విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరోసారి తీవ్ర స్థాయికి చేరింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై మాజీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. ఈ పరిణామంపై నాని ఘాటుగా స్పందిస్తూ.. ఈ చర్యను “రాజకీయ పిరికితనం” అని మండిపడ్డారు.
సాక్షి, విజయవాడ: తనపై కేసు నమోదు కావడం, ఎల్లో మీడియా దానిని హైలైట్ చేస్తుండడంపై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని స్పందించారు. ఉర్సా భూ కేటాయింపుల వ్యవహారంపై తాను ఇప్పటికే ఏడాది క్రితమే ముఖ్యమంత్రికి లేఖ రాశానని గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ భూ కేటాయింపుల్లో ఎంపీ చిన్ని ప్రమేయం ఉందని పేర్కొంటూ, 2025 ఏప్రిల్ 22న చంద్రబాబుకు బహిరంగ లేఖ కూడా ఇచ్చినట్లు తెలిపారు.
దాదాపు 14 నెలల పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అకస్మాత్తుగా తనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం వెనుక రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని నాని విమర్శించారు. ఈ చర్యను ప్రజాస్వామ్య గొంతుకను అణచివేయడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు, కార్పొరేట్ వ్యవహారాలపై ప్రశ్నించడం తన ప్రాథమిక హక్కు అని, ప్రజల పక్షాన మాట్లాడటం మాజీ ఎంపీగా తన బాధ్యత అని నాని స్పష్టం చేశారు. ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కాలయాపన చేసి, ఇప్పుడు అధికార బలంతో కేసులు పెట్టడం సరైంది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
When questioned about his involvement in the 'Ursa Clusters Pvt Ltd' land issue in my open letter to the Hon'ble @AndhraPradeshCM on April 22, 2025, the Vijayawada MP chose silence for 14 months. Now, out of political panic, he has filed a malicious FIR (https://t.co/ubI0U2i0qB:… pic.twitter.com/HtBs8cTAGf
— Kesineni Nani (@kesineni_nani) June 13, 2026
ఇక మరోవైపు పోలీసుల సమాచారం ప్రకారం.. ఎంపీ కేశినేని చిన్ని చేసిన ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సోషల్ మీడియాలో తనపై అసత్య, పరువు నష్టం కలిగించే పోస్టులు పెడుతున్నారని చిన్ని ఆరోపించారు.
తాజా పరిణామాలతో కేశినేని బ్రదర్స్ మధ్య రాజకీయ విభేదాలు మరో దశకు చేరినట్లు స్పష్టమవుతోంది. చిన్ని అధికార కూటమి ఎంపీగా ఉండగా, నాని గత కొంతకాలంగా ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయాలపై అలాగే చిన్ని అవినీతి బాగోతంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు.


