ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్‌మెయిల్‌? | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్‌మెయిల్‌?

Published Sun, Dec 10 2023 1:12 PM

KSR Comments Over Yellow Media Over Action In AP - Sakshi

ఏపీలో ఎల్లో మీడియా పూర్తిగా బరితెగించేసింది. ఏకంగా ఇప్పుడు బహిరంగంగా అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా సిగ్గుపడటంలేదు. తెలుగుదేశం పార్టీ కరపత్రాల కన్నా హీనంగా మారిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి నిత్యం ఇదే పనిలో ఉంటున్నాయి. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, ఆ ప్రభుత్వం రాగానే తమపై కేసులు పెడతారేమోనని అధికారులు భయపడుతున్నారట. దీనిపైనే చర్చించుకుంటున్నారట. గతంలో పత్రికలు, టీవీలు ఇలా ప్రచారం చేసేవి కావు.

✍️రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటుంటాయి. ఒకదానికి ఒకటి సమాధానం ఇచ్చుకుంటాయి. ఇంతకాలం అలాంటివి చూశాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా హద్దులు దాటిపోయి అధికారులను బెదిరించే దశకు చేరుకున్నాయి. దీనికి ఒక కారణం కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుండేవారు. తామే పవర్‌లోకి వస్తున్నాం. అధికారుల సంగతి చూస్తాం. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చే పోలీసు అధికారుల పేర్లు రెడ్ బుక్‌లో రాసుకుంటున్నాం.. వారందరి అంతు తేలుస్తా అంటూ లోకేష్ ఎక్కడబడితే అక్కడ మాట్లాడుతూ వచ్చారు. యువగళం పేరుతో సాగిన పాదయాత్రలో ఆయన ఇదే పనిగా పెట్టుకుని మాట్లాడుతుండేవారు.

✍️చంద్రబాబు మరో అడుగు ముందుకేసి తనను ఎవరు ఏమీ పీకలేరని అనేవారు. గొడవలు చేసి కేసులు పెట్టించుకునేవారికి పెద్ద,పెద్ద పదవులు ఇస్తామని ప్రచారం చేశారు. దానిని అమాయకంగా నమ్మిన  కొందరు టీడీపీ కార్యకర్తలు అల్లర్లు చేసి కేసుల్లో చిక్కుకుని నానా పాట్లు పడవలసి వచ్చింది. లోకేష్ కొన్నిసార్లు పూర్తిగా బాధ్యతారహితంగా కొందరు  ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పేరు ప్రస్తావించి తాను అధికారంలోకి రాగానే ఏమి చేస్తానో చూడండి అంటూ బెదిరించేవారు. చిత్తూరు ఏఎస్పీని పేరు పెట్టి మరీ బెదిరించారు. దీనిపై ప్రజలలో తీవ్ర  విమర్శలు వచ్చాయి. రాజకీయంగా తమకు ఉపయోగపడటంలేదని ఆ తర్వాత కాలంలో అర్ధం అయిందో, ఏమో తెలియదు కానీ.. కాస్త స్వరం మార్చి పోలీసు అధికారులందరిపై తమకు కోపం లేదని, కొందరే ప్రభుత్వానికే అనుకూలంగా ఉండేవారిపైనే తమ విమర్శలంటూ సర్దుకోవడానికి యత్నించారు. ఈలోగా టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాలు తెరపైకి రావడం, చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయి రాజమహేంద్రవరం జైలులో ఉండవలసి రావడం, లోకేష్ యువగళం యాత్రను ఆపి ఢిల్లీకి వెళ్లిపోవడం వంటివి జరిగాయి. 

✍️దీంతో, వారికి కొంత భయం పట్టుకుంది. అధికారులపై దాడి చేయడం తగ్గించారు. తాజాగా లోకేష్ మళ్లీ యువగళం ఆరంభించినా, అధికారుల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు. కానీ, వైఎస్సార్‌సీపీ వారందరిని జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నారు. ఆయన తండ్రికి జైలర్ పాత్ర ఇచ్చారు. టీడీపీ గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా జైలర్ ఎలా అవుతారో, లేదా జైలర్ ఉద్యోగం కూడా ఆయన చేతిలోకే తీసుకుంటారో తెలియదు. అసలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న గ్యారంటీనే లేదు. అందుకే  జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్న ఆశతో తంటాలు పడుతున్నారు.

✍️ఈ క్రమంలో టీడీపీ, జనసేనలకు ఊపిరి పోయడానికి కంకణం కట్టుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి  వంటి పచ్చ మీడియా సంస్థలు పచ్చ నేతలకు బదులు అధికారులను బ్లాక్ మెయిల్ చేసే పనిలోపడ్డాయి. గత  కొన్నాళ్లుగా ప్రత్యేకించి చంద్రబాబుపై కేసులు వచ్చాక, ఈ మీడియా.. అధికారులను భయపెట్టడానికి అన్ని యత్నాలు చేస్తున్నాయి. ఒకసారి అధికారులు కేసులువస్తాయని భయపడి కేంద్రానికి వెళ్లడానికి అప్లై చేసుకుంటున్నారని రాయడం, డిప్యుటేషన్‌పై పనిచేసే అధికారులు కొందరు ఇక్కడ పరిస్థితి రీత్యా వెళ్లిపోవాలని చూస్తున్నారని మరోసారి, మళ్లీ వారి సర్వీస్ పొడిగింపు ఆదేశాలు వస్తే మరో రకంగాను రాస్తూ ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. 

