సీఎం విజయ్‌కి బిగ్ షాక్.. కూటమి తొలి మీటింగ్‌లోనే భారీ ట్విస్ట్! | Left parties to skip cm Vijay meeting | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌కి బిగ్ షాక్.. కూటమి తొలి మీటింగ్‌లోనే భారీ ట్విస్ట్!

Jul 1 2026 9:42 PM | Updated on Jul 1 2026 9:50 PM

Left parties to skip cm Vijay meeting

సాక్షి,చెన్నై: టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు అదిలోనే హంసపాదు ఎదురైంది.  రాజకీయంగా ఒక కీలక పరిణామం ఎదురైంది. టీవీకే ప్రభుత్వానికి తాము కేవలం బయటి నుంచే మద్దతు ఇస్తామని వామపక్షాలు స్పష్టం చేశాయి. అందుకు ఊతం ఇచ్చేలా.. సీఎం విజయ్‌ అధ్యక్షతన జరిగిన కూటమి భాగస్వామ్య పార్టీల తొలి సమావేశానికి లెఫ్ట్ పార్టీల నాయకులు గైర్హాజరయ్యారు.

రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కూటమి పార్టీలతో కలిసి సీఎం విజయ్‌ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీకి టీవీకే మిత్రపక్షాలైన కాంగ్రెస్‌, వీసీకే, ఐయూఎంఎల్‌, ఎండీఎంకే పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ బి. మాణిక్యం ఠాగూర్, సీనియర్ నాయకుడు పి. చిదంబరం, వీసీకే అధినేత తొల్ తిరుమావళవన్, ఎండీఎంకే నాయకుడు వైకో, ఐయూఎంఎల్ అధ్యక్షుడు కె.ఎం. ఖాదర్ మొహిదీన్‌లతో పాటు టీవీకే సీనియర్ నేతలు, మంత్రులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో.. మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం, ఐదేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర ఇంధన, న్యాయశాఖ మంత్రి సీటీఆర్‌ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. టీవీకే నేతృత్వంలోని ఈ కూటమికి ఒక ప్రత్యేక పేరును పెట్టాలనే ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు. దీనిపై సీఎం విజయ్‌ కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులతో మరోసారి చర్చించి త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని చెప్పారు.

నిర్మల్ కుమార్ వ్యాఖ్యలను సమర్థిస్తూ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ ఎస్. జోతిమణి మాట్లాడారు. టీవీకే, దాని భాగస్వామ్య పక్షాలకు ముఖ్యంగా లౌకికవాద సిద్ధాంతాలపై ఒకే రకమైన స్పష్టత ఉన్నందున ఈ కూటమి చాలా బలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో తమ ఆలోచనలన్నింటినీ సీఎం విజయ్ చాలా శ్రద్ధగా విన్నారని ఆమె పేర్కొన్నారు. కాగా, కూటమి కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు త్వరలోనే ఒక సమన్వయకర్తను (కోఆర్డినేటర్) నియమించే అవకాశం ఉందని టీవీకే వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement