సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పజెప్పాలనే ప్రయత్నం జరుగుతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేసి.. ఆగం చేయకండి. ప్రజాభిప్రాయం లేకుండా మున్సిపల్ విభజన జరుగుతుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చార్మినార్‌లో కలుపుతున్నారు. రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పజెప్పుతున్నారా?. పాతబస్తీలో నీళ్ల బిల్లులు, కరెంట్ బిల్లులు కడతారా?. కట్టని వారితో మా జిల్లా ప్రజలను ఎందుకు కలుపుతున్నారు?. మెజారిటీగా హిందూ ప్రజలున్న గ్రామాలను చార్మినార్‌లో కలపడం సరైంది కాదు. పాతబస్తీలో బిల్లుల ఎగవేత వల్ల వాటర్ బోర్డ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు నష్టాల పాలవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లాల గ్రామాలను చార్మినార్‌లో కలపడం వల్ల, ఆ జిల్లా ప్రజల బ్రతుకులు ఆగం అవుతాయి. మాకు గులాంలు కొట్టడం తెలీదు. గులాంలు కొట్టే బ్రతుకులు మావి కాదు. హైదరాబాద్‌కు ఆర్థిక వనరు రంగారెడ్డి. జిల్లా ఖజానా అంతా నాడు కేసీఆర్ ఫామ్ హౌస్‌కు తరలిపోయింది. నేడు ఎంఐఎం ఇలాకాలోకి పంపేందుకు ప్రయత్నం జరుగుతుంది. పన్నులు కట్టేవారిని, పన్నులు కట్టనివారితో కలపకండి. రంగారెడ్డి జిల్లాపై అనేక అపోహలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాను ముక్కలు చేయకండి. ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. ప్రజాభిప్రాయం తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.


