ఫేస్‌బుక్‌ ప్రేమ.. మగబిడ్డకు జన్మనిచ్చిన నర్సింగ్‌ విద్యార్థిని! | nursing student gives birth | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌ ప్రేమ.. మగబిడ్డకు జన్మనిచ్చిన నర్సింగ్‌ విద్యార్థిని!

Jul 13 2026 8:19 AM | Updated on Jul 13 2026 8:19 AM

nursing student gives birth

అనంతపురం సిటీ: ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారింది. ఆపై పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించిన యువకుడు ఆమెతో శారీరక అవసరాలు తీర్చుకున్నాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చి, మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే యువతితో తనకు ఎలాంటి సంబంధమూ లేదని యువకుడు బుకాయించాడు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య ఐసీడీ­ఎస్‌ అధికారులు శిశువును తమ ఆ«దీనంలో ఉంచుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన యువతి(21) బీఎస్సీ నర్సింగ్‌ చదువుతోంది. ఏడాది క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా జిల్లాకే చెందిన ఓ యువ­కుడు ఆమెకు పరిచయమయ్యాడు. 

ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. ఈ క్రమంలోనే గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకుందామని యువతి అతడిని అభ్యర్థించింది. తనకు కొంత సమయం కావాలంటూ ఆమెను మభ్యపెడుతూ వచ్చాడు. శరీరంలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో యువతి కొన్ని నెలలుగా ఇంటికి కూడా వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయింది. చివరకు ‘నీతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు’ అంటూ యువకుడు ముఖం చాటేశాడు. ఈ క్రమంలో యువతికి నెలలు నిండడంతో శనివారం రాత్రి పురిటినొప్పులు మొదలయ్యాయి. సహచర విద్యార్థులు నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి­లో చేర్చగా అదే రోజు రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. 

విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆదివారం అనంతపురానికి వచ్చి యువకుడిని సంప్రదించగా తనకు సంబంధం లేదని  బుకా­యించాడు. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గాలేని కారణంగా శిశువును తాము పోషించలేమని యువతి తల్లిదండ్రులు  ఇతరులకు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఇది తెలుసుకున్న ఐసీడీఎస్‌  అధికారులు ఆస్పత్రికి చేరుకుని సదరు యువతి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. శిశువును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సీడబ్ల్యూసీ వద్ద శిశువును హాజరుపరిచి, ఆమె ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని సాజిదా బేగం తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement