ఉంచిన అనంతరం బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఒకే రోజులో మూడు ప్రాంతాలకు తిప్పి తీవ్ర వేధింపులకు గురిచేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఏ కేసులో అరెస్ట్?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై లైవ్ డిబేట్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. అడ్వకేట్ కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 10న హైదరాబాద్‌లోని బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లో నాగార్జున యాదవ్, ఇతరులపై కేసు నమోదు చేశారు. లైవ్ చర్చలో నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 192, 352, 353(1), 353(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ వ్యవహారం వెనుక ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమే ఉందని వైఎస్సార్‌సీపీ అంటోంది.
ప్రభుత్వాన్ని నిలదీసినందుకు.. చంద్రబాబు సర్కార్‌పై రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు బయటకు తీసి కేసు నమోదు చేశారని, చట్టపరమైన నిబంధనలను పాటించకుండా అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇందుకు వినియోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు.


