జ్ఞానేష్ కుమార్
తీగ లాగితే డొంక కదిలిందన్నది సామెత. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకం అలాగే ఉంది. ఇంతకాలం ఏ రాష్ట్రం నుంచి ఎన్నికలలో అవకతవకాలు జరిగాయని , ఓటర్ల నమోదు, తొలగింపు తదితర అంశాలలో అక్రమాలు జరిగాయని ఎవరు ఆరోపణలు చేసినా, ఎన్నికల సంఘం ఏమీ జరగలేదన్నట్లు ఎన్నికల సంఘం నటించిందనిపిస్తుంది. అయితే ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ఎన్నికల సంఘం ప్రత్యేకించి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మూలాలను కదిలించిందని చెప్పాలి. దేశ వ్యాప్తంగా ఇది పెను సంచలనం అయింది. దేశంలో ఈవీఎంల పైనే అనేక అనుమానాలు వస్తుంటే, ఇప్పుడు ఏకంగా ఓట్ల నమోదు, తొలగింపులలో వచ్చిన ఆరోపణలు దేశ ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు కలిగిస్తున్నాయి.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, సమాజవాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తదితరుల నేతృత్వంలో వివక్ష ఎంపీలు ఎన్నికల సంఘం వద్ద చేసిన ధర్నా ఒకరకంగా చారిత్రాత్మకమైనదని చెప్పాలి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా ఆందోళన చేసిన సందర్భం ఇదేనేమో! అలాగే బీజేపీ ఈ స్థాయిలో ఆత్మరక్షణలో పడడం కూడా ఇదే మొదటిసారి కావచ్చు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అయితే 2024 లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సాధారణ ఎన్నికలతో పాటు జరిగి ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరిని విస్తుపరిచాయి. ఏదో మోసం జరిగిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అప్పుడే వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ మోసం ఏమిటో బహిర్గతం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. 2024 ఎన్నికల తర్వాత జరిగిన మహారాష్ట్ర, హరియాణా, బిహార్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కూడా మోసాలు జరిగాయంటూ విపక్షం ఆరోపణలు చేస్తోంది. రాహుల్ గాంధీ ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని ఆధారాలతో ఆరోపణలు చేశారు. అయినా ఈసీ, బీజేపీ కొట్టిపారేస్తూ వచ్చాయి.
సర్ పేరుతో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను చేపట్టిన వైనం, కోట్ల మంది ఓట్లను తొలగిస్తున్న పద్దతి తీవ్ర అలజడి రేపింది. మహారాష్ట్రలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు లక్షల ఓట్లు కొత్తగా చేరడం ఏమిటి? పశ్చిమబెంగాల్‌లో లక్షల ఓట్లు పోవడం ఏమిటి? వాటిలో 27 లక్షల ఓట్లు నిజమైనవా, కాదా? అన్నది నిర్దారించకుండా ఎన్నికలు జరిపేయడం ఏమిటి? దీనిపై సుప్రీంకోర్టు కూడా తగు రీతిలో స్పందించలేదన్న భావన న్యాయవాద వర్గాలలో ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు జడ్జి ఉజ్వల్ బుయాన్ ఓట్ల గల్లంతు అంశంపై మాట్లాడుతూ దేశంలో ఓట్లు కలిగినవారు. ఓట్లు లేనివారు అని రెండు రకాల పౌరులు ఉండరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టులో కేసు ఉండగా బుయాన్ ఇలా మాట్లాడడంపై మరో మాజీ చీఫ్ జస్టిస్ గవాయ్ అభ్యంతరం తెలిపారు. చిత్రమేమంటే హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలంలో చెట్లు కొడుతుంటే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన గవాయ్ ఇన్ని కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన అంశంలో మాత్రం విభిన్నంగా మాట్లాడడం చిత్రం అనిపిస్తుంది. ఓటర్ల జాబితా రివిజన్ అధికారం ఢిల్లీలోని కార్యాలయంలో పెట్టుకోవడం ఏమిటి? ఫారం 6లో మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం ఉందని ఈసీ తెలిపితే, తమ అంగీకారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసలు ఈ మార్పులు పార్లమెంటు చట్టం ప్రకారం జరగవలసి ఉండడగా, జ్ఞానేష్ కుమార్ తనే ఎందుకు స్వతంత్రంగా నిర్ణయం చేశారు. సీఈసీ ఎంపికలో సీజేఐని తప్పించి, కేంద్ర మంత్రిని పెట్టడం.. ఆయనకు జీవితాంతం కేసులు రాకుండా రక్షణ కల్పించడం వంటివి అనేక సందేహాలకు తావిచ్చాయి.
ఓటు హక్కును రక్షించాల్సిందే
స్థూలంగా చెప్పాలంటే రెండు అంశాలను గమనించాలి. కొన్ని రాష్ట్రాలలో బోగస్ ఓట్లు, మరికొన్ని రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ఒరిజినల్ ఓట్ల తొలగింపు వంటి ప్రక్రియ జరిగినట్లు ఆరోపణలన్నమాట. దేశంలో దొంగ ఓట్లు కూడా పెద్ద ఎత్తున ఉన్నమాట నిజమే. వాటిని నిరోధించవలసిందే. అదే టైంలో పౌరుల ఓటు హక్కును పరిరక్షించవలసిన బాధ్యత ఈసీపై ఉంటుంది. ఉదాహరణకు ఏపీలో కుప్పం వంటి కొన్ని సరిహద్దు నియోజకవర్గాలలో పొరుగు రాష్ట్రాలకు చెందినవారిని వేలమందిని ఓటర్లుగా చేర్పిస్తుంటారట. అలాగే హైదరాబాద్‌లో నివసించే లక్షల మందికి ఏపీలోను, తెలంగాణ జిల్లాలలోను ఓట్లు ఉన్నాయి. రాజకీయ పార్టీలు తద్వారా దొంగ ఓట్లు వేయించుకుంటుంటాయన్నమాట. వాటిని ఈసీ ఎంతవరకు నియంత్రించిందన్నది చర్చనీయాంశం.
అసలు సర్ ప్రక్రియకుగాను ఈసీ తయారు చేసిన దరఖాస్తులో ఎప్పుడో 2002 నాటి ఓటర్ల జాబితాలో పేర్లు ఉండాలని చెప్పడం, తండ్రి, తాత వంటివారి ఆరాలు తీయడం తదితర అంశాలన్ని ప్రజలకు విసుగు తెప్పించాయి. అయినా ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ జర్నలిస్టు రితిక చోప్రా ఈసీలో దీనిపై వ్యక్తం అయిన బేదాభిప్రాయాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. ఆమె లాగిన తీగతో డొంక కదిలినట్లయింది. దీంతోనే వివిధ అంశాలతో పాటు జ్ఞానేష్ కుమార్ కెరీర్ లో పలు వివాదాస్పద ఘట్టాలు, ఆరోపణలు అన్ని బయటపడుతున్నాయి. కేరళం రాష్ట్రం అయితే ఈయనకు సంబంధించిన 2006 కేసును విజిలెన్స్ విచారణకు అప్పగించింది.
జవాబు లేని ప్రశ్నలు!
ఏపీలో 2024లో జరిగిన లోక్ సభ, శాసనసభ ఎన్నికల తీరు కూడా ఒక కేస్ స్డడీ అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రముఖ మేధావులు పరకాల ప్రభాకర్, ఉండవల్లి అరుణకుమార్ తదితరులు ఏపీ ఎన్నికలలో ఏభై లక్షల ఓట్లు అదనంగా ఎక్కడ నుంచి లెక్కించారని వేస్తున్న ప్రశ్నకు ఎన్నికల సంఘం జవాబు ఇవ్వలేకపోయింది. సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏభై లక్షల మంది సుమారు 3500 పోలింగ్ బూత్‌లలో తెల్లవారుజాము రెండు గంటలవరకు నిలబడి ఓట్లు వేసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం అందుకు సాక్షాధారాలు చూపడంలో విఫలం అయిందన్న అభిప్రాయం కలిగింది. ఎందుకంటే అదేదో బ్రహ్మరహస్యం అన్నటు సీసీ టీవీ ఫుటేజీని ఈసీ దాచేసుకోవడమే సంశయాత్మకంగా ఉంది. అంటే ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ప్రజలకు ఈసీ చెప్పలేకపోయిందన్నమాట.
ఇదీ చదవండి: కలరింగ్ ఇస్తే సరిపోతుందా?
ఇక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన వివిపాట్ స్లిప్ లను ఈవీఎంలతో పోల్చి లెక్కవేయాలని కొందరు అభ్యర్దులు కోరినా, తమకు కొన్ని బూత్‌లలో వచ్చిన ఓట్లను ఈవిఎంను ఓపెన్ చేసి చూపాలని అడిగినా, అందుకు అవసరమైన ఫీజ్ కట్టినా ఎన్నికల అధికారులు ఎందుకు తోసిపుచ్చారు? అంతకాడికి వివి పాట్ స్లిప్‌ల మిషన్ల కోసం కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? నలభై ఐదు రోజులపాటు జాగ్రత్తపరచవలసిన ఈ స్లిప్‌లను పది రోజులలోనే దగ్దం చేయాలని ఆనాటి ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ఎందుకు ఉత్తర్వులు ఇచ్చి హడావుడిగా తగులపెట్టించారన్న ప్రశ్నకు ఇప్పటికీ, ఆయన నోరు తెరిచిన దాఖలా కనిపించలేదు. పైగా ఆయనకు 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం మంచి పోస్టింగ్ ఇచ్చి కీలకమైన స్థానంలో పెట్టి, వైఎస్సార్‌సీపీపై కల్పిత స్కామ్‌లను సృష్టించుకోవడానికి వాడుకుంటున్నదన్న అభియోగాలను వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తుంటారు? మరో సంగతి ఏమిటంటే ఈవిఎంలలో నమోదైనా ఓట్లను చూపించం లేదని హైకోర్టుకు వెళితే, అంత సింపుల్ కేసులో తీర్పు ఇవ్వడానికి అక్కడ మూడు నెలలు తీసుకున్నారు. ఈ లోగా సంబంధిత పిటిషనర్ వైఎస్సార్‌సీపీ నుంచి జనసేనకు వెళ్లారు.
ఇదీ చదవండి: యూసీసీపై అమిత్ షా ప్రకటన.. టీడీపీకి సంకటమేనా?
ఏపీలో పారం 20 ని పూర్తి చేసి అప్‌లోడ్ చేయవలసిన ఈసీ నెలల తరబడి ఎందుకు జాప్యం చేసిందని, సర్వే నిపుణులు మస్తాన్ వంటివారు ప్రశ్నిస్తున్నారు. అన్నిటిని మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు ఈ ఎన్నికల అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణల జోలికి వెళ్లకుండా ఉండడం కూడా ఆసక్తికరమైనదే. టీడీపీ ఓడిపోయినప్పుడు ఈవీఎంలపై అంతెత్తున ఎగిరిపడిన చంద్రబాబు ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదు.
ఏపీలో గెలిచింది జగనే
తాజాగా తెలంగాణ సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం ఏపీలో గెలిచింది జగనే అని, చంద్రబాబు గెలవలేదని, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని సంచలన వ్యాఖ్య చేశారు. అలాగే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఏపీకి సంబంధించి ఎన్నికల అక్రమాలపై స్టడీ చేస్తున్నానని, త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడ్డాక కేంద్ర ఎన్నికల సంఘం కీలకమైన అధికారులను బదిలీ చేయడం నుంచి కూటమి నేతలు ఏది కోరితే అది చేశారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఇంత తీవ్రమైన అభియోగాలకు గతంలో ఎన్నడూ గురి కాలేదు. ఆయా వ్యవస్థలు సజావుగా పనిచేయకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుంది.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


