
సాక్షి,బెంగళూరు: సొంత పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ హైకమాండ్ షాకిచ్చింది. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, ఏ శివరామ్ హెబ్బర్‌లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
కర్ణాటకలో ఎస్టీ సోమశేఖర్ యశ్వంత్‌పూర్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఎ శివరామ్ హెబ్బార్ యల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. అయితే, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సుదీర్ఘ కాలంగా పార్టీ క్రమశిక్షణను పదేపదే ఉల్లంఘిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ సభ్య కార్యదర్శి ఓం పాఠక్ హెబ్బార్ ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో పార్టీ క్రమశిక్షణను పదేపదే ఉల్లంఘిస్తున్న కారణంగా ఎమ్మెల్యేలను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
పార్టీ హైకమాండ్ నిర్ణయంతో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నట్లు బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో పార్టీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ 2025 మార్చి 25 నాటి షోకాజ్ నోటీసుకు మీ ప్రతి స్పందనను పరిగణనలోకి తీసుకుంది. మీరు పార్టీ క్రమశిక్షణను పదే పదే ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించింది. అందుకు మిమ్మల్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తక్షణమే ఆరేళ్ల పాటు బహిష్కరించాలని నిర్ణయించింది’ అని అందులో పేర్కొన్నారు.
