చేవెళ్ల మీటింగ్‌: ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసీఆర్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

చేవెళ్ల బీఆర్‌ఎస్‌ మీటింగ్‌.. ఎంపీ రంజిత్‌రెడ్డిపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Published Sat, Apr 13 2024 7:19 PM

Kcr Speech At Chevella Parliament Constituency Brs Meeting - Sakshi

చేవెళ్ల,సాక్షి: సీఎం పదవి నుంచి తాను పక్కకు జరగగానే ఇంత ఘోరమా అని బీఆర్‌ఎస్‌ అధినేత,మాజీ సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌​ గెలిస్తే ఆరు గ్యారెంటీలు ఇవ్వకున్నా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తమకే ఓటేశారని కాంగ్రెస్‌ అనుకునే ప్రమాదముందని ప్రజలను హెచ్చరించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కొరడా ఝళిపించాలని కేసీఆర్‌ పిలుపుచ్చారు. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ కోసం  అని గుర్తు చేశారు. చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. శనివారం(ఏప్రిల్‌ 13) చేవెళ్లలో జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. 

‘బీఆర్‌ఎస్‌ పుణ్యాన గెలిచిన వ్యక్తి రంజిత్‌రెడ్డి. ఏం తక్కువ చేశాం రంజిత్‌రెడ్డికి. ఆయనేమన్నా పొద్దు తిరుగుడు పువ్వా. అధికారం ఎటు ఉంటే అటు మారుతాడా. రంజిత్‌ రెడ్డి అధికారం కోసమా.. పైరవీల కోసమా  ఎందుకు పోయాడు. ఆయనను ధీటైన దెబ్బ కొట్టాలి’ అని చేవెళ్ల ప్రజలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌పై ఓట్ల డబ్బాలతో యుద్ధం చేసి డిపాజిట్లు రాకుండా చేయాలన్నారు. 420 వాగ్ధానాలు చేసి అన్నీ మరిచిపోయారని మండిపడ్డారు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామని చెప్పి రాష్ట్రంలో లూఠీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

బీజేపీపై ఫైర్‌.. 

బీజేపీపై కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ‘అయితే మోడీ.. లేదా ఈడీతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది. గుడ్డిగా ఓట్లు వేస్తే ఇబ్బందులు వస్తాయి. గత పదేళ్ళలో కేంద్రం 157 మెడికల్ కాలేజీలు ఇచ్చింది. తెలంగాణకు ఒక్కటి ఇయ్యలేదు.

150 ఉత్తరాలు రాసినా ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ స్కూల్ ఇవ్వలేదు. కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి చేసినా నేను పెట్టలేదు.

ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తాయి. ధాన్యం కొనుగోలు చేయాలని ఢిల్లీలో ధర్నా చేశాం. నూకలు తినమని ఓ బీజేపీ కేంద్ర మంత్రి చెప్పారు. బీజేపీకి ఓటు వేసి నూకలు తిందామా ? కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలేదు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇవ్వలేదు. మతం ఉచ్చులో పడి మోసపోవద్దు’ అని కేసీఆర్‌ కోరారు. 

కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి బీసీల ఐక్యత చాటాలి 

‘కాంగ్రెస్‌ పార్టీకి సురుకు పెడితేనే పనులవుతాయి. ధాన్యం కల్లాల వద్ద, ఓట్ల  డబ్బాలతో రెండు రకాలుగా యుద్ధం చేయాలి. కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించి బీసీల ఐక్యత చాటాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై వెంట పడి వేటాడుతాం. చేవెళ్ల సభకు వచ్చిన జనాన్ని చూస్తే కాసాని గెలుపు ఖాయమైపోయింది’ అని కేసీఆర్‌ అన్నారు. 

Advertisement
 
Advertisement