
పూటకో రకంగా మాట్లాడటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రత్యేక లక్షణం. అసెంబ్లీలో కానీ.. మరో చోట కానీ.. నిన్న చేసిన ప్రసంగానికి, నేటికి అస్సలు సంబంధం ఉండకపోవచ్చు. ఎన్నికల ముందు చేసే ప్రసంగాలు ఒకలా ఉంటే.. ఆ తరువాత ఇంకోలా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉంటే ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాగ్దాన భంగాల గురించి ఆయన ఆచరించే పద్ధతులు ఒక పరిశోధన అంశం అవుతుందేమో!.
కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో ఆయన విజన్-2047 గురించి ప్రసంగించారు. అందులో ఆయన పెట్టిన అంకెలు చూస్తే అది ఎంత పెద్ద గారడీనో అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ‘సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా’ అన్న ఆయన అధికారంలోకి రాగానే సంపద ఎలా సృష్టించాలో చెప్పండని ప్రజలను కోరారు. చెవిలో అయినా చెప్పాలని వ్యాఖ్యానించారు. తాజాగా సంపద సృష్టి నేర్పిస్తాం అంటున్నారు. చంద్రబాబు ఏది చేస్తారో తెలియదు కానీ, ఏపీని అప్పుల కుప్పగా మరుస్తుండటం మాత్రం స్పష్టం. అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్ పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర సమస్యలపై ఉన్నట్లు కనిపించదు. ఒక్క అమరావతి కోసమే రూ.ఏభై వేల కోట్లకుపైగా అప్పు తెచ్చి ఖర్చు పెట్డడానికి సిద్దం అవుతున్నారంటే ఈ ప్రభుత్వం సంపన్నులకు, బడా బాబులకు ఉపయోగపడుతున్నదా? లేక పేదలను ఉద్ధరించడానికా? అన్నది తెలిసిపోతుంది.
అమరావతిలో భూములు కొన్నవారి ప్రయోజనాల కోసం ఇంత భారీ వ్యయం చేస్తున్న ప్రభుత్వం పేదలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు మాత్రం పాతరేసింది. అమరావతిలో ధనికులు బాగుపడితే తామంతా బాగుపడినట్లు పేదలు అనుకోవాలన్నది కూటమి సర్కార్ భావన. కానీ, శాసనసభలో, బయట మాత్రం చంద్రబాబు నాయుడు పేదల కోసమే అంతా చేస్తున్నట్లు చెబుతూ వారిని మభ్యపెట్టేయత్నం చేస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ జగన్ విశాఖలోని రుషికొండపై ప్రభుత్వానికి ఉపయోగపడేలా మంచి భవనాలు నిర్మిస్తే, అవేవో ఆయన సొంతమైనట్లు ప్యాలెస్ అంటూ దుష్ప్రచారం చేశారు. అదే అమరావతిలో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బిల్డింగ్‌లను మాత్రం ఐకానిక్ భవనాలని ప్రచారం చేసుకుంటున్నారు.
అమరావతి గ్రామాలలోనే ఇన్ని వేల కోట్ల వ్యయం చేస్తే అక్కడి వారికి సంపద సృష్టించినట్లు అవుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సంపదవుతుంది?. ప్రభుత్వాన్ని సమతులంగా నడపవలసిన పెద్దలు మిగిలిన ప్రాంతాలను ఎండగట్టి అంతా అమరావతిలోనే ఉందన్న భ్రమ కల్పించే యత్నం చేస్తున్నారు. దానికి తోడు విజన్-2047 అని, పీ-4 అని ఏవో కొత్త డైలాగులు ప్రచారంలోకి తేవడం ద్వారా ప్రజలంతా కూటమి ఇచ్చిన అనేక హామీల ఊసెత్త కూడదన్నది వారి వ్యూహం. ఇది ప్రజస్వామ్య వ్యవస్థను కూడా మోసం చేస్తున్నట్లు అన్న సంగతి గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి తలసరి ఆదాయ లక్ష్యం 18వేల డాలర్లుగా ఉండాలని భావిస్తుంటే ఏపీలో అది 42వేల డాలర్లుగా పెట్టుకున్నారు. అంటే అప్పటికి ఒక డాలర్ విలువ వంద రూపాయలు ఉందనుకుంటే ఏపీ ప్రజలు ఏడాదికి నలభై రెండు లక్షల మేర తలసరి ఆదాయం కలిగి ఉంటారన్నమాట. నిజానికి ఇంకో పాతికేళ్ల తర్వాత డాలర్ విలువ ఇంకా ఎక్కువే కావచ్చు. అది వేరే సంగతి. అంటే ఇలాంటి అంకెల గురించి ప్రజలకు అంత తేలికగా అర్థం కావు. అందువల్ల వారిని భ్రమింప చేయడానికి ఈ అంకెల గందరగోళం బాగా ఉపయోగపడుతుంది అన్నమాట.
చంద్రబాబు 2004 వరకు సీఎంగా ఉన్న రోజుల్లో కూడా విజన్-2020 అంటూ ఒక కథ నడిపించారు. ఆ విజన్ పుస్తకం చదివిన వారంతా ఇవేమి లెక్కలు.. ఇవేమి లక్ష్యాలు.. అంటూ ఆశ్చర్యం చెందారు. అప్పట్లో ఒకసారి ఏపీకి వచ్చిన స్విస్ మంత్రి ఒకరికి జీడీపీపై, రాష్ట్ర ఆర్థిక వృద్ధిపై ఇలాంటి లెక్కలు చెప్పబోతే, తమ దేశంలో అయితే ఇలా చెబితే వారిని మతి ఉండి మాట్లాడుతున్నారా అని అడుగుతారని వ్యాఖ్యానించారు. ఆ క్రమంలో ఒకట్రెండు పదాలు ఆయన వాడటం చంద్రబాబుకు అప్రతిష్టగా మారడంతో ఆ మాటలపై వివరణ ఇప్పించే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు తన వ్యూహాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు. ఏవో లెక్కలు చెబితే ప్రజలు నమ్మకపోతారా అన్నది ఆయన ఉద్దేశం కావచ్చు.

సూపర్ సిక్స్ హామీలు కాని, ఎన్నికల ప్రణాళికలోని హామీలు కాని అమలు చేయడం అసాధ్యం వాటికి రూ.లక్షన్నర కోట్లు అవసరం అవుతాయని అప్పటి ముఖ్యమంత్రి జగన్ అంటే ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం తాము చేసి చూపిస్తామని అనేవారు. తనకు సంపద సృష్టించడం తెలుసు అని చంద్రబాబు బడాయి కబుర్లు చెబితే, అవునవును అని పవన్ కళ్యాణ్ బాజా వాయించే వారు. అప్పటికే జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందన్న అబద్ధాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. అంకెలతో జనాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలా మోసం చేశారో చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి.
నారా లోకేష్ అయితే అన్ని స్కీములకు తమ వద్ద లెక్కలు, ప్రణాళికలు ఉన్నాయని, అమలు చేయకపోతే తమ కాలర్ పట్టుకోవచ్చని అన్నారు. ఇప్పుడు కాలర్ ఎవరూ పట్టుకునే పరిస్థితి లేకుండా రెడ్ బుక్ పేరుతో జనాన్ని భయపెడుతున్నారు. అవసరమైన ప్రజలకు చేపలు అందిస్తారట. ప్రతిరోజూ చేపలు ఇస్తూనే వలవేసి వాటిని ఎలా పట్టుకోవాలో నేర్పుతానని అదే తమ విధానం అని చంద్రబాబు అన్నారు. మరి ఈ మాటే ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు? పేదల తక్షణావసరాలు తీర్చడం అంటే ఒక ఏడాదిపాటు ఫ్రీ బస్, తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి వాటిని లేకుండా చేయడమా?. వలంటీర్లకు నెలకు పది వేలు ఇస్తామని చెప్పి అసలుకు మంగళం పాడడమా? ఇప్పటికీ 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవశాలి ఎంతమందికి సంపద సృష్టించారు? ఎంత మందికి నేర్పారు? ఇప్పుడు కొత్తగా నేర్పుతానని అంటే జనం చెవిలో పూలు పెట్టడం కాదా? ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతానందట.
