రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో కానరాని కనీస సదుపాయాలు
70 శాతం హాస్టళ్లలో గీజర్లు పనిచేయక వణుకుతూనే విద్యార్థుల చన్నీటి స్నానాలు
కిటికీలకు తలుపుల్లేక తంటాలు..పుస్తకాలు అడ్డుపెట్టి సరిపెట్టుకుంటున్న వైనం
చలిమంటలతో జాగారం... దగ్గు, జలుబుతో సతమతం
హాస్టళ్లలో ఉండేందుకు జంకు.. వరుస సెలవులొస్తే ఇళ్లకు పరుగులు
‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి సమస్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నడూలేని స్థాయి లో చలి పంజా విసురుతుండటంతో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు అరకొర సదుపా యాల మధ్య అల్లాడిపోతున్నారు. పనిచేయని గీజర్ల వల్ల పగలు ఓవైపు చన్నీటి స్నానాలు చేస్తూ కిటికీల్లేని తలుపులతో రాత్రిళ్లు కంటిమీద కునుకు కరువై అనారోగ్యం బారినపడుతున్నారు. హాస్టళ్లలో ఉండేందుకు జంకుతూ వరుసగా రెండు రోజుల సెలవులు వచ్చినప్పుడల్లా ఇళ్లకు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సాయంత్రం 4 దాటితే చలికి గజగజ
రాష్ట్రంలో ఈ నెల ప్రారంభం నుంచే రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచే మొదలవుతున్న చలిగాలులు.. రాత్రి 10 గంటలు దాటితే మరింత తీవ్రమవుతున్నాయి. దీంతో గదులన్నీ మంచు గడ్డలను తలపిస్తూ కాలు పెడితే మొద్దుబారి పోతున్నాయి. హాస్టళ్లలో సాధారణ దుప్పట్లనే విద్యార్థులకు ఇస్తుండటం వల్ల అవి చలిని ఏమాత్రం ఆపడం లేదు. అయితే ఇళ్ల నుంచి సొంతంగా దుప్పట్లు, రగ్గులు, స్వెటర్లు తెచ్చుకున్న విద్యార్థులు మాత్రం వాటిని కూడా కప్పుకుంటున్న పరిస్థితి చాలా చోట్ల ఉంది. ఇళ్ల నుంచి దుప్పట్లు తెచ్చుకోలేని వారు మాత్రం నిద్రపట్టక సతమతమవుతున్నారు. మరోవైపు రా త్రిళ్లు చలి కారణంగా విద్యార్థులెవరూ పుస్తకం పట్టే పరిస్థితి ఉండట్లేదని హాస్టళ్ల సిబ్బంది అంటున్నారు.
సదుపాయాలు అంతంతే..
చాలా హాస్టళ్లలో తలుపులు బాగున్నా కిటికీలకు రంధ్రాలు లేదా సందులుంటున్నాయి. వెంటిలేటర్లకూ తలుపుల్లేని పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కొన్నిచోట్ల కిటికీలకు దుస్తులు, దుప్పట్లు అడ్డంపెడుతుంటే మరికొన్ని చోట్ల పుస్తకాలను అడ్డుపెట్టాల్సి వస్తోంది. కిటికీలకు తెరలు లేకపోవడం వల్ల దోమల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోంది.
పనిచేయని గీజర్లు... చల్లనీళ్లే దిక్కు
హాస్టళ్లలో గీజర్ల సదుపాయం ఉన్నప్పటికీ చాలా చోట్ల ఫిలమెంట్లు కాలిపోయిన వాటిని మరమ్మతులు చేయించకపోవడం వల్ల అందరికీ వేడినీళ్లు అందట్లేదు. అలాగే విద్యార్థులంతా ఉదయం కాస్త చలి తగ్గాక నిద్రలేచి ఏకకాలంలో స్నానాలకు వెళ్తుండటం వల్ల కూడా ఇదే సమస్య వస్తోందని.. మొత్తంగా 70 శాతం హాస్టళ్లలో చల్లనీళ్లతోనే విద్యార్థులు స్నానం చేస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. నిత్యం చన్నీటి స్నానాల వల్ల చాలా మంది విద్యార్థులు జలుబు, దగ్గులతో అనారోగ్యం బారిన పడుతున్నారని అంటున్నారు.
వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇదీ..
⇒ సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట జ్యోతిరావు ఫూలే బాలుర పాఠశాలలోని 350 మంది విద్యార్థులు వణుకుతూనే చన్నీటి స్నానం చేస్తున్నారు.
⇒ ఖమ్మం జిల్లాలో ఎస్సీ, బీసీ వసతిగృహాల విద్యార్థులకు కార్పెట్, బ్లాంకెట్‌లు, చలికోట్లు అరకొరగానే అందజేశారు. గీజర్లు పనిచేయట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లకు కిటికీలు విరిగినా ఓనర్లు పట్టించుకోవడం లేదు.
⇒ నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టళ్ల గదులకు కిటికీలు, తలుపుల్లేవు. గీజర్ సైతం లేకపోవడంతో రేకు డబ్బాల్లో నీటిని వేడి చేసుకోవడానికి విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు.
⇒ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్‌లో ఉంటున్న 90 మంది విద్యార్థులకు వేడినీటి సౌకర్యం లేక చన్నీటి స్నానాలు చేయాల్సి వస్తోంది. ఇదే మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో 86 బాలికలు ఉండగా సోలార్ ప్లాంట్ పాడవడంతో బోర్ నీటితోనే స్నానాలు చేస్తున్నారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్‌లో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్‌లో 56 మంది, బెగ్గర్స్ హాస్టల్‌లో 42 మంది విద్యార్థులకు వేడినీటి సౌకర్యం లేదు. రెంజల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో 112 మంది విద్యార్థులతోపాటు నవీపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్‌లో 85 మంది, బీసీ హాస్టల్‌లో 70 మంది బోర్ నీటి కుళాయిల కిందే స్నానాలు చేస్తున్నారు.
⇒ ఆదిలాబాద్ జిల్లాలోని కొలం, ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు చన్నీటి స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. కిటికీలు పగిలిపోవడంతో రాత్రిళ్లు చలిమంటలు వేసుకొని కాలం గడుపుతున్నారు.
⇒ నిర్మల్ జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ విద్యార్థులకు చన్నీటి స్నానం తప్పట్లేదు. సారంగాపూర్ మండలంలోని ఆశ్రమ పాఠశాలలో కిటికీలకు తలుపుల్లేక పుస్తకాలనే అడ్డుపెట్టారు. జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్‌లో రగ్గులు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకున్న బెడ్‌షిట్స్‌తోనే సరిపెట్టుకుంటున్నారు.


