పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
నర్సంపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఐ పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పంజాల రమేశ్ అన్నారు. శుక్రవారం సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఎగుర వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీ ఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసి 101 సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టి సమస్యలు పరిష్కరించిందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు అయితే యాకోబు, అక్కపెల్లి రమేశ్, జిల్లా సమితి సబ్యులు మియాపురం గోవర్ధన్, గుంపెల్లి మునీశ్వర్, నాయకులు బాధబోయిన యాదగిరి, సాంబయ్య పాల్గొన్నారు.
గురుకుల పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానం
నర్సంపేట రూరల్: సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులు జనవరి 21వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, ఎంపికై న విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఉచిత భోజన వసతితో పాటు విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మొక్కజొన్న పంట ధ్వంసం
సంగెం: మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన గాయపు వీరారెడ్డి తన తల్లిదండ్రులు పంచి ఇచ్చిన 2.18 ఎకరాల్లో పట్టా చేయించుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన అన్న కుమారుడు గాయపు రవీందర్‌రెడ్డి గతేడాది నుంచి పంట వేయనియకుండా అడ్డుకుంటున్నాడని, ఈనెల 25న ట్రాక్టర్‌తో 20 గుంటల భూమిలోని మొక్కజొన్న పంటను దున్ని ధ్వంసం చేశాడని వీరారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవీందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మొసలి లభ్యం
నర్సంపేట రూరల్: మొసలి లభ్యమైన సంఘటన నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామశివారులోని శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఫారెస్టు రేంజర్ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామానికి చెందిన రైతు సూర్యకు చెందిన వ్యవసాయ భూమిలో మొసలి సంచరిస్తుందని సమాచారం ఫారెస్టు అధికారులకు అందించారు. వెంటనే ఫారెస్టు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ మొసలిని పట్టుకొని పాకాల చెరువులో విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ యోగి, వెంకన్న, బేస్ క్యాంప్ చందు తదితరలు పాల్గొన్నారు.
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం


