వెక్కిరిస్తున్నాయి..
ఎత్తిపోతలను త్వరగా పూర్తిచేయాలి
కొనాయమాకుల ఎత్తిపోతల పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. రైతులు ఈ పథకం ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అవసరమైన నిధులు మంజూరయ్యే విధంగా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి.
– సిరిసె శ్రీకాంత్, కొనాయమాకుల
పిల్లర్ల దశలోనే వదిలేశారు..
గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం భవనాన్ని మంజూరు చేసింది. కొమ్మాల అంగడిలో దీన్ని పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. కాంట్రాక్టర్‌ను అడిగితే నిధులు మంజూరు చేయడం లేదన్నారు. మూడేళ్ల నుంచి పనులు ముందుకు సాగటం లేదు. త్వరగా నిధులను మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టాలి.
– ఆంగోతు వీరన్న, హర్జ్యతండా సర్పంచ్
గీసుకొండ: జిల్లాలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని పనులు నిధుల లేమితో నిలిచిపోయాయి. నిర్మాణ దశలో ఉన్న జిల్లా స్థాయి భవనాల నిర్మాణం సైతం మధ్యలోనే ఆగిపోయి దిష్టిబొమ్మల్లా వెక్కిరిస్తున్నాయి. వరంగల్ నగరానికి గీసుకొండ మండలం సమీపంలో ఉండటంతో ఇక్కడ పలు జిల్లా భవనాలను నిర్మించడానికి పనులను చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత భవనాల నిర్మాణ పనులు పూర్తి కావడంలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొనాయమాకుల ఎత్తిపోతల పథకం ఏళ్లు గడుస్తున్నా.. రైతులకు సాగు నీరు అందించని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
2017 నుంచి నత్తనడకే..
మండలంలోని కొనాయమాకుల వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ ప్రధాన కాల్వ నీటిని పైకెత్తి పోసి రైతుల చేలకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టారు. 2017లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకం పనులకు శంకుస్థాపన చేయగా అప్పటి నుంచి ఎందుకో ఏదో ఓ సమస్యతో పనులు పూర్తికావడం లేదు. దీంతో రైతులకు 18 ఏళ్లుగా సాగినీటి కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రాజెక్టు పూర్తయితే గీసుకొండ మండలానికి 7,446, దుగ్గొండి 4,509, సంగెం మండలంలో 2,166 ఎకరాల (మొత్తంగా 14వేలు) భూములకు సాగు నీరు అందే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పలుమార్లు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తామన్నారు. అయినా ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించడం లేదని రైతులు నిరాశతో ఉన్నారు.
బాలల భవన నిర్మాణం అంతే..
మండలంలోని కొనాయమాకుల గ్రామం వద్ద మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా 2022 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, గత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు రూ. 87.45 లక్షల అంచనా వ్యయంతో బాలల భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. తల్లిదండ్రులను కోల్పో యి అనాథలుగా మిగిలిని వారికి, బస్టాండు, రైల్వేస్టేషన్లలో తప్పిపోయిన చిన్నారులకు ఆశ్రయం ఇవ్వడానికి ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు నిధులలేమితో మధ్యలోనే నిలిచిపోయాయి. త్వరగా నిధులు మంజూరు చేయించి ఉపయోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైన ఉంది.
గిరిజన భవన నిర్మాణ పరిస్థితి దారుణం..
మండలంలోని కొమ్మాల అంగడి వద్ద చేపట్టిన గిరిజన భవన నిర్మాణం పనులు తొలి దశలోనే నిలిచిపోయాయి. గత ప్రభుత్వం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో గిరిజన భవనాన్ని నియోజకవర్గ స్థాయిలో మంజూరు చేసింది. నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ. 50 లక్షల మేర ఖర్చు చేసి పిల్లర్ల దశ మేరకు నిర్మాణం పనులను చేపట్టారు. బిల్లుల కోసం అధికారుల వద్దకు వెళితే నియోజకవర్గ కేంద్రంలో భవనాన్ని నిర్మించాల్సి ఉండగా ఇక్కడెందుకు చేపట్టారని చెప్పడంతో వివాదం నెలకొని పనులు నిలిచిపోయాయి.
ఏళ్లు గడుస్తున్నా.. పూర్తికాని
కొనాయమాకుల ఎత్తిపోతల పథకం,
జిల్లా బాలల, గిరిజన భవనాల నిర్మాణం
ఇబ్బందులు పడుతున్న ప్రజలు
వెక్కిరిస్తున్నాయి..
వెక్కిరిస్తున్నాయి..
వెక్కిరిస్తున్నాయి..