✍️ఒకరోజు ఆంధ్రజ్యోతి అలాంటి బెదిరింపు కథనం రాస్తే ఆ మరుసటి రోజు ఈనాడు అందుకుంటుంది. ఉదాహరణకు నవంబర్29వ తేదీన ఈనాడు దినపత్రిక బ్యానర్‌ కథనం చూడండి.. ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి అని అధికారులు చర్చించుకుంటున్నారని ఒక చెత్త వార్త రాశారు. ఇదే తరహా వార్త అంతకు ఒకటి, రెండు రోజుల ముందు ఆంధ్రజ్యోతి రాసింది. ఈ రెండు పత్రికలు, టీవీలు పేరుకే విడివిడిగా ఉన్నాయి తప్ప, కంటెంట్ దాదాపు అంతా కలిసే జనం మీదకు వదలుతున్నారు. ఈనాడు ఎంత నీచంగా రాసిందంటే అధికారులు కేసులకు భయపడి నిద్రలేని రాత్రులు  గడుపుతున్నారట. ప్రతిపక్షనాయకులపైన, ప్రభుత్వానికి గిట్టని వారిపైన అక్రమ కేసులు బనాయించి, మానసికంగా, శారీరకంగా వేధించిన అధికారులు ఆందోళన చెందుతున్నట్లు  సమాచారం అని రాసిపడేశారు.

✍️చంద్రబాబుతో ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ, లోకేష్ తదితరులు ఊరుకునేలా లేరని వారు అనుకుంటున్నారట. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ ఒక్క అధికారితో వీరు  మాట్లాడి రాసినట్లు  ఇందులో కనబడదు. వారి సొంత పైత్యం అంతా జనం మీద రుద్దేశారు. ఎవరూ అక్రమ కేసులు పెట్టాలని కోరరు. కానీ, పెట్టినవన్నీ అక్రమ కేసులే అని ఈనాడు మీడియా దుష్ప్రచారం చేస్తోంది. ఈ మీడియానే తన ఇష్టం వచ్చినట్లు తీర్పులు ఇచ్చేస్తోంది. టీడీపీ ప్రభుత్వం వచ్చేస్తోందన్న భ్రమ కల్పించడానికి, ఆ తర్వాత ఏదో అయిపోతుందన్నట్లు భ్రాంతి కల్పించడానికి ఈనాడు, జ్యోతి, టీవీ-5 తదితర ఎల్లో మీడియా ఈ రకంగా చేస్తోందన్న సంగతి ప్రజలకు అర్ధం కాకుండా ఉండదు. ఎందుకంటే చంద్రబాబుపై  వచ్చిన అభియోగాలలో  అత్యధికభాగం పూర్తిగా దర్యాప్తులో ఆధారాలు దొరికిన తర్వాతే కేసులు  పెట్టడం జరిగింది. ఆ వాస్తవం టీడీపీ వారికి కూడా తెలుసు. ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలకు సైతం తెలుసు. కానీ, తమకు మీడియా ఉంది కనుక దానిని అడ్డం పెట్టుకుని చంద్రబాబును రక్షించడానికి వారు చేస్తున్న కుట్రలేనని ఈ వార్తలు చదివితే బోదపడుతుంది. 

✍️ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కొనుగోలులో కొందరు పోలీసు అధికారులతో పాటు  మీడియా అధిపతుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఒక పోలీసు అధికారి అయితే టీడీపీని తాను నడుపుతున్నట్లుగా ఆయా పార్టీ పదవులను ఇచ్చేవారట. ఆ విషయం టీడీపీ నేతే విజయవాడలో పార్టీ మీటింగ్‌లోనే చెప్పిన సంగతి మర్చిపోయారా! ఇప్పుడు అలాంటివి ఎక్కడైనా జరుగుతున్నాయా!.

✍️ఇక ఆంధ్రజ్యోతి చిత్రంగా మరో వార్త ఇచ్చింది. ఇసుక ద్వారా సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరితే, ఇంకా ఎక్కువ రావాల్సిందని, అందువల్ల ఇంత నష్టం జరిగిందంటూ ఓ పిచ్చి వార్తను ఇచ్చింది. ఇలా తప్పుడు కథనాలు రాసి నడిరోడ్డు మీద నగ్నంగా తిరగడానికి ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏ మాత్రం ఫీల్ కావడం లేదు. ఉడత ఊపులకు చింతకాయలు రాలవని అంటారు. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి చేసే బ్లాక్ మెయిలింగ్‌కు అధికారులు భయపడతారా? అదే కరెక్టు అయితే  చంద్రబాబు పాలన సమయంలో అనేక మంది కేంద్రానికి వెళ్లారు. వారంతా కూడా ఆ టైమ్‌లో జరిగిన అక్రమాలకు భయపడే కేంద్రానికి వెళ్లారని ఈ ఎల్లో మీడియా ఒప్పుకుంటుందా?. 


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

Advertisement
 
Advertisement