రాజధాని రైతులపై వేధింపుల పర్వం | Chandrababu government is troubling Amaravati farmers in various ways | Sakshi
Sakshi News home page

రాజధాని రైతులపై వేధింపుల పర్వం

Jul 13 2026 5:41 AM | Updated on Jul 13 2026 5:47 AM

Chandrababu government is troubling Amaravati farmers in various ways

గుంటూరు జిల్లా పెనుమాకలో పోలిశెట్టి చంద్రశేఖర్, శ్రీనివాసరావు అరటి తోటను ధ్వంసం చేసి పొలం తవ్వేయడంతో పడిపోయిన కరెంటు స్తంభం, కట్‌ చేసిన వైరు

భూమి ఇవ్వకపోవడమే వారు చేసిన నేరం

రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు సర్కార్‌ 

భయభ్రాంతులకు గురిచేసి భూమి లాక్కోవాలనే కుట్ర

ఇవ్వని భూముల్లో రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయించారు.. 

పంటపొలాల చుట్టూ గోతులు తవ్వేసి.. నీళ్లు నింపేశారు.. 

స్తంభాలు కూల్చేసి కరెంటు ఆపేశారు.. 

మోటార్లు.. పంపులు మాయం చేశారు.. 

కరెంటు, నీరు లేక ఎండిపోయిన పంటలు.. 

రైతులకు వచ్చే సబ్సిడీలు, సదుపాయాలన్నీ ఆపేశారు.. 

బలవంతపు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు.. భూమి ఇవ్వకపోతే పంటలను జేసీబీలతో నాశనం చేశారు

అడుగడుగునా ఆ రైతులకు ఇబ్బందులు..  

ఉండవల్లి, పెనుమాక రైతుల పరిస్థితిపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌...

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చేశారని చెప్పారు.. మరి ఇవ్వని రైతులను ఏం చేస్తున్నారు? రకరకాలుగా వేధిస్తున్నారు? భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కునేందుకు ప్రయత్ని­స్తున్నారు. వారి పొలాలకు దారి లేకుండా చేయడం, వారి భూముల్లో కరెంటు స్తంభాలు పడేయడం, మోటార్లు, పైపులు మాయం చేయడం... ప్రభుత్వం చేయాల్సిన పనులు ఇవేనా? రైతులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తే నెలల తరబడి కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదుచేయడం లేదు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో భూములు ఇవ్వని వందలాది మంది రైతుల బాధలు వర్ణనాతీతం.. అసలక్కడ ఏం జరుగుతోంది..? ప్రభుత్వం రైతులకు ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇస్తోంది.. రైతు పరిరక్షణ కమిటీ నాయకులు అక్కడకు వెళుతుంటే ఎందుకు నానా రభస చేశారు? కార్లు ధ్వంసం చేసి చివరకు హత్యాయత్నం వరకూ ఎందుకు వెళ్లారు..? ఉండవల్లి, పెనుమాకలలో భూములివ్వని రైతుల పరిస్థితి ఏమిటి? సాక్షి ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది.. ఆ ప్రాంతంలో జరుగుతున్నదేమిటో రైతులు స్వయంగా చూపించారు. 

వారి గోడు వెళ్లబోసుకున్నారు.. ఆ వివరాలతో సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌...  తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాలలో ఉండవల్లి నుంచి అమరావతి వెళ్లే రహదారిలో రోడ్డుకు ఇరువైపులా జనావాసాల మధ్య ఉన్న వందలాది మంది రైతులు భూ సమీకరణకు తమ భూములను ఇవ్వలేదు. దాంతో వారి భూములను భూ సేకరణ కింద తీసుకుంటామంటూ ప్రభుత్వం, సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. భూములు ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉండటంతో ప్రభుత్వం తమపై రకరకాలుగా కక్ష సాధిస్తోందని రైతులు చెబుతున్నారు. అంతకు ముందు బ్యాంకు రుణాలు వచ్చేవని, ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇవ్వడం ఆపివేశాయని రైతులు పేర్కొన్నారు. తమ పొలాలకు రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారని వారు వాపోతున్నారు. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్‌ తప్పుల తడకగా ఉందని, చనిపోయిన రైతుల పేర్లు కూడా నోటిఫికేషన్‌లో వచ్చాయని, కుటుంబంలో ఆస్తి పంపకాలు చేసుకున్నా అవేవీ ఆన్‌లైన్‌లో కనిపించడం లేదని చెబుతున్నారు.   

