మళ్లీ వచ్చేది ఇచ్చేదీ కేసీఆరే  | KTR on a visit to Greater Warangal | Sakshi
Sakshi News home page

మళ్లీ వచ్చేది ఇచ్చేదీ కేసీఆరే 

Oct 7 2023 3:56 AM | Updated on Oct 7 2023 3:56 AM

KTR on a visit to Greater Warangal - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:  ఎన్నికల టైం కాబట్టి పొలిటికల్‌ టూరిస్టులు వస్తున్నారని, కేవలం ఎన్నికలప్పుడు వచ్చే ఆ పొలిటికల్‌ టూరిస్టుల మాటల నమ్మి ఆగం కావద్దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్లు ప్రతిపక్షాలు వస్తాయని, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. కేసీఆర్‌ పథకాలను కాపీకొట్టి, నాలుగు ఓట్లు డబ్బాలో వేయించుకోవాలని ప్రయత్నం చేసేవారిని అస్సలు నమ్మవద్దని కోరారు.

స్కీములు అమలవుతున్న తెలంగాణలో ‘స్కాములు’చేసేందుకు వస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు, వచ్చాక ఎలా ఉందో గమనించాలని, కులమత భేదాలు లేకుండా అడగకున్నా ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చింది కేసీఆరేనని, మళ్లీ వచ్చేది, ఇచ్చేది కూడా కేసీఆరేనని స్పష్టం చేశారు. కేటీఆర్‌ శుక్రవారం గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో సుడిగాలి పర్యటన చేశారు.

హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీలో సుమారు రూ.900 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. మడికొండలో క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమకొండ ‘కుడా’మైదానంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ అధ్యక్షతన, ఖిలా వరంగల్‌ గ్రౌండ్‌లో ఎమ్మెల్యే నరేందర్‌ అధ్యక్షతన జరిగిన ప్రగతి నివేదన బహిరంగ సభల్లో ప్రసంగించారు.  

వంచించాలని చూస్తే పుట్టగతులుండవ్‌.. 
తెలంగాణ ప్రజలను ఇంకా మాయమాటలతో వంచించాలని చూస్తే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు పుట్టగతులుండవని కేటీఆర్‌ హెచ్చరించారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని కాంగ్రెస్‌ వాళ్లు ఇప్పుడు ఏదో చేస్తామంటే ఎలా నమ్ముతామని, అధికారం ఉన్నచోట అభివృద్ధిని విస్మరించిన బీజేపీ ఇక్కడేమి చేస్తుందని ప్రశ్నించారు. అధికారం కోసం ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ‘చరిత్రలో వాస్తవాలు దాచినా దాగవు. 1956లో హైదరాబాద్‌ సంస్థానం ఒక రాష్ట్రంగా ఉంటే.. బలవంతంగా తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్సే.

1968లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఖమ్మం, వరంగల్‌లో అందరూ కలిసి కదం తొక్కితే ఆ రోజు కర్కశకంగా 370 మంది పిల్లల్ని పిట్టల్లా కాల్చి చంపింది. 30 ఏళ్ల తర్వాత 2001లో గులాబీ జెండా ఎగిరితే అదిరిపోయి కాంగ్రెస్‌ తెలంగాణ నినాదాన్ని అందుకుంది. తెలంగాణ ఇస్తామని నమ్మబలికి 2004లో పొత్తు పెట్టుకుని 2014 వరకు పదేళ్లు చావగొట్టింది. వేలమంది చావులను కళ్ల చూసిన తర్వాత.. మీ అందరి పోరాటంతో ప్రజాశక్తి ముందు తలవంచక తప్పని పరిస్థితి వస్తే అనివార్యంగా కాంగ్రెస్, బీజేపీ కలిసొచ్చాయి. విధిలేని పరిస్థితుల్లోనే తెలంగాణ జపం చేశాయి..’అని కేటీఆర్‌ చెప్పారు. 

ఉద్యమానికి ఊపిరిలూదింది ఓరుగల్లే..  
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి ఊపరిలూదింది ఓరుగల్లు గడ్డే. మీ అందరికీ రుణపడి ఉంటాం. వరంగల్‌లో 24 అంతస్తుల్లో అతిపెద్ద ఆస్పత్రి నిర్మిస్తున్నాం. దసరా నాటికి అది పూర్తవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత అన్ని జిల్లాల్లో బ్రహ్మండంగా మెడికల్‌ కాలేజీలు వచ్చా­యి. ప్రభుత్వ ఖర్చుతో మన పిల్లలు డాక్టర్లు అయ్యే పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే సీఎం శుభవార్త చెబుతారు. ఆసరా పెన్షన్లు ఎంతో పెంచబోతున్నామో స్వయంగా కేసీఆరే ప్రకటిస్తారు. కేసీఆర్‌ మత రాజకీయం చెయ్యరు. ఆయన అన్ని మతాలను సమానంగా చూసే నాయకుడు..’అని మంత్రి అన్నారు. 

భవిష్యత్‌ అంతా ద్వితీయ శ్రేణి నగరాలదే.. 
‘దేశంలో భవిష్యత్‌ అంతా ద్వితీయశ్రేణి నగరాలదే. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు వరంగల్‌కు తేడా ఉండదు. మడికొండ ఐటీ పార్కులో నూతనంగా నిర్మించిన క్వాడ్రంట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ద్వారా 500 మందికి ఉపాధి లభిస్తుంది. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్, ఖమ్మం, నల్లగొండ వంటి నగరాలు, పట్టణాలకు పరిశ్రమలు తీసుకువస్తోంది. వరంగల్‌లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకూ ఐటీ సంస్థలు రావాలి. అక్కడా ఐ టీ సంస్థలు పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నా. కావాలంటే జగనన్నకు చెప్పి నేను మీకు జాగా ఇప్పిస్తా.

బెంగళూరు ఐటీ రంగంలో 40 శాతం తెలుగువాళ్లే. అక్కడి నుంచి వచ్చేందుకు తెలుగు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. ఉన్నచోటే మన యువతకు ఉపాధి దక్కేలా చూద్దాం..’అని కేటీఆర్‌ అన్నారు. వినయన్న మాస్‌ లీడర్‌ అంటూ అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరు దయాకర్, ఎమ్మెల్యేలు ఆరూరి రమే‹Ù, నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, కడియం శ్రీహరి, వరంగల్‌ నగర మేయర్‌ గుండు సుధారాణి  తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement