గురువారం ప్రజాభవన్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
కృష్ణా ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సీఎం రేవంత్
ప్రాజెక్టు నీటి సోర్సును మార్చడం వెనుక అవినీతి పునాదులు
సోర్సు మార్చడానికి మంత్రివర్గ ఆమోదం లేదు.. అడుగుదామంటే కేసీఆర్ సభకు రావడం లేదు
విచారణకు ఆదేశిద్దాం..
మార్గదర్శకాలు సిద్ధం చేయండని అధికారులకు చెప్పా
ప్రాణహిత–చేవెళ్ల తరహాలోనే ‘పాలమూరు’ సోర్సు మార్చారు
ఎవరి బాగోగుల కోసం మార్చారో విచారణకు ఆదేశించాలి
కమీషన్ల కోసం రూ.27 వేల కోట్ల బిల్లులను లిఫ్టుల కంపెనీకి చెల్లించారంటూ సీఎం ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అవసరమైన నీటి వనరు (సోర్సు)ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వెనుక లోతైన అవినీతి పునాదులున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘పాలమూరు ప్రాజెక్టు సోర్సు మార్చడానికి మంత్రివర్గ ఆమోదం లేదు. నేను ఇదే అడుగుదామనుకుంటే కేసీఆర్ సభకు రావడం లేదు. కొందరు ఇరిగేషన్ అధికారులతో ఇటీవల జరిపిన సమీక్షలో విచారణకు ఆదేశిద్దాం..మార్గదర్శకాలు (టీఓఆర్) సిద్ధం చేయండి అని ఆదేశించా..’ అని సీఎం తెలిపారు. ఈ వాసన (విషయం) పసిగట్టిన బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు నాటి నుంచి కృష్ణా జలాలపై చర్చను వదిలేసి నల్లమల్లసాగర్‌పై మాట్లాడుతున్నారని విమర్శించారు.
‘జూరాల నుంచి శ్రీశైలంకు ఎందుకు మార్చారు?..ఎవరి బాగోగుల కోసం మార్చారు?..రూ.వేల కోట్ల కమీషన్లు ఎవరి ఇంటికి వెళ్లాయి?.. తెలంగాణకు జరిగిన నష్టం ఏమిటి? అన్న దానిపై విచారణకు ఆదేశించాలి..’ అని అన్నారు. కృష్ణా ప్రాజెక్టులపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు గురువారం ప్రజాభవన్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమం ముగింపులో రేవంత్ మాట్లాడారు. జూరాల నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలే కావడంతో 300 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంకు ‘పాలమూరు’ ప్రాజెక్టు సోర్సును మార్చామంటూ మాజీమంత్రి హరీశ్‌రావు చేసిన వాదనను ఆయన తోసిపుచ్చారు.
సభలో మాట్లాడదాం రండి కేసీఆర్..
‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు వనరు (సోర్సు)ను తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలనే అత్యంత కీలక నిర్ణయాన్ని మంత్రివర్గానికి బదులు వ్యక్తిగత స్థాయిలో తీసుకున్న వ్యక్తి (కేసీఆర్)ని శిక్షించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. అదే తరహాలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును మార్చారు. దీనిపై సభలోనే మాట్లాడదాం రండి కేసీఆర్.. పాలమూరు కోసం రోజుకు 2 టీఎంసీల చొప్పున 35 రోజులు జూరాల వద్ద నీళ్లు తీసుకోవచ్చని నాటి సీఈ నివేదిక ఇచ్చారు. అయితే రోజుకు 3 టీఎంసీల చొప్పున 30 రోజుల్లో 90 టీఎంసీలను జూరాల వద్దే తీసుకునే అవకాశం ఉండేది. అప్పుడు పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి, రాయలసీమ లిఫ్టు ద్వారా తరలించుకోవడానికి శ్రీశైలంలో ఏపీకి నీళ్లు లభించేవి కాదు. తెలంగాణను కేసీఆర్, హరీశ్ అచేతనావస్థలోకి నెట్టేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కేసీఆర్, హరీశ్‌ను ఉరేసినా తప్పులేదు. వారి పాలనలో శ్రీశైలం నుంచి నీళ్లను తరలించుకు సామర్థ్యాన్ని ఏపీ 4.5 నుంచి 13 టీఎంసీలకు పెంచుకుంది..’ అని సీఎం అన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి లెక్కలకు కేసీఆర్ సమ్మతి
‘రాష్ట్ర విభజనకు ముందు నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏపీకి ప్రయోజనం చూకూర్చాలనే ఉద్దేశంతో కృష్ణా బేసిన్‌లో ఏపీ ప్రాజెక్టులు 512, తెలంగాణ ప్రాజెక్టులు 299 టీఎంసీలు వాడుకుంటున్నాయని లెక్కలు తీయించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య (తాత్కాలికంగా) నీటి పంపిణీ కోసం కేంద్రం నిర్వహించిన సమావేశంలో.. నాటి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు పాల్గొని నికర జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటాలో ఏపీకి 512 (66%), తెలంగాణకు 299 టీఎంసీలు(34%) సరిపోతాయనే లెక్కల ఆధారంగానే ఒప్పందం చేసుకుని తెలంగాణకు తీవ్ర ద్రోహం చేశారు.
తొలుత ఏడాది కోసం చేసుకున్నా, ఆ తర్వాత వరుసగా మరో రెండేళ్లు ఈ ఒప్పందాన్ని పొడిగించేందుకు కేసీఆర్, హరీశ్ సమ్మతి తెలిపారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు ఈ ఒప్పందాన్నే కొనసాగించాలని, అప్పటి వరకు మళ్లీ ఈ సమావేశాలకు రావాల్సిన అవసరం లేకుండా ‘వన్స్ ఫర్ ఆల్’ సంతకం పెడుతున్నట్టు 2020లో కేసీఆర్ కేంద్రానికి తేల్చి చెప్పి వచ్చారు. ‘‘నాకు మల్లమల్ల డిస్ట్రర్బ్ చేయకురి..ఫార్మ్‌హౌస్‌లో ఉంటా’’ అని సంతకం పెట్టి కృష్ణా జలాలపై ఏపీకి శాశ్వతంగా 66 శాతం హక్కు ఇచ్చిండు..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
మా వాదనలతో ఏపీ ఉక్కిరిబిక్కిరి
‘ఏ రాష్ట్రంలో పరీవాహక ప్రాంతం ఎంత దామాషాలో ఉంటే అంత వాటాను ఆ రాష్ట్రానికి ఇవ్వాలనే అంతర్జాతీయ సూత్రాల ప్రకారం తెలంగాణకు 71 శాతం, ఏపీకి 29 శాతం కృష్ణా జలాలు కేటాయించాలని, ఆ లెక్కన మాకు 555 టీఎంసీలు వస్తాయని మేము వచ్చాక ట్రిబ్యునల్ ఎదుట తొలి వాదనగా వినిపించాం. అపెక్స్ కౌన్సిలో కేసీఆర్ ఈ వాదన, కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు తరలించకుండా ఏపీని అడ్డుకోవాలని మరో వాదన చేసి ఉంటే రాష్ట్రానికి అన్యాయం జరిగి ఉండేది కాదు. 2014–23 మధ్య కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో కృష్ణా జలాలపై ఏపీ పూర్తి ఆధిపత్యం సాధించింది.
65 శాతం లభ్యతతో ఉమ్మడి ఏపీకి ట్రిబ్యునల్ కేటాయించిన 1,005 టీఎంసీల్లో తెలంగాణకు 763 టీఎంసీలు ఇవ్వాలని మేము ట్రిబ్యునల్ ఎదుట రెండోసారి వాదన వినిపించడంతో ఏపీ ఉక్కిరిబిక్కిరి అయింది. తెలంగాణ సమర్థవంతంగా వాదనలు వినిపిస్తోంటే ఏపీ ప్రభుత్వం ఎక్కడా నిలువరించలేకపోతోంది. కానీ జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి తప్పకపోవడంతో బీఆర్‌ఎస్ మనుగడే ప్రమాదంలో పడిందని బయటకు వచ్చిన కేసీఆర్ ..ఏపీకి సీఎం రేవంత్ సహకరిస్తున్నాడనే ఒక అపోహాను కలిగించి మళ్లీ జల వివాదాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. కేసీఆర్, హరీశ్‌రావు ఏం చెప్పినా తూకం వేస్తే 24 క్యారెట్లు అబద్ధంగా తేలుతుంది..’ అని ఎద్దేవా చేశారు.
మేడిగడ్డ, పాలమూరు ..ఫార్ములా సేమ్
‘రీడిజైనింగ్ పేరుతో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించి ప్రాణహిత–చేవెళ్ల అంచనాలను రూ.35 వేల కోట్ల నుంచి రూ.1.5 లక్షల కోట్లకు పెంచడంలో వాడిన ఫార్ములానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలంకు తరలించడానికి వాడారు. ఇలా పంపులు, లిఫ్టులు పెంచితే కనకవర్షం కురుస్తుందనేది తప్ప కేసీఆర్ మరే ఫార్ములా కనిపెట్టలేదు. జూరాల నుంచి నీళ్లను తీసుకునేలా ‘పాలమూరు’ను చేపడితే అంతర్రాష్ట్ర వివాదాలు ఉండేవి కావు. పంపులు, లిఫ్టులకు బిల్లులు ఇవ్వడానికి కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లి ‘పాలమూరు’ సాగునీటి ప్రాజెక్టు కాదని, 7.15 టీఎంసీలతో తాగునీటి ప్రాజెక్టుగా కట్టుకుంటామంటూ అఫిడవిట్ వేసి ఆ మేరకు పనులకే 2023లో అనుమతి పొందారు. కేసీఆర్, హరీశ్‌రావు కారణంగా రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. కమీషన్ల కోసం పంపులు, లిఫ్టుల కంపెనీకి రూ.27 వేల కోట్ల చెల్లింపులు చేశారు..’ అని సీఎం ఆరోపించారు.
అన్నీ బయటపెడతాననే సభకు రావడం లేదు..
‘మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలు, గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచ్చిన 45టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలతో ‘పాలమూరు’ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వాలని ఈ ప్రబుద్ధుడే (కేసీఆర్) పిటిషన్ వేస్తే, గోదావరి జలాల మళ్లింపుతో లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీలపై నిర్ణయాధికారం సీడబ్ల్యూసీకి లేదని, ట్రిబ్యునల్ చేయాల్సి ఉంటుందని ఏపీ అభ్యంతరం తెలిపింది. మైనర్ ఇరిగేషన్‌లో ఆదా చేసిన 45 టీఎంసీలకు సంబంధించి 30 ఏళ్ల డేటా సీడబ్ల్యూసీ కోరితే గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. మేము వచ్చాక అధ్యయనం చేయించి వివరాలను సమర్పించడంతో పాటు తొలి దశ కింద ఆ 45 టీఎంసీలు వాడుకోవడానికి అనుమతి కోరుతూ మంత్రి ఉత్తమ్ లేఖ రాశారు.
పీఎంకేఎస్‌వై కింద 60 శాతం కేంద్ర నిధులతో పాటు 7.25 శాతం తక్కువ వడ్డీతో రుణాలు లభిస్తాయనే అనుమతులు కోరాం. రూ.84 వేల కోట్ల అంచనాల్లో రూ.50 వేల కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది..’ అని రేవంత్ వివరించారు. ‘సమస్యలు పరిష్కారమైతే.. ప్రాజెక్టులు పూర్తైతే కేసీఆర్‌కు శాశ్వతంగా జలసమాధి జరుగుతుందన్న భయంతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించాలని వారు ప్రయత్నిస్తున్నారు. నేను తారీఖులతో సహా ఆయన సంతకం చేసిన ప్రతిలేఖ, చేసుకున్న ఒప్పందాలు, పెంచిన అంచనాలను బయటపెట్టి ప్రశ్నిస్తాననే శాసనసభకు రావడం లేదు..’ అని రేవంత్ విమర్శించారు.