రైతుల పొలాల్లో ఇసుక డంపింగ్‌ చేస్తున్న అరాచకమిది 

వేధింపులు రకరకాలు... 
సమీకరణ, భూసేకరణకు భూములు ఇవ్వని రైతులను చాలా రకాలుగా వేధిస్తున్నారు. కొండవీటి వాగుపై పెనుమాక వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌ పక్క పొలాలకు వెళ్లే విద్యుత్‌ స్తంభాలను లారీలతో గుద్ది పడిపోయేలా చేశారు. రైతుల పొలాల్లో ఉండే విద్యుత్‌ మీటర్లు, మోటార్లు మాయం చేసేశారు. దొంగలు మోటార్ల వరకే ఎత్తుకెళ్తారని, బోర్లు పైపులతో సహా తీసుకువెళ్లిపోవడంతో ఇది ప్రభుత్వ పెద్దల దన్నుతో కాంట్రాక్టర్లు చేసిన పనే అని రైతులు అభిప్రాయపడుతున్నారు. రోజూ ఇన్ని లారీలు, ఇన్ని జేసీబీలు, వందలాది మంది మనుషులు తిరుగుతున్న ప్రాంతంలో మోటార్లు, పైపులు ఎవరు ఎత్తుకువెళతారు? కావాలనే ప్రభుత్వం ఈ చోరీలు చేయించిందనే అనుమానాలను స్థానిక రైతులు వ్యక్తం చేస్తున్నారు. బోర్లు, బోరు పైపులు దొంగిలించారని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలల క్రితం ఫిర్యాదు చేశాం. ఎవరూ పట్టించుకోలేదు.  దీంతో అక్కడ వేసిన మొక్కజొన్న, మునగ తోటలు ఎండిపోయాయి. 

ఉండవల్లి పొలాల్లో మోటార్‌ షెడ్‌ను కూల్చేసి.. పొలాల్ని కంకరతో పూడ్చివేయిస్తున్న దాష్టీకానికి నిదర్శనమిదిగో..  

భూములు ఇవ్వని రైతులు పంట పండించుకోనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా కొండవీటి వాగుకు ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండికొట్టి ఆ నీటిని రిజర్వాయర్‌లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు  రిజర్వాయర్‌లోకి చేరి ఈ రైతుల పొలాల చుట్టూ నీరు చేరింది. 15 అడుగుల లోతు ఉన్న రిజర్వాయర్‌ నిండిపోవడంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్‌లో కలిసిపోతోంది.  పది అడుగుల లోతు తీయగానే భారీగా నీటి ఊట వస్తోంది. ఇందులో డ్రెడ్జింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేసి ఇసుకను భారీగా బయటకు తీస్తున్నారు. నీటిని, ఇసుకను బయటకు తీసి వచ్చిన బుసకను లారీ మూడు నుంచి ఆరు వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పెనుమాకకు చెందిన రైతు మేక సాంబిరెడ్డి పొలం పక్కనే కొండవీటి వాగు వెళుతుంది. 

అరటి తోటను జేసీబీతో ధ్వంసం చేస్తున్న రాక్షసత్వానికి రుజువిదిగో.. 

అతని పొలానికి మూడువైపులా రిజర్వాయర్‌ కోసం మట్టి తీశారు. ప్రస్తుతం ఆ పొలంలో మట్టి పెళ్లలు విరిగి కిందపడడంతో ఆ పొలం కూడా రిజర్వాయర్‌లోకి కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలా బెదిరిస్తే భూములు ఇస్తారని ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. మరో రైతు పంటపొలంలో కరెంటు స్తంభాలను లారీలతో గుద్దించి వైర్లు తెంచేశారు. పిల్లల పెళ్లికి పొలాలను రాసి ఇచ్చినా వాటిని అమ్ముకునే పరిస్థితి లేదు. వారికి రిజిస్ట్రేషన్‌ చేసే పరిస్థితి లేకుండా పోయింది. తాము పడుతున్న కష్టాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సీఆర్‌డీఏ రైతు పరిరక్షణ కమిటీని వేసి రైతుల బాధలు వినేందుకు పెనుమాక పంపితే తెలుగుదేశం గూండాలు వారిని మధ్యలోనే అడ్డుకుని దాడికి దిగారని రైతులు వివరించారు.  


