లేడీ డాక్టర్‌ కారు బీభత్సం.. కానిస్టేబుల్‌ మృతి | Car accident in Ongole | Sakshi
Sakshi News home page

లేడీ డాక్టర్‌ కారు బీభత్సం.. కానిస్టేబుల్‌ మృతి

Jul 13 2026 8:34 AM | Updated on Jul 13 2026 8:34 AM

Car accident in Ongole

 ఒంగోలు టౌన్‌ :  లేడీ డాక్టర్‌ కారు అదుపు తప్పడంతో ఓ కానిస్టేబుల్‌ ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలో రెండ్రోజులుగా గైనకాలజిస్టుల రాష్ట్రస్థాయి వార్షిక సదస్సు జరుగుతోంది. పాండిచ్చేరిలో పీజీ చేస్తున్న నగరానికి చెందిన డాక్టర్‌ మేఘ ఈ సదస్సులో పాల్గొనడానికి ఒంగోలు వచ్చారు. ముంగమూరు సెంటర్‌లో స్నేహితులతో కలిసి కాఫీ తాగి ఆ తర్వాత బయల్దేరారు. కారు నగరంలోని పాత ఎన్‌హెచ్‌–5 పద్మ టవర్స్‌ వద్దకు రాగానే అదుపుతప్పింది. తొలుత మున్సిపల్‌ చెత్త బండిని ఢీకొట్టింది. దాని డ్రైవర్‌ వసంతరావుకు గాయాలయ్యాయి.

 అప్పటికీ మేఘ వాహనాన్ని నియంత్రించలేకపోవడంతో కారు సైకిల్‌ మీద వెళ్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ సురభి మరియదాసు (32)ను వెనక నుంచి ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై కానిస్టేబుల్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. బల్లికురవ మండలం కూకట్లపల్లి గ్రామానికి చెందిన మరియదాసు ఒంగోలు జిల్లా సాయుధ రిజర్వ్‌ (డీఏఆర్‌)లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. రోల్‌కాల్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదంలో మరణించాడు. అతడికి భార్య భారతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయినా ఆగని కారు 
అయితే, ఈ ప్రమాదం తరువాత కూడా కారు ఆగలేదు. మోటారు బైకుపై చర్చికి వెళ్తున్న కొప్పేలు రామ్మోహన్‌రావును కూడా ఢీకొట్టింది.  కానిస్టేబుల్‌ దాసు భార్య సురభి భారతి ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు మేఘపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం జీజీహెచ్‌కు తరలించారు. కారులో మరో ఇద్దరు లేడీ డాక్టర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఎస్పీ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. కొద్ది రోజుల క్రితం ఇదే తరహాలో వేగంగా వస్తున్న కారు ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మహిళలు మృత్యువాతపడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement