2029 నుంచి కార్లలో ఈడీఆర్ వ్యవస్థను తప్పనిసరి చేసిన కేంద్రం
దాంతోపాటు మరిన్ని భద్రతా ప్రమాణాలు
రహదారి భద్రత దిశగా కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: రోడ్డు ప్రమాదాల నివారణ దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్లలో ఈవెంట్ డేటా రికార్డర్ల (ఈడీఆర్) ఏర్పాటును తప్పనిసరి చేయనుంది. తద్వారా ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ కారుకు సంబంధించిన సాంకేతిక, భద్రతా డేటాను సేకరించనుంది. ఆ డేటాను విశ్లేషించి భవిష్యత్‌లో రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు దోహదపడుతుందన్నది కేంద్రం ఉద్దేశం. దేశంలో పెరుగుతోన్న రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు ఈడీఆర్‌ల ఏర్పాటు ప్రతిపాదనను ఆమోదించింది. ప్రమాదాలను నిశితంగా విశ్లేషించేందుకు వీలుగా ఈడీఆర్‌ల ఏర్పాటును కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ విధానం 2029 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఈడీఆర్ ఎలా పనిచేస్తుందంటే..
విమానాల్లో బ్లాక్ బాక్స్ మాదిరిగానే కార్లలో ఈడీఆర్ వ్యవస్థ అంతర్భాగం కానుంది. ఎంతటి ప్రమాదం సంభవించినా విచ్ఛిన్నం కాని రీతిలో ట్యాంపర్ ప్రూఫ్ ఎలక్ట్రానిక్ పరికరంగా ‘ఈడీఆర్’ నిలుస్తుంది. కారు ప్రయాణిస్తున్నంతసేపు ఈడీఆర్ డేటా రికార్డ్ చేయదు. ఏదైనా ప్రమాదంగానీ ఇతర వాహనాలతో ఢీకొనడం వంటివి సంభవించగానే డేటా రికార్డింగ్ మొదలవుతుంది.
అదే సమయంలో కార్లలో ఆడియోగానీ వీడియోగానీ రికార్డ్ చేయదు. కేవలం కార్లలో సాంకేతిక అంశాలనే రికార్డు చేస్తుంది. కారు స్పీడ్, వెలాసిటీలో మార్పులు, బ్రేక్ ఫెడల్ పరిస్థితి, సీట్‌బెల్ట్ పరిస్థితి, ఎయిర్ బ్యాగ్ తెరచుకున్న తీరు, స్టీరింగ్ యాంగిల్, ప్రమాదం సంభవించిన కాల వ్యవధి (సాధారణంగా 5 సెకన్ల నుంచి 30 సెకన్ల కాలం), ప్రమాదం జరిగిన వెంటనే వచ్చిన మార్పులు తదితర డేటాను రికార్డ్ చేస్తుంది. దాంతో ప్రమాదానికి కారణాలు, భవిష్యత్‌లో వాటిని నివారించేందుకు పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను నిర్ణయించేందుకు ఆ డేటా ఉపకరిస్తుంది.
మరిన్ని భద్రతా ప్రమాణాలు
దాంతోపాటు ప్రమాదాల నివారణకు కేంద్ర రవాణా శాఖ కార్లలో మరిన్ని సాంకేతిక మార్పులను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ తాజాగా ఎంఐ కేటగిరీ కార్లలో ఇమ్మొబిలైజర్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గరిష్టంగా 9 సీట్ల కార్‌లో దొంగతనాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని కార్లలో ఫుట్ కంట్రోల్ ఆపరేషన్ల విధానంలో మార్పులు తప్పనిసరి చేసింది.
ప్రధానంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్పులు తీసుకువచ్చింది. 2028, ఏప్రిల్ నుంచి ఉత్పత్తి చేసే కార్లలో ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. ఇక కార్లు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకుపోయే ప్రమాదాలను నివారించడానికి కూడా కేంద్ర రవాణా శాఖ కార్ల ఫుట్ కంట్రోల్ వ్యవస్థలో మార్పులు రూపొందించింది. అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల మేరకు ఈ మార్పులు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా ఫ్లెక్సిబుల్ పెడెస్ట్రియన్ లెగ్ ఇంపాక్టర్(ఫ్లెక్స్ పీఎల్‌ఐ) టెస్ట్ టూల్‌ను కార్లలో పొందుపరచాలని ఆదేశించింది. 2032 అక్టోబర్ నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.
కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం
దేశంలో 2024లో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య 1.77 లక్షల మంది
సగటున రోజుకు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 485


