మరో చాన్స్ ప్లీజ్!
నర్సంపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు ‘మరో చాన్స్ ప్లీజ్’ అంటూ తమ పార్టీ నేతలను వేడుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయిన వారు ప్రత్యామ్నాయ ప్రయత్నంపై దృష్టి సారించారు. జిల్లాలో 11 జెడ్పీటీసీ, 130 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి సర్పంచ్‌గా గెలుపొందాలని ఆశపడి భంగపడ్డ నేతలు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఓడిపోయిన వ్యక్తులు తమ బలాబలాలను అంచనా చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపొందే పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. సర్పంచ్‌గా పోటీ చేసి పరాజయం పాలైన అభ్యర్థులే రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తే సానుభూతితో పాటు ఓడిపోయిన స్థానంలోనే గెలుపొందవచ్చని అంచనా వేసుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్థులు రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలుపొందాలని ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకోసం అన్ని వర్గాల ఓటర్లను మద్దతు కూడగట్టుకొని ముందుకు సాగుతున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందడానికి ఏఏ వర్గాలు, సంఘాల సభ్యులు ఓట్లు వేశాయి, ఎవరు ఓట్లు వేయలేదు, ఎక్కడ లెక్క తప్పిందనే అంచనాలను వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగవచ్చని అంచనా వేసుకుంటూ తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీలకు చెందిన అధినేతల వద్ద తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటూ టికెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీటుపైఆశావహుల గురి
సర్పంచ్‌గా ఓటమి పాలైన అభ్యర్థుల ముమ్మర ప్రయత్నాలు
సానుభూతి కలిసి వస్తుందని ముందడుగు
జిల్లాలో 11 జెడ్పీటీసీ, 130 ఎంపీటీసీ స్థానాలు
సానుభూతి కలిసివస్తుందని..
జిల్లాలో 130 ఎంపీటీసీ స్థానాలు, 11 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం రెండు నెలల నుంచి సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోగా తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశావహులు పోటీ చేశారు. అయినప్పటికీ ఓటమి పాలైన వ్యక్తులు మండల స్థాయిలో రాజకీయ పలుకుబడితో గెలిచే అవకాశం ఉన్న వారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి టికెట్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని, అందులో ఎలాగైన గెలుపొందాలని ఉద్దేశంతో రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేసేందుకు కసరత్తు మొదలపెట్టారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.