పైపులతో సహా ఎత్తుకెళ్లారు 
పెనుమాక గ్రామంలో మా కుటుంబ సభ్యులకు చెందిన ఐదు ఎకరాల పొలాన్ని సాగు చేస్తున్నాను. మూడు నాలుగు నెలల నుంచి కరెంటు స్తంభాలను పడిపోయేలా చేసి కరెంట్‌ లేకుండా చేశారు. తర్వాత కరెంట్‌ మోటార్లు, పైపులతో సహా ఎత్తుకు పోయారు. దీనిపై తాడేపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందనా లేదు. కరెంట్‌లేక నీరందక ఈ పొలంలో వేసిన మునగ, అరటి, మొక్కజొన్న పంటలు ఎండిపోయాయి. భయపెట్టి భూములు ఇచ్చేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోంది.    
    – పొలిశెట్టి వెంకట శ్రీనివాసరావు, రైతు

పూలింగ్‌కు ఇవ్వని భూమిలో రిటర్నబుల్‌ ప్లాట్లు 
నాకు పెనుమాకతో పాటు లింగాయపాలెంలో పొలం ఉంది. లింగాయపాలెంలో 43, 44 సర్వేనెంబర్లలో ఆరు ఎకరాల పొలాన్ని ఇద్దరు కూతుళ్లకు ఇచ్చాను. మేం పూలింగ్‌కు ఇవ్వకపోయినా అందులో 4,300 గజాలు రిటర్నబుల్‌ ప్లాట్లుగా వేశారు. వీటిని 12 మందికి కేటాయించారు. ఇందులో ఇద్దరు వేరే వారికి అమ్ముకున్నారు. అసలు మేం ఇవ్వని భూములను కేటాయించడానికి, అమ్ముకోవడానికి వారికేం హక్కు ఉంది. దీన్ని ప్రశి్నస్తే ఇప్పుడు భూసేకరణ నోటీసులు ఇచ్చారు. పెనుమాక­లో కూడా పది ఎకరాల పొలం ఉంది. ఇందులో
తోట వేశాం. దీనికి కూడా నోటీసు ఇచ్చారు. వీటిపై కోర్టుకు వెళ్లడానికి సిద్ధం అవుతున్నాను.   
– మేకా వెంకటరెడ్డి, రైతు

రెండో విడత ఇవ్వాలంటే భయంగా ఉంది 
తొలి విడతలో పూలింగ్‌ కింద 1.30 భూమిని ఇచ్చాను. తుళ్ళూరు రెవెన్యూ పరిధిలో నాకు రిటర్నబుల్‌ ప్లాటు ఇచ్చారు కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలియదు. 12 ఏళ్ళు అవుతున్నా అభివృద్ది చేసి ఇవ్వలేదు. అమ్ముకుందామంటే కాగితాలపై తప్ప నేలపై కనబడటం లేదు. ఇప్పుడు రెండో విడతలో ఇవ్వాల్సింది 20 ఎకరాల భూమి ఉంది. ఇస్తే ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. 
– చుండు వెంకటరెడ్డి, రైతు వడ్డమాను గ్రామం

రెండో విడతలో భూములిచ్చి ఇబ్బందులు పడుతున్నాం
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైను ఉందా లేదా... ఉంటే ఏఏ గ్రామాల కింద ఏఏ సర్వే నెంబర్లలో పోతుంది? ఎప్పుడు శంఖుస్థాపన చేస్తారు? త్వరితగతిన పూర్తయ్యేందుకు వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టర్లకు ఇస్తే మీకు ఇబ్బంది ఏమిటి? వైకుంఠపురం వంతెన ఎప్పుడు నిర్మిస్తారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఉంటే కదా రెండో విడత చురుగ్గా రైతులు భూములిచ్చేది. రెండో విడత పూలింగ్‌కు భూములిచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం. 
 – చుండు నర్సిరెడ్డి, రైతు

పొలం చుట్టూ చెరువు తవ్వేశారు 
భూసేకరణ చట్టం ప్రయోగించి మా నుంచి బలవంతంగా భూములు సేకరించాలని ప్రభుత్వం రెండు నెలల క్రితం నోటీసు ఇచ్చింది.  మేం దానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని చెప్పి, పోరాడుతున్నాం. మేం ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌కి భూములు ఇవ్వలేదని రిజర్వాయర్‌ పేరుతో మా పొలాల పక్కన 30 అడుగుల లోతులో చెరువు తవ్వేశారు. దీనివల్ల మా పొలం మట్టిగెడ్డలు చెరువులో విరిగి పడుతున్నాయి. పొలానికి రెండుపక్కల తవ్వేశారు. కొంతమంది రైతులకైతే పొలంలోకి వెళ్లేందుకు దారి కూడా లేదు. మా పక్క రైతుకు నాలుగు వైపులా తవ్వేశారు. మేమైతే భూసమీకరణకి భూములు ఇవ్వదలుచుకోలేదు. 12 సంవత్సరాల క్రితం పూలింగ్‌లో భూమి ఇచ్చిన రైతే ఇంతవరకు అతని రిటర్న్‌ ఫ్లాట్‌లోకి అడుగు పెట్టలేకపోయాడు. ఇవన్నీ కళ్లారా చూస్తూ కూడా భూములు ఎలా ఇవ్వాలి.         
    – కళ్ళం శ్రీకాంత్‌రెడ్డి, రైతు

పొలంలో మోటారు వైర్లు కట్‌ చేసి పైపులైన్లు తీసేశారు
సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ నిర్మాణానికి నాకున్న 29 సెంట్లు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారు. నా భూమిని రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు సిద్ధపడి 9.3 ఫారాన్ని అందజేశాను. నాకు వచ్చే కమర్షియల్, రెసిడెన్షియల్‌ ప్లాట్లు ఉండవల్లిలోని పెద్దడొంక, చిన్న డొంక వెంట ఇవ్వాలని సీఆర్‌డీఏ అధికారులను కోరాను. నాకు ప్లాట్లు కేటాయించిన తరువాత నా భూమిపై పూర్తి హక్కు కల్పిస్తానని ఉండవల్లి సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్‌ హామీ ఇచ్చారు. ఉండవల్లిలో గ్రామసభ జరుగుతున్న రోజు సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ నిర్మించే కాంట్రాక్టర్లు నీటి వాటా వచ్చే పూలింగ్‌ పొలంలో ఉన్న నా మోటారు వైర్లు కట్‌ చేసి పైపులైన్లు తీసేశారు. అదేరోజు గ్రామ సభలో నేను ప్రశ్నించగా మోటర్‌ కనెక్షన్‌ ఇస్తామని చెప్పి నేటికీ ఇప్పించలేదు. నా పొలానికి రెండు వైపులా సీడ్‌ యాక్సెస్‌రోడ్‌ నిర్మాణం చేపట్టారు. నా అరటితోట చుట్టూ మెరకచేసి రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. సీఆర్‌డీఏ అధికారుల మాటలు నీటిపై రాతల్లాంటివి. అందుకే ఉద్యమబాటతో పాటు న్యాయపోరాటానికి సిద్ధమౌతున్నాం.     – అనంత శివరావు, రైతు

మా పొలానికి దారి లేకుండా చేశారు 
పెనుమాకలో మాకు తాతల హయాం నుంచి పొలం ఉంది.  మాకు బ్యాంకులు రు­ణా­లు ఇవ్వడం ఆపేశాయి. భూముల రిజిస్ట్రేషన్లు కూడా ఆపే­శారు. ఆస్తుల పంపకాల కోసం మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే మీ పొలంలో నుంచి రోడ్డు వెళ్తుందని చెప్పారు. సర్వే కోసం పెడితే వారు ఎటువంటి రోడ్డు వెళ్లడం లేదని చెప్పారు. దీనిపై రాతపూర్వకంగా ఇమ్మంటే ఇవ్వడం లేదు. నువ్వు కోర్టుకు వెళ్తే మా ఉద్యోగాలు పోతాయంటున్నారు. ఈ అంశంపై సీఆర్డీఏ కమీషనర్‌ను కలిసినా ప్రయోజనం లేక­పోయింది. ఇప్పుడు  మాకు పంట నష్ట పరిహారం గాని, క్రాప్‌లోన్లు గాని ఇవ్వడం లేదు. రైతులకిచ్చే సబ్సిడీలు, ఫర్టిలైజర్స్‌ మీద ఇచ్చే సబ్సిడీలు ఏమీ ఇవ్వడంలేదు. కరెంట్‌ ఉండదు, కరెంట్‌  స్తంభాలు పడిపోయాయి అంటారు. రోడ్లన్నీ తవ్వేశారు. ఈ చుట్టుపక్కల చెరువులన్నీ తవ్వేశారు. వెళ్లడానికి దారి లేకుండా చేసేశారు. మేము రైతులు కాదని కొంతమంది అంటున్నారు. పర్లేదు, మేము రైతులు కాకపోతే మాకు భూసేకరణ నోటీసు ఎందుకు ఇచ్చారు. మేము ఇంకా పొలాలు ఇవ్వనే లేదు. అప్పుడే మాపై దాడులు జరుగుతున్నాయి. అదే పొలాలు ఇచ్చి ఉంటే అసలు మమ్మల్ని ఊర్లో కూడా ఉండనిచ్చేవాళ్లు కాదేమో. ఇవన్నీ కూడా తలుచుకుంటేనే భయమేస్తుంది.     
– నవీన్, రైతు, పెనుమాక 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement