breaking news
kanuru
-
కానూరు ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, విజయవాడ/పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని జేఆర్డీ టాటా ఇండ్రస్టియల్ ఎస్టేట్ (కొత్త ఆటోనగర్)లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు ప్రైవేట్ బస్సులు దగ్ధమయ్యాయి. పెనమలూరు పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఎం.శేఖర్ అనే వ్యక్తి కానూరు ఆటోనగర్‌లో బస్సుల మరమ్మతుల షెడ్డును నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఆ షెడ్డుకు వివిధ ప్రాంతాల నుంచి 20 ప్రైవేట్ బస్సులు మరమ్మతుల కోసం వచ్చాయి. సాధారణంగా ఆదివారం మధ్యాహ్నం వరకు షెడ్డులో కార్మీకులు పని చేస్తారు.అయితే, షెడ్డు యజమాని శేఖర్ తన కార్మీకులకు గుంటూరు జిల్లా మోరంపూడిలో ప్రత్యేక విందు ఏర్పాటు చేయడంతో అందరూ వెళ్లారు. ఆదివారం షెడ్డు మూసి ఉంది. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు షెడ్డు గ్యారేజీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాచ్మెన్ వెంటనే సమీపంలో ఉన్న కార్మీకులకు చెప్పడంతో కొందరు వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.అదే సమయంలో షెడ్డు యజమాని బంధువు తన సెల్ఫోన్లో సీసీ కెమెరా లింకు ద్వారా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుసుకుని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. మూడు అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదుపు చేశాయి. అప్పటికే ఐదు బస్సులు పూర్తిగా కాలిపోయాయి. మరో రెండు పాక్షికంగా దగ్ధమయ్యాయి. సీసీ ఫుటేజీ పరిశీలించిన తర్వాతే... ఈ ప్రమాదంలో సుమారు రూ.1.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. పాక్షికంగా కాలిన బస్సుల నంబర్ల ఆధారంగా పరిశీలన చేయగా, వాటికి ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లు గుర్తించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణంగా ఉందా? అనేది ఇప్పుడే చెప్పలేమని, గ్యారేజీ యజమాని వచ్చాక సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన తర్వాతే ఈ ప్రమాదం ఎలా జరిగిందనేది తేలుతుందని తెలిపారు. ఆదివారం రాత్రి వరకు షెడ్డు యజమాని అందుబాటులోకి రాలేదని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. సోమవారం ఉదయం వరకు వేచి చూస్తామని, అప్పటికి ఆయన అందుబాటులోకి రాకపోతే తామే పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేయిస్తామని తెలిపారు. -
పోలీస్ VS చక్రవర్తి, ఒక్కడిని విసిరి పడేసాడు
-
విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళవారం కానూర్(పెనుమలూరు) కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిల్డింగ్‌ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది.ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టులు, సానుభూతిపరులు పట్టణాళ్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు ఆరుగురు అనుమానాస్పద రీతిలో పట్టుబడ్డారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. న్యూ ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నారని నిర్ధారణ అయ్యింది. భారీగా ఆయుధాలు డంప్ చేసి ఉంటారని భావించిన అధికారులు.. అక్టోపస్ పోలీసుల సాయంతో భవనాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ పరిణామంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
విజయవాడలో ఘోరం
విజయవాడ: ఆవేశం ఆ ఇల్లాలిలోని మానవత్వాన్ని చంపేసింది. కొడుకులా చూసుకోవాల్సిన మరిదిపైనా, చెల్లెలిలా చూసుకోవాల్సిన ఆడపడుచుపైనా కక్షపెంచుకునేలా చేసింది. కసాయిగా మారిన వదినే ఆ ఇద్దరి పాలిట అపరకాళికను చేసింది. విజయవాడలో సంచలనం రేకెత్తించిన సంఘటన కానూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు.. పైఫోటోలో కనిపిస్తోన్న మహిళ పేరు ముంతాజ్. మానసిక వ్యాధితో బాధపడుతోన్న ఆడపడుచు హసీనా వైద్యానికి భర్త సంపాదన ఖర్చు చేస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. పెళ్లికి ముందు వరకు తనతో బాగుండిన మరిది ఖలీల్ ఇప్పుడు పట్టించుకోకపోవడంతో పగపట్టింది. ఇద్దరినీ అంతమొందించాలని స్కెచ్ వేసింది. కుట్రలో భాగంగా హసీనా, ఖలీల్‌లపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ ఘటనలో ఆడపడుచు హసీనా అక్కడికక్కడే మృతిచెందింది. 80 శాతం గాయాలతో కొట్టుమిట్టాడుతోన్న ఖలీల్‌ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంతాజ్ ఇంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. -
కానూరులో దారుణం
విజయవాడ: నగరంలోని కానూరులో దారుణం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం కానూరులో కోటేశ్వరరావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. కన్న తండ్రి మృతదేహంతోనే అదే ఇంటిలో నాలుగు రోజులుగా కుమారుడు ఉంటున్నాడు. కోటేశ్వరరావు చనిపోయి నాలుగు రోజులు కావడంతో శవం కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటేశ్వరరావు కుమారుడి మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని పోలీసులు గుర్తించారు. అయితే మానసిక రోగి అయిన కుమారుడు తండ్రిని హతమార్చాడా..? లేక అనారోగ్యంతోనే కోటేశ్వరరావు మృతి చెంది వుంటాడా అనే కోణంలో పోలీసుల విచారణ చేస్తున్నారు. -
పెద్ద నోట్ల రద్దు ఏకపక్ష చర్య
కానూరు(పెనమలూరు) : పెద్ద నోట్ల రద్దు ఏకపక్ష చర్య అని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 12వ వర్ధంతి సందర్బంగా కానూరులో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. పల్లంరాజు మాట్లాడుతూ దేశంలో పరిపాలనాపరంగా అనేక మార్పులు తీసుకువచ్చింది పీవీయేనని అన్నారు. ఆయన పాలనలో అన్ని వర్గాల వారికి మేలు జరిగిందని తెలిపారు. బీజేపీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దు కారణంగా పేదలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. చాలా మంది బ్యాంకుల వద్దే ప్రాణాలు వదిలారని, దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహనరావు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో పేదలే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెలగపూడికి ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మొవ్వా మోహనరావు, వింతా సంజీవరెడ్డి, ఎన్.మాధవి, ఎస్వి.రాజు, వెలిశిల సుబ్రహ్మణ్యం, కిలారు వెంకటరత్నం, జవహర్లాల్ నెహ్రూ, చిర్రావూరు రవి, నాగదాసు ప్రవీణ్, నెర్సు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మోపిదేవికి గాయాలు
-
మోపిదేవి కుటుంబానికి తప్పిన ప్రమాదం
విజయవాడ: వైఎస్ఆర్ సీపీ నేత, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఆయన ప్రయాణిస్తున్న కారు బుధవారం ఉదయం కృష్ణాజిల్లా కానూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి మోపిదేవి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య, కుమార్తెకు స్వల్ప గాయలయ్యాయి. గాయపడినవారిని విజయవాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడినవారికి ఎలాంటి ప్రమాదం లేదని, హఠాత్తుగా ప్రమాదం జరగటంతో వారు షాక్‌కు గురైనట్లు వైద్యులు తెలిపారు. మోపిదేవి కుటుంబం హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


