ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రకటనలు భలే తమాషాగా ఉంటాయి. జనం నమ్ముతారా? లేదా? అన్నదానితో ఆయనకు నిమిత్తం ఉండదు. ప్రజలు వింటున్నారా? లేదా? అన్నదానితో సంబంధం ఉండదు. తన టీమ్ రాసిచ్చిన స్క్రిప్ట్‌లోని పాయింట్లను అన్నిటిని చెప్పానా? లేదా? అన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఆయా సభలలో చేసిన ఒక వ్యాఖ్య చూడండి.
'బటన్ నొక్కితే పైశాచిక ఆనందం ఉంటుంది తప్ప ప్రజలను కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకునే పరిస్థితి ఉండదు" అని ఆయన అన్నారు. ఇది గత ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన పరోక్ష ఆరోపణ అని తెలుస్తూనే ఉంది. కాని ప్రజలు తమకు ప్రభుత్వంలో ఉన్నవారు ఇస్తామన్న సంక్షేమ స్కీమ్‌లు ఇచ్చారా? లేదా? తమకు ఆర్థిక ప్రయోజనం చేకూరిందా? లేదా? అన్నది చూస్తారు తప్ప, తమ ఇంటికి ముఖ్యమంత్రి వచ్చి పెన్షన్ అందించారా?లేదా? అని ఎవరైనా ఆలోచన చేస్తారా? అసలు ఇలాంటి వ్యాఖ్యలు చంద్రబాబు ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం లేకపోలేదు.
గత జగన్ ప్రభుత్వం వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్ అందించడమే కాకుండా, వారికి అన్ని అవసరాలలోనూ వెన్నంటి ఉండేవారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్లడం అంటే ఏమిటో ఆ రోజుల్లో జనం చూశారు. ఆ వ్యవస్థ ప్రజల మన్ననలు పొందిందని గుర్తించారు. అంతే! వెంటనే పరకాయ ప్రవేశం చేసేశారు. తాము వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, జగన్ ఐదువేల రూపాయల గౌరవ వేతనం మాత్రమే ఇస్తున్నారని, టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే పదివేలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రకటన చేశారు. పైగా అది కూడా తెలుగువారంతా పవిత్రంగా భావించే ఉగాది నాడు పూజలు చేసి మరీ చంద్రబాబు ఈ ఉపన్యాసం ఇచ్చారు.
ఎవరినైనా మోసం చేయాలనుకుంటే వారికి ఏదైనా ఆశ చూపాలని ఒక సినిమా డైలాగు ఉంటుంది. అందులో ఒక వ్యక్తి తనకు భోజనం చేయడానికి డబ్బు లేదని సాయం చేయాలని రోడ్డు పక్కన ఉన్న ఒకాయనను అడుగుతాడు. అతను డబ్బు ఇవ్వడానికి అంగీకరించడు. పైగా తిడతాడు. ఆ తర్వాత అదే వ్యక్తి తన వద్ద ఉన్న వాచ్ ఖరీదు ఐదువేలు అని, తనకు అత్యవసరం కనుక 500 రూపాయలకే ఇవ్వాలని అనుకుంటున్నానని, తీసుకోండని రోడ్డు పక్కన నిలబడి ఉన్న అతనినే కోరతాడు. నిజానికి దాని ఖరీదు 150 రూపాయలే. ఆ వాచ్‌ను పరిశీలించిన అతను 400 రూపాయలకు ఇస్తే తీసుకుంటానని అంటాడు. ఆ రకంగా వాచ్ అమ్మిన వ్యక్తి లాభపడతాడన్నమాట.
ఆశకు లొంగి రెండో వ్యక్తి మోసపోయాడన్నమాట. ఈ కథకు, చంద్రబాబు ప్రకటనకు నేరుగా సంబంధం ఉందా? లేదా అన్నది పక్కనబెడితే, ప్రజలను ఆశపెట్టి వారికి ఆకర్షించడంలో చంద్రబాబు సిద్దహస్తుడే అన్న అభిప్రాయం ఉంది. ఆ రకంగా వలంటీర్లను వలలో వేసుకుని, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి మొత్తం వలంటీర్ల వ్యవస్థకే పంగనామాలు పెట్టారు. దాంతో అంతకుముందు జగన్ టైమ్‌లో ఇచ్చిన ఐదువేల గౌరవ వేతనం రాకుండా పోయింది. అలాగే ప్రజలు తమ ఇళ్లవద్దనే అందుకుంటున్న సేవలకు మంగళం పలినట్లయింది. పైగా పెన్షన్ ఇవ్వడానికో, లేదా మరో కార్యక్రమం నిమిత్తమో చంద్రబాబు ప్రత్యేక హెలికాఫ్టర్ వేసుకుని వెళతారు. దీనికి లక్షల్లో ఖర్చు చేయాలి. అలాగే వెళ్లిన గ్రామంలో సభ నిర్వహణకు మరిన్ని లక్షల రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు చేయాల్సి ఉంటుంది.
