కలెక్టర్లకే లేని ఆర్భాటం మీకెందుకు?
కాలానుగుణంగా శాఖను మార్చేద్దాం
సీఎం రేవంత్ సూచనతో రిజిస్ట్రేషన్ల శాఖ కీలక ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. దశాబ్దాలుగా ఉన్న ఓ ఆనవాయితీకి ఆ శాఖ స్వస్తి పలకనుంది. క్వాసీ జ్యుడీషియల్ (పాక్షిక న్యాయపరమైన) అధికారాలున్న సబ్‌రిజిస్ట్రార్ల చుట్టూ వారి కార్యాలయాల్లో ఉండే పోడియంలు ఇక నుంచి మాయం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్లంతా పోడియంలు తొలగించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాలు జారీ చేశారు. పోడియం ఉన్నప్పుడు ఫొటోను, తొలగించిన తర్వాతి ఫొటోను పంపాలని ఆ ఆదేశాల్లో ఆయన స్పష్టం చేశారు. దీంతో రాష్ట్రంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియంల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది.
నిజాం కాలం నుంచే..: వాస్తవానికి నిజాం కాలం నుంచే సబ్‌రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలుండేవి. వారికి క్వాసీ జ్యుడీషియల్ అధికారాలను చట్టం కల్పించింది. డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయించేటప్పుడు క్రయ, విక్రయదారులు, సాక్షుల స్టేట్‌మెంట్లను తీసుకోవడంతోపాటు వీలునామాలను విచారించే అధికారం కూడా ఉండటంతో న్యాయస్థానాల తరహాలో వారికి పోడియంలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు ట్రెజరీ, జ్యుడీషియల్ అధికారులు సెలవులో ఉన్నప్పుడు పాత కాలంలో ఆ బాధ్యతలను సబ్‌రిజిస్ట్రార్లకు అప్పగించే వారు. సబ్‌రిజిస్ట్రార్లు సెలవులో వెళ్తే జ్యుడీషియల్ అధికారులు ఈ బాధ్యతలు నిర్వహించేవారు.
అయితే కాలానుగుణంగా చాలా మార్పులు రావడం, ఇప్పుడు అన్ని శాఖలు వేటికవే పనిచేస్తుండటంతో రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందుకనుగుణంగా మార్పును ఆహ్వానించాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు తెలిసింది. కలెక్టర్లకే లేని ఆర్భాటం సబ్‌రిజిస్ట్రార్లకు ఎందుకని ప్రశ్నించిన ఆయన.. పోడియంల తొలగింపుపై ఉన్నతాధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పోడియంలను తొలగించనున్నారు.


