నామినేషన్లలో ‘పచ్చ’ నకిలీలు | TDP conspiracies to secure victory in local elections | Sakshi
Sakshi News home page

నామినేషన్లలో ‘పచ్చ’ నకిలీలు

Oct 25 2026 5:32 AM | Updated on Oct 25 2026 5:32 AM

TDP conspiracies to secure victory in local elections

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బళ్ల సెగ్మెంట్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యరి్థగా దొంగ నామినేషన్‌ వేసిన టీడీపీ నేత శంకరప్పతో ఆ పార్టీ ఎమ్మెల్సీ శ్రీకాంత్‌

స్థానిక ఎన్నికల్లో అడ్డదారిలో గెలుపుకోసం వెన్నుపోటు పార్టీ కుట్రలు

తొలుత వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయనివ్వకుండా అడ్డగింత 

సుప్రీంకోర్టు తప్పు పట్టడంతో టీడీపీ నేతలే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా నకిలీ నామినేషన్లు

నామినేషన్ల అడ్డగింతల అక్రమాలను కప్పిపుచ్చడానికి బాబు అండ్‌ కో సరికొత్త డ్రామా 

చాలా చోట్ల వైఎస్సార్‌సీపీ వాళ్లను నామినేషన్లు వేయనివ్వక పోయినా ఎస్‌ఈసీ లెక్కల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు  

తుదకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఇదే దుర్మార్గం 

వైఎస్సార్‌సీపీ ఈ అంశాన్ని ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోని వైనం 

నిజమైన అభ్యర్థులకు పోలీసులు అడ్డంకులు.. నకిలీలకు మాత్రం రాచబాటలు

సాక్షి, అమరావతి:  దేశ ఎన్నికల చరిత్రలో అనేక అక్రమాలకు ఆద్యుడుగా పేరున్న చంద్రబాబు.. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో నకిలీ నామినేషన్లు అనే నీచ సంస్కృతికి తెరలేపారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల పేరుతో వందల కొద్దీ నకిలీ నామినేషన్లు దాఖలు చేయించారు. దేశ ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ, ఎక్కడా లేని రీతిలోమున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో.. పోలింగ్‌ కేంద్రాల లోపల, వెలుపల  పోలీసుల ఎదుటే నామినేషన్లు వేయడానికి వచ్చిన ఆశావహ అభ్యర్థులపై అధికార పార్టీ అల్లరి మూకలు యథేచ్ఛగా దాడులు చేస్తూ వారి చేతుల్లో నామినేషన్లు ఎత్తుకెళ్లడం తెలిసిందే. అభ్యర్థులు అందజేసిన నామినేషన్లను అధికారుల చేతుల్లో నుంచి సైతం లాక్కొని చించి వేయడం.. మహిళా అభ్యర్థులపై దాడులకు తెగబడి వారిని ఇష్టమొచ్చినట్టు తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడం.. వంటి చర్యలతో స్థానిక’ ఎన్నికల్లో శాంతిభద్రతల పరిస్థితులపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. 

రాష్ట్రంలో అధికార పార్టీ గూండాలు కొనసాగిస్తున్న అరాచకాలపై దేశ వ్యాప్తంగా ప్రముఖులు, విశ్లేషకులు సోషల్‌ మీడియా ద్వారా తూర్పారబట్టారు. దీంతో చంద్రబాబు సరికొత్త డ్రామాలకు తెరలేపారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయనివ్వని విషయం కలకలం రేపడంతో.. టీడీపీ నేతలే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులమంటూ పలుచోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత వారు ఉపసంహరించుకోవడంతో ఆ స్థానం ఏకగ్రీవం అయ్యేలా చక్రం తిప్పారు. తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తి కలుషితం చేశారు.  

పల్నాడు, ప్రకాశం, సీమ జిల్లాల్లో ఇష్టారాజ్యం 
వెన్నుపోటు పార్టీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులు పూర్తిగా సహకరించడంతో నకిలీ నామినేషన్ల పర్వం యథేచ్ఛగా సాగింది. ఈ విషయం గురించి తొలుత కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఎస్‌ఈసీ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ, ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5,267 నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు 26,886, మూడో రోజు 25,016 చొప్పున దాఖలు అయ్యాయి. జెడ్పీటీసీ నామినేషన్లు తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 409 మాత్రమే దాఖలు కాగా, రెండో రోజు 2,409, మూడో రోజు 3,315 చొప్పున దాఖలు కావడం గమనార్హం. మొత్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు 57,626 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వక పోవడంపై తొలిరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత టీడీపీ.. వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్ల పర్వానికి తెరలేపడంతో రెండో రోజు, మూడో రోజు నామినేషన్ల సంఖ్య అమాంతం పెరగడం గమనార్హం. పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో నకిలీ నామినేషన్ల దందా భారీగా కొనసాగింది. వాటి వివరాలు మచ్చుకు కొన్ని ఇలా.. 

వైఎస్సార్‌ కడప జిల్లాలో బరితెగింపు 
పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో గురువారం నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి వైఎస్సార్‌సీపీ తరఫున 11 నామినేషన్లు దాఖలు కాగా, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అసలైన వైఎస్సార్‌సీపీ నేతలది కాదు. పక్కా వ్యూహంతో టీడీపీ వర్గీయులే వైఎస్సార్‌సీపీ పేరుతో 11 నామినేషన్లను దాఖలు చేశారు. పెండ్లిమర్రి మండలంలోనూ ఇదే మైండ్‌ గేమ్‌ను అమలు చేశారు. అక్కడ మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో మూడింటిని టీడీపీ నేతలే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా వేశారు. చింతకొమ్మదిన్నె మండలంలో ఏడు నకిలీ నామినేషన్లు వేశారు. ఎర్రగుంట్ల మండలంలో వైఎస్సార్‌సీపీ తరఫున కూటమి నాయకులే డమ్మీలుగా రంగంలోకి దిగారు. వలసపల్లె స్థానానికి పాతకోటకు చెందిన టీడీపీ వర్గీయుడు రఘునాథ్‌ రెడ్డి, ఆర్టీపీపీ కృష్ణానగర్‌ స్థానానికి గుంతకల్లుకు చెందిన నాగప్ప.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా ముసుగు వేసుకుని నామినేషన్లు వేశారు. పోట్లదుర్తి గ్రామానికి చెందిన మాధవి (మాతమ్మ)తో పాటు నరసింహులు అనే వ్యక్తి కూడా కూటమి కుట్రలో భాగంగా ప్రతిపక్ష అభ్యర్థులుగా పత్రాలు సమర్పించారు. 

కొండాపురం మండలంలో వైఎస్సార్‌సీపీతో సంబంధం లేని నలుగురిని పట్టుకొచ్చి దొంగ నామినేషన్లు వేయించారు. మొనగోటి గంగమ్మ, కృష్ణారెడ్డి కుమారుడు ఏ.సిద్ధార్థ రెడ్డి, పెద్దన్న కుమారుడు వై.ప్రసాదు, పెద్దయ్య భార్య వై.సావిత్రిల చేత బలవంతంగా వైఎస్సార్‌సీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేయించి రికార్డులను తారుమారు చేశారు. కలసపాడు, పులివెందులలోనూ అదే వ్యూహంతో అధికార పార్టీ దుర్మార్గానికి ఒడిగట్టింది. మొత్తం 9 ఎంపీటీసీ స్థానాలు ఉన్న కలసపాడు మండలంలో అసలైన వైఎస్సార్‌సీపీ నేతలు ఎవ్వరూ నామినేషన్‌ వేయకుండా కట్టడి చేశారు. ఆ తర్వాత కోర్టు భయంతో టీడీపీ నేతలే నాలుగు దొంగ నామినేషన్లు వేశారు. ఇక్కడ మొత్తం నామినేషన్ల సరళిని పరిశీలిస్తే 9 టీడీపీ, 4 వైఎస్సార్‌పీసీ పేరిట నకిలీ, 2 స్వతంత్ర అభ్యర్థులవిగా తేలింది. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్‌ కుటుంబ స్వగ్రామమైన బలపనూరు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నాయకుడు ముసుగు వేసుకుని వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా దొంగ నామినేషన్‌ దాఖలు చేయడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.  


