సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ వెలవెల
మందులు లేక రోగులు విలవిల
సర్జికల్ ఐవీ క్యానులాకు కటకట
పేద రోగుల జేబులకు చిల్లు
బాబు ‘ఏఐ’ బడాయి కబుర్లు
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఏఐ డాక్టర్లను తీసుకొస్తాం.. టెక్నాలజీతో రోగాలను మాయం చేస్తాం...!’ అంటూ పిట్టల దొరలా సీఎం చంద్రబాబు చెబుతున్న కబుర్లకు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులకు పొంతన లేకుండా ఉంది. అనారోగ్యం బారిన పడి ప్రభుత్వాస్పత్రులను ఆశ్రయిస్తున్న నిరుపేద రోగులకు ఉచితంగా మందులు అందించకుండా బాబు సర్కార్ చేతులెత్తేస్తోంది. మందులు, సర్జికల్స్ బయట కొనుక్కోవాలంటూ ఆస్పత్రుల్లో చీటీలు రాసి పంపేస్తున్నారు.
గత రెండేళ్లుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఇదే దుస్థితి నెలకొంది. రోజు రోజుకు సమస్య విషమిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పెద్దాస్పత్రుల్లో సెలైన్, ఇంజెక్షన్ ఇచ్చేందుకు వినియోగించే ఐవీ క్యాన్యులా, సర్జికల్ గ్లౌజులు, సెలైన్ సెట్లు, కాటన్, బ్యాండేజ్ లాంటి ప్రాథమిక పరికరాలకూ తీవ్ర కొరత ఏర్పడిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏది?
మందులు, సర్జికల్స్‌ను ప్రభుత్వం పూర్తిస్థాయిలో సెంట్రల్ డ్రగ్ స్టోర్స్(సీడీసీ)లలో అందుబాటులో ఉంచడం లేదు. ఆస్పత్రుల నుంచి ఇండెంట్ పెట్టిన మందులు, సర్జికల్స్ ఫార్మసీ కౌంటర్‌లలో లభ్యం కావడం లేదు. అన్ని జీజీహెచ్‌లలో సర్జికల్స్‌కు కొరత తీవ్రంగా ఉన్నట్లు ఫిర్యాదులున్నాయి. సర్జరీ, అనస్థీషియా లాంటి వివిధ విభాగాల నుంచి రోజువారీ అవసరాల కోసం పెడుతున్న ఇండెంట్‌లో 10–20 శాతం మేర మాత్రమే ఇస్తున్నారని ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ వైద్యుడు తెలిపారు.
రోగులకు మత్తు ఇవ్వడం కోసం వాడే థెమిస్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన బ్యూపివాకైన్ వాడకాన్ని ఇటీవల నిషేధించారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఔషధం అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొద్ది నెలలుగా సర్జికల్ గ్లౌజ్‌లు సైతం సరిపడా సరఫరా కావడం లేదని పలువురు సూపరింటెండెంట్‌లు వెల్లడించారు. కొన్ని రకాల సర్జికల్స్ ఆన్‌లైన్‌లో సీడీఎస్‌లో ఉన్నట్లు కనిపించినా ఇండెంట్ పెడితే మాత్రం సరఫరా కావడం లేదని తెలిపారు.
సగం మందులు, సర్జికల్స్ నిల్
పెద్దాస్పత్రుల్లో 712 రకాల మందులు, 377 రకాల సర్జికల్స్ అందుబాటులో ఉండాలి. అయితే వీటిలో సగం కూడా లభ్యం కాని దుస్థితి దాపురించింది. మెజార్టీ సీడీసీల్లో 300 నుంచి 400 లోపు రకాల మందులే అందుబాటులో ఉంటున్నాయి. 100 రకాల వరకు సర్జికల్స్ ఉండటం లేదు. అందుబాటులో ఉన్న మందులు, సర్జికల్స్ సైతం ఆస్పత్రుల అవసరాలకు సరిపడా లేవు. సుమారు వంద రకాలకుపైగా మందులు, 50 రకాలకుపైగా సర్జికల్స్ నిల్వలు నామమాత్రంగా ఉన్నాయి.
మందులు, సర్జికల్స్ కోసం ఆస్పత్రుల నుంచి వేల సంఖ్యలో ఇండెంట్‌లు పెడుతుంటే వందల్లో కూడా సరఫరా కావడం లేదు. అజిత్రోమైసిన్, అమోక్సలిన్, ఐవీ ఫ్లూయిడ్స్, ఆక్సిటోసిన్, ఐ–డ్రాప్స్, హీమోఫీలియా బాధితులకు అవసరమైన ఫ్యాక్టర్ ఇంజెక్షన్‌లకు జీజీహెచ్‌ల్లో కొరత ఉందని ఫిర్యాదులున్నాయి. హైబీపీ, తీవ్రమైన షుగర్ జబ్బు బాధితులకు ఇచ్చే ఖరీదైన మందుల సరఫరా లేకపోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది.
మందుల బడ్జెట్‌కు కోత
2024లో చంద్రబాబు సర్కార్ గద్దెనెక్కిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యరంగం పరిస్థితి పూర్తిగా తారుమారు అయింది. 2014–19 మధ్య టీడీపీ సర్కార్ మందుల కోసం కేవలం రూ.216 కోట్లు విదల్చగా ఆ బడ్జెట్‌ను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.700 కోట్లకు తీసుకెళ్లింది. తిరిగి గద్దెనెక్కిన బాబు సర్కారు బడ్జెట్‌ను తగ్గించాలని వైద్య శాఖపై ఒత్తిడి చేస్తోంది.
దీంతో మందుల బడ్జెట్ తగ్గించాలని సూపరింటెండెంట్‌లను ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. 2025–26 ఆరి్థక సంవత్సరానికి మందుల కోసం రూ.200 కోట్ల అదనపు నిధులు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా విదల్చలేదు. బడ్జెట్ లేకపోవడంతో జనవరి నుంచి మందుల కొనుగోళ్ల ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతూ వచ్చింది. ఆ సమస్య తీవ్రతరమై ప్రస్తుతం ఆస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌కు కటకటలాడుతున్న పరిస్థితి ఏర్పడింది.


