దిగజారుడుతనానికి కేరాఫ్‌ చంద్రబాబే | Sakshi
Sakshi News home page

దిగజారుడుతనానికి కేరాఫ్‌ చంద్రబాబే

Published Tue, Feb 20 2024 1:21 PM

KSR Comment On Chandrababu's Thinking - Sakshi

'తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిజంగానే తన వయసుకు తగ్గట్లు మాట్లాడడం లేదు. ఏదేదో, పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి తీసుకు వెళుతున్నారు. రా.. కదలిరా..! అంటూ జరుపుతున్న సభలలో ఎందుకు ప్రజలు కదలి రావాలో చెప్పకుండా, ఎంత సేపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను దూషించే  పనిలో ఉంటున్నారు  దీంతో టీడీపీ క్యాడర్ ఇంతకీ చంద్రబాబు ఏమి చెప్పారన్న సంశయంలో పడిపోతున్నారు.'

కొద్ది రోజుల క్రితం  ఇంకొల్లులో జరిగిన సభలో ఆయన తన వయసు, తాను గతంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించానన్న సంగతిని విస్మరించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిను నోటికి వచ్చినట్లు తిట్టడం శోచనీయం అని చెప్పాలి. ఈ దిగజారుడు మాటల్లో హైలైట్ ఏమిటంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవసరానికి కాళ్లు పట్టుకుంటాడు.. తర్వాత కాళ్లు లాగేస్తాడు.. అని చంద్రబాబు అనడం. ఇది తన గురించి తాను చెప్పుకోబోయి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నింద మోపినట్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన ఎవరి కాళ్లు పట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు.

రాష్ట్రంలో ఒక్కశాతం కూడా ఓట్లు లేని బీజేపీతో పొత్తుకోసం ఎవరు కాళ్లా, వేళ్ల పడుతున్నది ఏపీ ప్రజలందరికీ తెలుసు. జనసేన సీట్లు, టీడీపీ సీట్లు, అభ్యర్దులను ఖరారు చేయకుండా దేవుడా, దేవుడా అంటూ ప్రార్ధన చేస్తూ కూర్చున్న చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారు. తాను చేసే పనులను ఎదుటివారిపై నెట్టడంలో సిద్దహస్తుడైన చంద్రబాబు గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు ప్రధాని మోదికి దత్తపుత్రులు అని, మోది అంటే భయపడుతున్నారని రంకెలు వేస్తూ స్పీచ్‌లు ఇచ్చేవారు. చంద్రబాబు ఇప్పుడు ఎందుకు బీజేపీకి సరెండర్ అవుతున్నారు? మరి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నడైనా తనకు బీజేపీతో పొత్తు కావాలని మోదిని కాని, అమిత్‌షాను కాని బతిమలాడారా? లేదే! అయినా చంద్రబాబు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పడం ద్వారా పరువు పోగొట్టుకుంటున్నారు. ప్రధాని మోదీ ఎప్పుడు పిలుస్తారా.. అన్నట్లుగా, ఆయన కంటి చూపు పడితే చాలు.. అన్నట్లుగా చకోర పక్షిలా వేచి ఉన్న చంద్రబాబు ఎదుటివారిపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు.

చంద్రబాబు బీజేపీని అవసరమైనప్పుడు కాళ్లావేళ్లపడి బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత వారిని చీ కొట్టి, అవమానించి విడిపోయారు. దానిని కదా అనాల్సింది. అవసరమైతే జుట్టు.. లేకుంటే కాళ్లు అని.. అయినా ఆయన దబాయించి ఎదుటివారిపై నోరుపారేసుకుంటున్నారు.తాను స్కిల్ స్కామ్ కేసులో జైలులో ఉన్నప్పుడు తన కుమారుడు లోకేష్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా  వద్దకు ఎందుకు చంద్రబాబు పంపించారు. కాళ్లు పట్టుకోవడానికా? లేక అమిత్‌షా చొక్కా పట్టుకోవడానికా? ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం స్వయంగా చంద్రబాబే ఢిల్లీ వెళ్లి అమిత్‌షాతో సరదా కబుర్లు చెప్పి వచ్చారా? లేక ఆయన వద్ద చేతులు కట్టుకుని కూర్చుని కాళ్లా, వేళ్లాపడి పొత్తు ప్లీజ్ అని బతిమలాడారా? ఏదో తన బినామీ పత్రికలు ఉన్నాయి కదా అని అమిత్‌షానే రమ్మంటే వెళ్లానని ప్రచారం చేసుకున్నారు. అదే మాట 'షా' తో ఎందుకు చెప్పించలేకపోయారు! తనను  కలిసిన పదిరోజులు దాటినా, పొత్తు గురించి చంద్రబాబు ఎదురుచూసేలా అమిత్‌షా చేశారంటే ఏమిటి దాని అర్ధం!.

1996 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ మసీదులు కూల్చేపార్టీ అని ప్రచారం చేశారు. 1998 ఎన్నికల తర్వాత వారి గూట్లో చేరిపోయారు. 2004లో ఓటమి తర్వాత ముస్లీంలకు ద్రోహం చేసే బీజేపీతో కలిసి తప్పు చేశానని, జీవితంలో ఎప్పుడూ కలవబోనని బీరాలు పలికారు. గుజరాత్ అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదిని నరహంతకుడు అనే వరకు వెళ్లారు. ఆ తర్వాత పార్లమెంటులో దీనికి సంబంధించి ఓటింగ్ జరిగినప్పుడు తన ఎంపీలు జారుకునేలా చేశారు. దీనిని కాళ్లబేరం అని కదా అనాల్సింది. 2009లో టీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎంలతో కలిసిపొత్తు పెట్టుకుని ఓడిపోయిన తర్వాత వాళ్లను గాలికి వదలివేసి మళ్లీ బీజేపీ వైపు పరుగులు తీశారు. ఏ మోదినైతే తిట్టారో తిరిగి ఆయన దేశంలో ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి బాబ్బాబు.. ప్లీజ్.. ఈ ఒక్కసారి మన్నించండని కోరింది చంద్రబాబు కాదా! మళ్లీ 2018 నాటికి మోదిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, చివరికి మోదిని ఉగ్రవాది అని కూడా దూషించిన చరిత్ర చంద్రబాబుది.

దానిని కాళ్లులాగడమంటే అనేది. అవన్ని ఎందుకు! చంద్రబాబుకు పిల్లను ఇచ్చిన మామ ఎన్‌టీ రామారావుకు నిత్యం పాద నమస్కారాలు  చేస్తున్నట్లు నటించి, లటక్కున ఆయనను కుర్చీ నుంచి లాగిపారేసింది చంద్రబాబే కదా! దానిని కదా కాళ్లు లాగేడయమనేది. ఆ దెబ్బకే కదా ఎన్‌టీఆర్‌ గుండె ఆగి మరణించింది! అయినా చంద్రబాబు  అవేమీ జరగనట్లు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు వేస్తుంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పుడైనా ఎవరి కాళ్లమీదైనా పడ్డారా? కాళ్లు పట్టుకుని లాగారా? లేదే! ఆయన శంషేర్‌గా  దేశంలోనే అత్యంత శక్తిమంతురాలిగా ఉన్న సోనియాగాంధీని, కాంగ్రెస్‌తో రహస్య బంధం పెట్టుకున్న చంద్రబాబును ఎదుర్కుని, వారు పెట్టిన అక్రమ కేసులను భరించి జైలుకు వెళ్లి, తదుపరి ఎన్నికలలో నిలబడి గెలిచిన ధీశాలి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్న సంగతి అందరికి తెలిసిందే. అందువల్ల చంద్రబాబు తన చరిత్ర ఎవరికి తెలయదనుకుని భ్రమపడి ఏదిపడితే అది మాట్లాడితే , ప్రజలకు పాత చరిత్ర గుర్తుకు వస్తుందని మర్చిపోకూడదు.

చంద్రబాబు దెబ్బకు వైఎస్ రాజశేఖరరెడ్డి భయపడ్డాడట. ఇదొక వండర్! ఇలాంటి మాటలు చెప్పడం అంటే  వినేవాడు వెర్రివాడులే అన్న ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు. డెబ్బై నాలుగేళ్ల వయసులో ప్రజలను మద్యం తాగవద్దు అని చెప్పకుండా, మంచి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాను.. నాకే ఓటేయండని ఆయన పిలుపు ఇస్తున్నారంటే ఇంతకంటే అద్వాన పరిస్థితి ఉంటుందా! ఎవరు అడ్డువచ్చిన తొక్కివేస్తారట! ఇదేమి గోలో అర్థం కాదు. ఎవరిని తొక్కుతారు! అసలు చంద్రబాబును ఎవరైనా ఎందుకు అడ్డుకుంటారు? తెలుగుదేశంకు అంత సీన్ ఉందా! అని చర్చించుకుంటున్న తరుణంలో ఆయనకు ఆయనే బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. దానివల్ల రాజకీయంగా ఆయనకు జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి.

ముఖ్యమంత్రి తన ముందు బచ్చా అని చంద్రబాబు అనడం మరో పిచ్చి వ్యాఖ్య. రాజకీయాలలో బచ్చా, బడా అని ఉండరు. ఎన్‌టీ రామారావు ముందు ఈయన బచ్చానే కదా! ఆయనను ఎందుకు కుర్చీనుంచి లాగి పారేశారు. 2019లో చంద్రబాబును ఎన్నికలలో ఓడించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బచ్చా ఎలా అవుతారు! హీరో అవుతారు కాని. ఒంటరిగా పోటీచేయడానికి సిద‍్ధం అవుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బచ్చా అవుతారా? లేక తాను వాళ్ల మద్దతు, వీళ్ల మద్దతు లేకపోతే ఎన్నికలలో నిలబడలేనని భయపడుతున్న  చంద్రబాబు బచ్చా అవుతారా! ఇలాగే ఆయన స్పీచ్‌లు కొనసాగిస్తే.., మతి స్థిమితం లేని మాటలు చంద్రబాబు నోట పదే, పదే వస్తున్నాయని జనం, ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్ అనుకుంటారు. ఆ విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు.

మరో వైపు ఆయనకు రాజగురువునని భావించే రామోజీరావు అంతకన్నా మతిలేని వార్తలు రాస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం కక్కుతున్నారు. నిజానికి ఆయన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కాదు విషం చిమ్ముతున్నది. ఏపీ ప్రజలపైన అని చెప్పాలి. ఉన్నవి, లేనివి కల్పించి అబద్దాలు సృష్టించి నానా చెత్త అంతా పోగు చేసి ప్రజలను మోసం చేయాలని రామోజీ చేస్తున్న వికృతచర్యలు కచ్చితంగా  ప్రజలందరు అసహ్యించుకునే దశకు చేరుకున్నాయి. చివరికి తెలుగుదేశం క్యాడర్ కూడా చీదరించుకునే పరిస్థితిని రామోజీ తెచ్చుకున్నారు. రామోజీనేమో తన పిచ్చి రాతలతో, చంద్రబాబేమో తన పిచ్చి మాటలతో ఏపీ ప్రజలను విసిగిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలిస్తే  కానీ, వారి పిచ్చి కుదరదేమో!


-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ పాత్రికేయులు

Advertisement
 
Advertisement
 
Advertisement