అలాగే వ్యక్తి, కుటుంబం, సమాజం, రాష్ట్రం అన్ని స్థాయిలలో పురోగతికి ప్రణాళికలు రూపొందిస్తున్నారట. నియోజకవర్గాల విజన్ ఎజెండా పెట్టి స్వర్ణాంధ్ర సాకారం చేస్తారట. అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తొమ్మిది నెలలుగా తన నియోజకవర్గంలో ఒక్క పని చేయలేక పోయానని వాపోయారు. పది నెలల పాలన తర్వాత వీధులలో చెత్త ఎత్తడానికి సీఎం, మంత్రులు ఆయా చోట్ల తిరుగుతున్నారు. అలా ఉంటుందన్నమాట విజన్ అంటే!.
పరిస్థితి ఇలా ఉంటే స్వర్ణాంధ్ర అని, మరొకటని కల్లబొల్లి మాటలతో కాలక్షేపం చేయడమేమిటో అర్థం కాదు. అదేమంటే పేదలను ధనికులు దత్తత తీసుకోవాలట. అప్పుడు వారికి సంపద సృష్టించడం నేర్పనక్కర్లేదా!. ఉగాది నాడు ఆ కార్యక్రమం ఆరంభిస్తారట. అది ఎంత చక్కదనంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రతీ కుటుంబానికి కోరుకున్న చోట స్థలాలు ఇస్తారట. రాజధానిలో పేదలకు గత ప్రభుత్వం స్థలాలు ఇస్తే వాటిని రద్దు చేసిన చంద్రబాబు ఈ మాట చెబితే ఎవరైనా నమ్ముతారా?. వైఎస్ జగన్ టైమ్ లో నిర్మాణంలో ఉన్న పోర్టులను ప్రైవేటు పరం చేస్తూ సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తాం అని అంటున్నారు. తాను ఒక్కడినే పనిచేస్తే చాలదని, ఎమ్మెల్యేలంతా పని చేయాలని చెబుతున్నారు. అంటే వారిలో చాలా మంది పనిచేయడం లేదని చెప్పడమే అవుతుంది కదా! పనుల సంగతి దేవుడెరుగు! కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన అవినీతికి పాల్పడుతున్నారని ఎల్లో మీడియాలోనే కథనాలు వస్తున్నాయి.
చంద్రబాబు సీఎం కాబట్టి ఆయన చేతిలో నిధులు ఉంటాయి కనుక, తన నియోజకవర్గంలో ఏదో పని చేసుకోవచ్చు. విచిత్రం ఏమిటంటే ఇంత విజన్ ఉన్న ఆయన నియోజకవర్గమైన కుప్పంలో సరైన బస్టాండ్ లేదు, కొన్ని వార్డులలో మట్టి రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో చెప్పలేం. కుప్పం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాలను జగన్ ప్రభుత్వం బాగు చేసింది. ఒక్క గెస్ట్ హౌస్ మాత్రం బాగానే ఉంటుంది. 2004, 2019లలో తనను ఎవరూ ఓడించలేదని, అభివృద్ది చేసే క్రమంలో ఎమ్మెల్యేలను, పార్టీని సమన్వయం చేయలేక పోయినందువల్ల ఓడిపోయామని అంటున్నారు. అంటే ఆయన నిజంగా అభివృద్ది చేసినా ప్రజలు ఓడించారని చెబుతున్నారా? అంతే తప్ప అప్పుడు కూడా ఆచరణ సాధ్యం కాని వందల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఆ తర్వాత వాటిని అమలు చేయలేక ఓడిపోయామని అంగీకరించలేక పోతున్నారన్నమాట.
జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడిన సంగతిని విస్మరిస్తున్నారు అన్నమాట. ఇది ఆత్మవంచన కాదా! పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా అంకెల గారడీ, బురిడీ మాటలు కాకుండా చిత్తశుద్దితో పనిచేసి, ఇచ్చిన వాగ్దానాలపై దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేస్తే ఆయనకే మంచి పేరు వస్తుంది. కానీ ఆ దిశలో ఆయన ఆధ్వర్యంలోని కూటమి సర్కార్ ఉన్నట్లు కనిపించడం లేదు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.