వృద్దాప్య పెన్షన్ జగన్ టైమ్‌లో మూడువేల రూపాయలు ఉండేది. దానిని వలంటీర్ల ద్వారా మొదటి తేదీ తెల్లవారేసరికల్లా అందించేవారు. ఇప్పుడు దానికి ఒక వెయ్యి రూపాయలు కలిపి నాలుగువేల రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు హెలికాఫ్టర్ టూర్ చేయడం గొప్ప సంగతి అని ప్రొజెక్టు చేసుకుంటున్నారు. ఒక ఇంటికి వెళితేనే ఆయనకు అంత తృప్తి అయితే, వైఎస్సార్‌సీపీ హయాంలో అందరి ఇళ్లకు వలంటీర్లు వెళ్లి పెన్షన్ అందిస్తే, అది ఆనాటి ముఖ్యమంత్రి జగన్ ప్రతి ఇంటికి వెళ్లి ఇచ్చినట్లవ్వదా! అన్నది వైఎస్సార్‌సీపీ ప్రశ్న. పోనీ ఇలా గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడైనా చేశారా? అంటే లేదు.
1995 నుంచి 2004 వరకు, 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన పవర్ లో ఉన్నారు కదా! ఆ టైమ్‌లో ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? ఇప్పుడు వలంటీర్ల బదులు గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇళ్లకు పంపే ప్రయత్నం చేస్తున్నారు కాని, అది అంత సఫలం అవుతున్నదా? అన్నది చర్చ ఉంది. కాగా సచివాలయ ఉద్యోగులను కూడా ప్రభుత్వం వేధిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది ఈ వేధింపులను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా జరిగాయి.
గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఒక్కటే కాదు. పౌరసరఫారాల శాఖ అందించే బియ్యం, ఇతర వస్తువులను కూడా వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఇవ్వడం లేదే! అప్పట్లో ప్రత్యేకంగా వ్యాన్‌లు పెట్టి సరుకులను డోర్ డెలివరీ చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులకు వెళ్లి జనం సరుకులు తీసుకోవలసి వస్తోంది. అనేక చోట్ల ప్రజలు క్యూలలో, రద్దీలో గుమికూడవలసి వస్తోంది. ఇది ప్రజలకు సౌకర్యం కల్పించినట్లు అవుతుందా? ఇదే కాదు.. ప్రజలు అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో కాని, అప్లికేషన్‌లు పెట్టుకోవడంలో కాని, అనేక రకాలుగా వలంటీర్ల సేవలను ప్రజలు పొందేవారు. ఆ వ్యవస్థను తీసివేసి కనీసం వివరణ కూడా ఇవ్వలేదు.
వలంటీర్లు ఆందోళనలు చేసి కూటమి ప్రభుత్వంలో తమ ఖర్మ ఇంతేలే అని సరిపెట్టుకున్నారు. జగన్ కూడా కొన్ని స్కీమ్‌ల అమలు నిమిత్తం ఆయా చోట్ల సభలు నిర్వహంచకపోలేదు. అయినా జగన్ బటన్ నొక్కడమే చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అది వేరే సంగతి. విపక్షంలో ఉన్నప్పుడు బటన్ నొక్కడం ఏముంది.. మూలన ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుంది అని విమర్శలు చేసేవారు. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత బటన్ నొక్కడం తప్పు అన్నట్లు చెబుతున్నారు. ఒకవైపు పొదుపు మంత్రం చెబుతూ, దుబారాపై ఆదేశాలు ఇస్తూ, తానేమో ప్రజల డబ్బును లక్షలలో వృధా చేస్తున్నారు. అది గొప్ప విషయం అని జనాన్ని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు.
వృద్దాప్య పెన్షన్‌ను సీఎం ఇచ్చినా, వలంటీర్ ఇచ్చినా లబ్దిదారులకు తేడా ఉండదు. వారికి కావల్సింది ఆర్థికసాయమే. వెయ్యి రూపాయలు ఇచ్చి లక్ష రూపాయల ప్రచారం చేసుకోవలన్నదే చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తుంది. ఎన్నికల మానిఫెస్టోలోని అంశాలలో అనేకమైన వాటిని ఎగవేసి, దానిని కవర్ చేసుకునేందుకు చంద్రబాబు నానా పాట్లు పడడానికి ఈ సభలు, ఈ జిమ్మిక్కులు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏది ఏమైనా ప్రజలను స్వయంగా కలిసి కష్ట సుఖాలను నిజంగా చంద్రబాబు తెలుసుకుంటున్నారా? లేక తన పబ్లిసిటీలో భాగంగా దీనిని ఒక ఈవెంట్ గా మార్చారా? అన్నది చర్చనీయాంశమే.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


