కానూరు ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం | Massive fire accident At Auto Nagar | Sakshi
Sakshi News home page

కానూరు ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం

Jul 13 2026 5:43 AM | Updated on Jul 13 2026 5:43 AM

Massive fire accident At Auto Nagar

దగ్ధమవుతున్న బస్సులు

ఏడు ప్రైవేట్‌ బస్సులు అగ్నికి ఆహుతి  ప్రాథమికంగా రూ.1.5కోట్ల మేర నష్టం  

సాక్షి, విజయవాడ/పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని జేఆర్‌డీ టాటా ఇండ్రస్టియల్‌ ఎస్టేట్‌ (కొత్త ఆటోనగర్‌)లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు ప్రైవేట్‌ బస్సులు దగ్ధమయ్యాయి. పెనమలూరు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఎం.శేఖర్‌ అనే వ్యక్తి కానూరు ఆటోనగర్‌లో బస్సుల మరమ్మతుల షెడ్డును నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆ షెడ్డుకు వివిధ ప్రాంతాల నుంచి 20 ప్రైవేట్‌ బస్సులు మరమ్మతుల కోసం వచ్చాయి. సాధారణంగా ఆదివారం మధ్యాహ్నం వరకు షెడ్డులో కార్మీకులు పని చేస్తారు.

అయితే, షెడ్డు యజమాని శేఖర్‌ తన కార్మీకులకు గుంటూరు జిల్లా మోరంపూడిలో ప్రత్యేక విందు ఏర్పాటు చేయడంతో అందరూ వెళ్లారు. ఆదివారం షెడ్డు మూసి ఉంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు షెడ్డు గ్యారేజీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాచ్‌మెన్‌ వెంటనే సమీపంలో ఉన్న కార్మీకులకు చెప్పడంతో కొందరు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

అదే సమయంలో షెడ్డు యజమాని బంధువు తన సెల్‌ఫోన్‌లో సీసీ కెమెరా లింకు ద్వారా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుసుకుని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. మూడు అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. అప్పటికే ఐదు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. మరో రెండు పాక్షికంగా దగ్ధమయ్యాయి.  

సీసీ ఫుటేజీ పరిశీలించిన తర్వాతే... 
ఈ ప్రమాదంలో సుమారు రూ.1.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. పాక్షికంగా కాలిన బస్సుల నంబర్ల ఆధారంగా పరిశీలన చేయగా, వాటికి ఇన్సూరెన్స్‌ గడువు ముగిసినట్లు గుర్తించారు. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణంగా ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని, గ్యారేజీ యజమాని వచ్చాక సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన తర్వాతే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తేలుతుందని తెలిపారు. ఆదివారం రాత్రి వరకు షెడ్డు యజమాని అందుబాటులోకి రాలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం వరకు వేచి చూస్తామని, అప్పటికి ఆయన అందుబాటులోకి రాకపోతే తామే పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేయిస్తామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement