గరివిడి బరిలో కోడళ్ల సవాల్‌..! | Interesting Politics In Vizianagaram | Sakshi
Sakshi News home page

గరివిడి బరిలో కోడళ్ల సవాల్‌..!

Oct 25 2026 7:23 AM | Updated on Oct 25 2026 8:01 AM

Interesting Politics In Vizianagaram

విజయనగరం: అత్తా కోడళ్ళు సవాల్‌.... మామ అళ్ళుల్లు సవాల్‌....అంతెందుకు అన్నదమ్ముల సవాల్‌ కూడా వినే ఉంటాం, చూసి ఉంటాం. కానీ తాజాగా కోడళ్ళు సవాల్‌ మొదలయ్యింది. అదేంటి కోడళ్ళు సవాల్‌ అనుకుంటున్నారా.. అవునండీ బాబూ నిజమే.. గరివిడి జెడ్పీటీసీ ఎన్నికలో కోడళ్ళు సవాల్‌ జరుగుతోంది. తాజాగా జిల్లా అంతా అదే చర్చ జరుగుతోంది. ఇటు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, అటు మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఇద్దరూ సీనియర్లు, రాష్ట్ర స్థాయి నేతలే. ఆ ఇద్దరి కోడళ్ళు గరివిడి జెడ్పీటీసీ అభ్యర్థులుగా ఢీ అంటే ఢీ అంటూ నామినేషన్లు వేయడంతో జిల్లాలోనే హాట్‌ టాపిక్‌గా మారింది. 

గరివిడి జెడ్పీటీసీ బరిలో బొత్స కోడలు వర్సెస్‌ కళా కోడలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో వారి భవితవ్యం తేల్చుకోనున్నారు. ఎలాగూ మంత్రి పదవి ఇవ్వలేదు కదా కనీసం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి అయినా ఇవ్వండి అంటూ అధిష్టానం వద్ద ఎమ్మెల్యే కళా వెంకటరావు మాట తీసుకున్నట్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 22న కళా కోడలు కిమిడి సంధ్య గరివిడి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.  

ఈ నెల 23న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ  అభ్యర్థిగా స్వయానా శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కోడలు, డా.సందీప్‌ భార్య పూజిత నామినేషన్‌ వేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఇది వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సైతం ఎక్కడ లేని ఉత్సాహాన్ని నింపింది. కోడళ్ళు సవాల్‌తో రాజకీయంగా గరివిడి మాత్రమే కాకుండా జిల్లాలోనే స్థానిక సమరంలో హీటెక్కించాయి. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ విన్నా గరివిడి జెడ్పీటీసీ ఎన్నిక విషయమే హాట్‌ టాపిక్‌ నడుస్తోంది.  

నిరాశలో టీడీపీ శ్రేణులు 
స్థానిక ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ఎంపికలో క్యాడర్‌ అభిప్రాయాలకు విలువ లేకుండా ఎమ్మెల్యే కార్యాలయంలో లాబీయింగ్‌ చేసుకున్న వారికే కట్టబెట్టారంటూ గరివిడి మండల టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వినిపిస్తోంది. జెడ్పీటీసీ టిక్కెట్‌ కూడా చాలా మంది సీనియర్లు ఆశించినప్పటికీ పట్టించుకోకుండా ఎమ్మెల్యే కోడలను నిలబెట్టుకోవడంపై సొంత పార్టీ క్యాడర్‌లో నిరాశ రాగం వినిపిస్తోంది. ఇంతలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కోడలు గరివిడి జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో టీడీపీ శ్రేణులు మరింత నైరాశ్యంలోకి వెళ్లినట్లు చర్చ జరుగుతోంది. 

ఇదీ చదవండి: సిరి సహస్ర బీసీనా..!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement