ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అత్యధికంగా పవన విద్యుత్ ఉత్పత్తి
ఈసారి ఎల్‌నినో ప్రభావంతో గాలుల తీవ్రత తగ్గే అవకాశం
దానివల్ల పవన విద్యుత్ ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గుతుందని అంచనా
జల విద్యుత్ ఉత్పత్తి పైనా ఎల్‌నినో ప్రభావం
ఎక్కువగా థర్మల్ విద్యుత్‌పైనే ఆధారపడితే పెరగనున్న ధరలు
మళ్లీ 1997–98, 2015–16 నాటి పరిస్థితి వస్తుందేమోననే నిపుణుల ఆందోళన
సాక్షి, అమరావతి: దేశంలో ఎల్‌నినో ప్రభావం ఈసారి వ్యవసాయంపైనే కాదు... విద్యుత్ రంగంపైనా తీవ్రంగా పడే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ నుంచి సెపె్టంబర్ వరకు పవన విద్యుత్ అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కాలం. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో గాలులు బలహీనపడితే పవన విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోతుందని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం 56.8 గిగావాట్ల పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది. ఇది దేశంలోని మొత్తం ఉత్పత్తి సామర్థ్యం అయిన 520 గిగావాట్లలో 10.9 శాతం. పవన విద్యుత్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం సాధారణంగా 38 శాతం వరకు ఉంటుంది.
కానీ, ఈ ఏడాది అది 31 శాతానికి పడిపోవచ్చని అంచనా. అంటే దాదాపు 7 శాతం పాయింట్ల తగ్గుదల, లేదా ప్రస్తుతం లభించే విద్యుత్‌తో పోలిస్తే 18 నుంచి 20 శాతం తక్కువగా ఉత్పత్తి నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు విద్యుత్ డిమాండ్ మాత్రం విపరీతంగా పెరుగుతోంది. ఈ ఏడాది దేశంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 272 గిగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ ప్రాథికార సంస్థ (సీఈఏ) అంచనా వేసింది. ఇప్పటికే ఈ ఏడాది మే నెలలో 270.8 గిగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదై కొత్త రికార్డు నెలకొంది.
జల విద్యుత్‌పైనా ప్రభావం
ఎల్‌నినో కారణంగా వర్షాలు కూడా తక్కువగా కురిసే అవకాశం ఉండటంతో జలవిద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుందని ఇంధన రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే 39.8 శాతం తక్కువగా నమోదైంది. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గితే జలవిద్యుత్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దానికితోడు పవన విద్యుత్ కూడా తగ్గితే... విద్యుత్ అవసరాల కోసం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలపై మరింతగా ఆధారపడాల్సి వస్తుంది.
1997–98, 2015–16లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఆయా సంవత్సరాల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్లు విద్యుత్ రంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తే విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరగడం, బొగ్గు వినియోగం అధికమవడం, డిస్కంలపై ఆర్థిక భారం పెరగడం ఖాయమని చెబుతున్నారు.
పవన విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది.. ఎలా తగ్గుతుందంటే..
» పవన విద్యుత్ ఉత్పత్తి గాలి వేగంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గాలి వేగం 3–4 మీటర్లు/సెకన్ ఉంటే విండ్ టర్బైన్ తిరగడం ప్రారంభమవుతుంది.
» గాలివేగం సెకనుకు 6–9 మీటర్లు ఉంటే విద్యుత్ బాగా ఉత్పత్తి అవుతుంది.
» అదే గాలివేగం సెకనుకు 12–15 మీటర్లు ఉంటే చాలా టర్బైన్లు తమ గరిష్ట సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి.
» సెకనుకు 25 మీటర్ల కంటే ఎక్కువగా గాలి వేగం ఉంటే భద్రత కోసం టర్బైన్‌లను నిలిపివేస్తారు.
» భారత వాతావరణ పరిస్థితులపై చేసిన పలు అధ్యయనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావం వల్ల పవన విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైన గాలి వేగం సగటున 5 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది.
» గాలి వేగం తగ్గితే దానికి అనుగుణంగా పవన విద్యుత్ ఉత్పత్తి మరింతగా తగ్గుతుంది. గాలి వేగం 10 శాతం తగ్గితే విద్యుత్ ఉత్పత్తి సుమారు 25 శాతం నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది.
» గాలి వేగం 15 శాతం తగ్గితే విద్యుత్ ఉత్పత్తి 35 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ గణాంకాలు మారుతుంటాయి.
పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 56.8 గిగావాట్లు
పవన విద్యుత్ ప్లాంట్ల సామర్థ్య వినియోగం 38 శాతం
పవన విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుందని అంచనా 20 శాతం