మార్కాపురం జిల్లాలో అదే కుతంత్రం 
కంభం మండలం ఎల్‌కోట ఎంపీటీసీ టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మహిళ భర్త తాటికొండ వెంకటేశ్వర్లు వైఎస్సార్‌సీపీ పేరిట అదే ఎంపీటీసీ స్థానంలో నామినేషన్‌ దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ తరఫున టీడీపీ సభ్యత్వం ఉన్న తమ్మిశెట్టి సత్యమూర్తి కందులాపురం తూర్పు ఎంపీటీసీగా, యేల్చూరి సుబ్రమణ్యం కందులాపురం దక్షిణం ఎంపీటీసీగా నామినేషన్లు దాఖలు చేశారు. తర్లుపాడు మండలం సీతానాగులవరం ఎంపీటీసీగా అక్కడి టీడీపీ కార్యకర్తలు నాగేల్ల ఆంజనేయులు, ఊసు ఈశ్వరమ్మలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఇదే మండలంలోని మీర్జాపేట ఎంపీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వైఎస్సార్‌సీపీ తరఫున గొల్లమారి భాస్కర్‌ రెడ్డితో నామినేషన్‌ వేయించారు. పొదిలి మండలం ఏలూరు ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టీడీపీ కార్యకర్త ధర్మవరపు కోటిరెడ్డితో నామినేషన్‌ వేయించారు. 

యర్రగొండపాలెం మండలంలో టీడీపీ గూండాలు తమ పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులతో మొత్తం 12 మంది ద్వారా వైఎస్సార్‌సీపీ పేరుతో నకిలీ నామినేషన్లు దాఖలు చేయించారు. గురిజేపల్లి ఎంపీటీసీ స్థానానికి యర్రగొండపాలెం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో ఎలక్ట్రికల్‌ లైన్‌ కాంట్రాక్టర్‌గా పనిచేసే భవనం మల్లారెడ్డితో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా టీడీపీ నేతలే నామినేషన్‌ దాఖలు చేయించారు. బోయలపల్లి ఎంపిటీసీ స్థానానికి కొమ్ము బుజ్జితో టీడీపీ నేతలే నామినేషన్‌ వేయించారు. టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ వెన్నా రంగారెడ్డి అమానిగుడిపాడు ఎంపీటీసీగా వైఎస్సార్‌సీపీ అభ్యరి్ధగా నామినేషన్‌ దాఖలు చేశారు. మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నేతలు బోరెడ్డి బ్రహేశ్వరి, గలిజేరుగళ్ల ఎంపీటీసీ అభ్యర్థిగా తాండ్ర నాగలక్ష్మి, రాచర్ల మండలం పాలకవీడు ఎంపీటీసీ స్థానానికి దొనపాటి రమణారెడ్డి, గుడిమెట్ల ఎంపీటీసీలో మదిరె రమాదేవి, రాచర్ల ఎంపీటీసీలో గుమ్ముళ్ల కిరణ్, యడవల్లి ఎంపీటీసీగా మంచికుమార్‌ నామినేషన్లు వేశారు.  


పల్నాడు జిల్లాలోనూ కొనసాగిన కుట్ర
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో 8 చోట్ల టీడీపీ నేతలే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీనగర్‌ ఎంపీటీసీ అభ్యర్థిగా జి.గంగమ్మ, శ్రామాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా గంజికుంట వెంకట నాగ సుబ్బారావు, శగామాలపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా మేదరయేసు, పొందుగల ఎంపీటీసీ అభ్యర్థిగా తండా జానీ బేగం, పెదగార్లపాడు ఎంపీటీసీ అభ్యర్థిగా పులిబండ్ల వెంకటనారయ్యలు టీడీపీ కార్యకర్తలుగా ఉంటూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా నకిలీ నామినేషన్లు వేశారు. అచ్చెంపేట మండలంలో 16 చోట్ల టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ పేరుతో నామినేషన్లు దాఖలు చేశారు. దుర్గి మండలం కొలగట్లలో టీడీపీ నేత మారాసు వెంకట్రావు వైఎస్సార్‌సీపీ తరుఫున పార్టీ జెండా పట్టుకుని నామినేషన్‌ దాఖలు చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోనూ టీడీపీ నేతలే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా నకిలీ నామినేషన్లు వేశారు. మాచర్ల మండలంలో 3, వెల్దుర్తి మండలంలో 6, రెంటచింతల మండలంలో 2, దుర్గి మండలంలో 4, కారంపూడిలో ఒక నకిలీ నామినేషన్‌ వేశారు. 
  
కుప్పంలోనూ ఇదే దుర్మార్గం 
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఈ దుర్మార్గం కొనసాగింది. రామకుప్పం మండలం వీరన్నమాల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నేత శ్రీనివాసులు భార్య దేవిక వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఇదే మండలంలోని నాన్యాల తండా ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నేత రాజేంద్రనాయక్‌.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. పండ్యాలమడుగు ఎంపీటీసీ స్థానానికి టీడీపీ నేత కె.కృష్ణమూర్తి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement