ఘనంగా బీఆర్‌ఎస్ 25 ఏళ్ల వేడుక
‘కాళేశ్వరం కేసు’లో కేసీఆర్, హరీశ్‌ను విచారించిన ఘోష్ కమిషన్
‘ఫార్ములా ఈ రేస్ కేసు’లో కేటీఆర్‌ను ప్రశ్నించిన ఏసీబీ, ఈడీ
పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్
పంచాయతీ ఎన్నికల్లో పట్టు
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితిలో కీలక ఘట్టాలకు 2025 సాక్షిగా నిలిచింది. 2001లో ఉద్యమ పార్టీగా అవతరించిన బీఆర్‌ఎస్ ఈ ఏడాది 25 ఏళ్లు పూర్తి చేసుకుని ఘనంగా రజతోత్సవాలను జరుపుకుంది. అయితే అధినేత కేసీఆర్ సహా విపక్ష పార్టీ నాయకులు పలు కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ వ్యవహారంతో పార్టీ కొంత కుదుపునకు గురైంది.
పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి చవి చూసినా...ఏడాది చివర్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు గులాబీ దళానికి భారీ ఊరటనిచ్చాయి. ఇదే ఊపుతో 2026లో పార్టీ పునరుజ్జీవం దిశగా కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. బీఆర్‌ఎస్‌కు సంబంధించి ఈ ఏడాది చోటు చేసుకున్న కొన్ని కీలక పరిణామాల వివరాలు..
» ఏడాది ఆరంభంలోనే..అంటే జనవరి 9న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఫార్ములా ఈ’ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అదే నెల 16న ఇదే కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. జూన్ 16న మరోసారి ఏసీబీ ఆయన్ను ప్రశ్నించింది. సెప్టెంబర్ 9న ఏసీబీ ప్రభుత్వానికి ఇచ్చిన ప్రాసిక్యూషన్ రిపోర్టులో కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. కాగా నవంబర్ 20న కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు.
» ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ నిర్వహించింది. 2023లో అధికారం కోల్పోయిన తర్వాత పెద్దయెత్తున నిర్వహించిన ఈ బహిరంగ సభలో పార్టీ శ్రేణులు పెద్దయెత్తున పాల్గొన్నాయి. అధినేత కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఉద్యమ పార్టీ మొదలుకుని పదేళ్లు అధికారంలో కొనసాగడం వరకు బీఆర్‌ఎస్ ప్రస్థానాన్ని వివరించిన ఆయన గులాబీ దళంలో కొత్త జోష్ నింపారు.
» బీఆర్‌ఎస్ రజతోత్సవాల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ కావడం పార్టీలో అంతర్గత విభేదాలను బహిర్గతం చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను కారణంగా చూపుతూ కవితను సెప్టెంబర్ 2న బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. కాగా సెప్టెంబర్ 3న పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు.
» కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్, హరీశ్‌రావు విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. జూన్ 11న కమిషన్ ముందు 115వ సాక్షిగా హాజరైన కేసీఆర్.. ప్రాజెక్టు రీ–డిజైన్ అవసరం, ఇందుకు సంబంధించిన నిర్ణయాలు వివరించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావును కూడా కమిషన్ విచారించింది.
» బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ న్యాయ పోరాటం కొనసాగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గత ఏడాది దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టు, స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట బీఆర్‌ఎస్ వాదనలు వినిపించింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వాదనలు విన్న స్పీకర్ ట్రిబ్యునల్ .. డిసెంబర్ మూడో వారంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఇచ్చిన అనర్హత పిటిషన్ చెల్లదంటూ తీర్పు ఇచ్చింది.
» పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్) అనారోగ్యంతో మరణించడంతో నవంబర్ 11న ఉప ఎన్నిక జరిగింది. గోపీనాథ్ భార్య సునీత పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు.
» డిసెంబర్‌లో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కొంత మెరుగైన ఫలితాలు సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ తన పట్టును నిలుపుకుందనే అభిప్రాయం వ్యక్తమైంది. సుమారు 4 వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన ఉత్సాహంతో పరిషత్ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తోంది. ‘పాలమూరు’ ప్రాజెక్టు వంటి అంశాలపై పోరాటాలకు వ్యూహ రచన చేస్తోంది.
సమన్వయ లేమి.. అంతర్గత విభేదాలు
అయితే వరుసగా మూడుసార్లు గెలిచి హైదరాబాద్‌లో హిందుత్వ బ్రాండ్ అంబాసిడర్ అని పిలిపించుకున్న టి.రాజాసింగ్.. చివరకు రాజీనామా వరకు వెళ్లేలా పార్టీలో పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నాయకత్వంపై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై నేరుగా విమ ర్శలు, ఆరోపణలతో రాజాసింగ్ బీజేపీలో కొనసాగలేని పరిస్థితికి చేరుకున్నారు.
పార్టీ ముఖ్యనేతల మధ్య సమన్వయ లేమి, అంతర్గత విభేదాలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరికి వారే అన్నట్టుగా సొంత ప్రతిష్టను, సత్తాను చాటుకునే ప్రయత్నంలో పార్టీ సమష్టి బాధ్యత, కలిసికట్టుగా ముందుకెళ్లడం అనేది విస్మరించారనే విమర్శలు వచ్చాయి.
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘోరఓటమి పార్టీకి, నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందికర పరిణామంగా మారింది. అయితే ఈ ఏడాది చివర్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుతో 1,000 మంది దాకా (స్వతంత్రుల్ని కూడా కలుపుకొని) సర్పంచ్‌లు గెలిచారని పార్టీ ప్రకటించింది.
2019లో గెలిచిన సర్పంచ్ స్థానాలతో పోల్చితే ఇవి సంఖ్యాపరంగా ఎక్కువైనా రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలం పెరిగిందని చెబుతున్న స్థాయిలో ఇవి లేవనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం. ఈ ఏడాది కూడా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగాయి. ముఖ్యనేతలు సైతం బహిరంగ విమర్శలు చేసుకున్నారు.


