‘కారు’ పంక్చరైంది.. 

MP Bandi Sanjay comments over brs - Sakshi

ఇనుప సామాను కింద కూడా కొనే పరిస్థితి లేదు.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ 

అధికారంలోకి వస్తే మధ్యంతరమే 

కేసీఆర్‌కు అధికారమిస్తే మళ్లీ అప్పులే చేస్తారు... మహబూబ్‌నగర్‌లో ఎంపీ బండి సంజయ్‌ 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/కరీంనగర్‌టౌన్‌: ‘కారులోని నాలుగు టైర్లు పంక్చరైనయ్‌.. ఆ కారును ఇనుప సామాను కింద కూడా కొనే పరిస్థితి లేదు. కారును తీసుకుపోయి సచివాలయం గుమ్మటాలకు వేలాడదీయడం తథ్యం. డిసెంబర్‌ 3న కేసీఆర్‌ మాజీ సీఎం కావడం ఖాయం’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ జోస్యం చెప్పారు. మహబూబ్‌నగర్‌లో బొక్కలోనిపల్లి, క్లాక్‌టవర్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి భగవంత్‌ కుబా, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి మిథున్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్‌ మధ్య సీఎం సీటు లొల్లి మొదలైందన్నారు. ఇక కాంగ్రెస్‌లో అందరూ సీఎంలేనని, బీఆర్‌ఎస్, లేదా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సర్కార్‌ కుప్పకూలిపోవడం ఖాయమని, మధ్యంతర ఎన్నికలు తథ్యమని అన్నారు.

‘పాలమూరు సహా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రమే నిధులిస్తోంది. మరి కేసీఆర్‌ చేసిందేమిటి? ఊరూరా బెల్టుషాపులు పెట్టి మందు తాగించడం, ఒక్కో తలపై రూ.1.27 లక్షల అప్పు చేయడం తప్ప. బీజేపీ అధికారంలోకి వస్తేనే అప్పులన్నీ తీరి, మీకు న్యాయం జరుగుతుంది. నెత్తిమీద అప్పులున్నోడికి అధికారం ఇస్తే మళ్లీ అప్పులే చేస్తడు. కేసీఆర్‌ కూడా అట్లనే..’అని సంజయ్‌ విమర్శలు గుప్పించారు. 

తప్పులన్నీ కేసీఆర్‌ చేసి.. 
‘కేసీఆర్‌ ఒక్క ప్రాజెక్టు తీసుకురాలే. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కమీషన్లకు వాడుకున్నడు. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణా నీళ్లు తీసుకుంటామని సంతకం పెట్టింది కేసీఆర్‌ కాదా? కేంద్రం ట్రిబ్యునల్‌ వేస్తామని చెప్పిన తర్వాత కూడా ఏడాది వరకు సుప్రీంకోర్టులో కేసు వాపస్‌ తీసుకోనిది కేసీఆర్‌ కాదా..? తప్పులన్నీ కేసీఆర్‌ చేసి.. మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని అంటున్నడు’అని బండి ధ్వజమెత్తారు.

‘ఒకప్పుడు కేసీఆర్‌కు సొంత ఇల్లు లేదు. అప్పు చేస్తే ఫైనాన్సోళ్లు కారు గుంజుకుపోయిండ్రు. దొంగ పాస్‌ పోర్టుతో యువకులను మోసం చేసిండు. అట్లాంటి కేసీఆర్‌ రూ.లక్ష కోట్లు ఎట్లా సంపాదించిండు.. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే నాపై కేసులు పెట్టి జైలుకు పంపిండు. ఇయాళ నన్ను తిట్టడానికి కేసీఆర్‌ కరీంనగర్‌ పోయిండు’అని మండిపడ్డారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలి.. 
మీకోసం ఎన్నడైనా రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌రెడ్డి కొట్లాడి జైలుకు పోయారా? మీ పక్షాన నిలిచిందెవరో.. మిమ్మల్ని మోసం చేసిందెవరో.. ఒక్కసారి ఆలోచించండి. అసలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు ఎందుకు ఓటెయ్యాలి అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. పువ్వు గుర్తు ప్రభుత్వం వస్తేనే పేదల బతుకులు బాగుపడతాయని, పొరపాటున కులాల పేరుతో మోసపోయి ఓట్లు వేస్తే అటు ఇటు కాకుండా ఆగమైపోతారని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ముస్లిం ఓట్లకోసం ప్రలోభపెట్టడం తప్ప వాళ్లకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్సోళ్లు ముస్లిం మతపెద్దలను నమ్ముకుంటే.. కేసీఆర్‌ ఒవైసీని నమ్ముకున్నారని విమర్శించారు.  

రాజకీయాలకన్నా హిందూ ధర్మమే ముఖ్యం 
‘నాకు రాజకీయాలకన్నా ధర్మమే ముఖ్యం. హిందూ ధర్మం కోసం అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు కూడా వెనకాడను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలాంటోడు, రాజాసింగ్‌ లాంటివాళ్లను గెలిపించకపోతే ఇకపై ఎవరూ హిందూ ధర్మం గురించి మట్లాడేవారుండరు. నాకు మత పిచ్చి అయితే.. కేసీఆర్‌కు మందుపిచ్చి’ అని బండి అన్నారు. శుక్రవారం రాత్రి కరీంనగర్‌లోని వివిధ డివిజన్లలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘కరీంనగర్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ సభలో సీఎం కేసీఆర్‌ నాకు మత పిచ్చి ఉందన్నాడు. మరి నీకేం పిచ్చి? మందు పిచ్చి. బరాబర్‌ హిందూ ధర్మం గురించి మాట్లాడుతూనే ఉంటా. భయంకరమైన హిందువు అని చెప్పుకున్న కేసీఆర్‌ హైదరాబాద్‌ పాతబస్తీకి పోవాలంటే ఒవైసీ పర్మిషన్‌ కావాలట.

కేసీఆర్‌ అధికారంలోకి రాకపోతే నమాజ్‌ చేసే అవకాశం ఉండదని చెబుతున్న కేటీఆర్‌ గుడి గురించి ఎందుకు మాట్లాడడు. నాపై 74 కేసులు పెట్టారు. నేనేమైనా గంగుల కమలాకర్, పురమళ్ల శ్రీనివాస్‌ లెక్క భూకబ్జాలు చేశానా? ఉద్యోగుల పక్షాన కొట్లాడితే నా ఆఫీస్‌ ధ్వంసం చేసి నన్ను జైలుకు పంపారు. 30వ తేదీన పువ్వుగుర్తుపై ఓటేసి గెలిపించండి’అని ఓటర్లను అభ్యర్థి0చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top