వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకి తృటిలో ప్రమాదం తప్పింది. గోదావరి పుష్కరాలలో పాల్గొనేందుకు ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో మోపిదేవి వెంకటరమణతోపాటు ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పుష్కరాల కోసం కుటుంబ సభ్యులతో కలసి మోపిదేవి వెంకటరమణ బుధవారం రాజమండ్రి బయలుదేరారు. ఆ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని విజయవాడ సమీపంలోని ఎనికేపాడు వద్ద గన్నవరం నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెంకటరమణ, ఆయన భార్య అరుణ, కుమార్తె జస్మిత్, కుమారుడు రాజీవ్ స్వల్పంగా గాయపడ్డారు. అయితే అరుణ నుదిటపై స్వల్ప గాయం కావడంతో సీటీ స్కాన్ చేసి పరిస్థితి సాధారణంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 24 గంటల పాటు ఆమెను అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడడంతో అతడికి ప్రాథమిక చికిత్స చేశారు.