కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. ఇంకెవరు నారావారే..
ప్రధాన పాత్రధారులు: ఎస్‌ఈసీ, డీజీపీ
నటులు: కలెక్టర్లు, డీఐజీ, ఎస్పీలు,
సహనటులు: డీఎస్పీలు
సహాయ నటులు: సీఐ, ఎస్సై, ఆర్వోలు
పుర, పరిషత్ నామినేషన్ల పక్రియ పూర్తయిన తర్వాత హడావిడి
సుప్రీంకోర్టుకు ఈ నెల 27న నివేదిక కోసం బాబు డైరెక్షన్‌లో ఎస్‌ఈసీ, డీజీపీ నట విశ్వరూపం
రెండు గంటల్లోగా నామినేషన్లు ప్రక్రియ ముగుస్తుందనగా అధికారులకు ఆదేశాలు
అధికార కూటమి దాష్టీకాలపై జాతీయస్థాయిలో చర్చ జరగడంతో కంటితుడుపు చర్యలు అంతా అయిన తర్వాత
మాజీమంత్రి విడదల రజినీపై దాడి చేసిన ఎస్‌ఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు
కమలహాసన్‌ను మించి ఎస్‌ఈసీ, అమితాబ్‌బచ్చన్‌ను మించి డీజీపీ పోటాపోటీ యాక్షన్
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకపోవడం, ఇసుక నుంచి మైకా వరకు దోపిడీ, అయినవాళ్లకు కారు చౌకగా భూములు రాయితీలు ఇవ్వడం, రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా గాడితప్పడం.. ప్రభుత్వంపై అసంతృప్తి పెల్లుబుకడంతో స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు నాయుడు.. ఎలాగైనా గెలిచేందుకు భారతంలో శకునివలే కుట్రలు కుతంత్రాలకు తెరతీశాడు. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠను తోలుబొమ్మలాగా, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను కీలుబొమ్మలాగా, కిందిస్థాయి అధికారులను పాచికలుగా మార్చుకొని పచ్చకుట్రకు తెరలేపారు.
మున్సిపల్ ఎన్నికల్లో కనీసం నామినేషన్లు వేయడానికి అనుమతివ్వకపోగా.. అధికారుల కళ్లముందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులు చేస్తూ, వేసిన నామినేషన్లను లాక్కొని చింపేస్తుంటే ఎసీఈసీ నుంచి డీజీపీ వరకు కళ్లప్పగిస్తూ కూర్చున్నారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీకి అనేకమార్లు ఫిర్యాదు చేసినా దున్నపోతుపై వర్షం మాదిరి ఎటువంటి స్పందన లేకపోవడంతో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చివరకు వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది.
మున్సిపల్ నామినేషన్లపై చంద్రబాబు సర్కారు చేసిన దాష్టీకాలను వీడియోలతో సహా చూపించడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అనేవి ఉన్నాయా అని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించడమే కాకుండా ఈ ఫిర్యాదులపై చర్యలు తీసుకొని ఈ నెల 27లోగా నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో బాబు డైరెక్షన్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ), డీజీపీ తమ నట విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించారు.
సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ నామినేషన్ల విషయంలో చివరి వరకు కళ్లు మూసుకున్న ఎస్‌ఈసీ, డీజీపీ సుప్రీం కోర్టుకు గంతలు కట్టడానికి నామినేషన్లు రెండుగంటల్లో ముగియనున్న తరుణంలో కమల్‌హాసన్‌ను మించి ఎస్‌ఈసీ, అమితాబ్‌బచ్చన్ మించి డీజీపీ తమ నటనా కౌశలాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఇలా ఎస్‌ఈసీ, డీజీపీ నుంచి ఆదేశాలు రాగానే కింద ఆర్‌వోలు, ఇతర అధికారులు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లాగా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
టేక్.. యాక్షన్.. షాట్
పరిషత్ ఎన్నికల్లో చివరకు వరకు వైఎస్సార్‌సీపీ వారిని నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ కోర్టులను తప్పుదోవ పట్టించడానికి శకుని చంద్రబాబు డైరెక్షన్‌లో కొత్త కుట్రలకు తెరతీశారు. నామినేషన్లు భారీగా నమోదైనట్లు కోర్టులకు చూపించడం కోసం ఏకంగా తెలుగుదేశం కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి నామినేషన్లు వేసినట్లు దొంగ రికార్డులు నమోదు చేయించారు.
అలాగే నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం మూడుగంటలతో ముగిసిన తర్వాత 3.15 నిమిషాలకు ఎవరైతే నామినేషన్లు వేయలేకపోయామంటూ ఆందోళన చేస్తున్నారో వారికి అయిదుగంటల వరకు గడువు ఇస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు. అంతేకాకుండా ఆయా అభ్యర్థులకు పోలీసులే ఫోన్ చేసి వారికి రక్షణ కల్పిస్తూ నామినేషన్లు వేయించాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారికి రక్షణ కల్పిస్తున్నట్లు , నామినేషన్లు వేయడానికి వారిని బతిమాలుతున్నట్లు వీడియోలు తీసుకుంటూ రసవత్తర సన్నివేశాలను పండించారు.
నటనా కౌశలంలో పోటాపోటీ
నామినేషన్ల ప్రక్రియ ముగిశాక ఎస్‌ఈసీ నటనా కౌశలంలో అత్యున్నత స్థాయికి చేరింది. మాజీ మంత్రి విడదల రజినీని మూడు రోజుల పాటు గృహనిర్బంధం చేయడమే కాకుండా ఆమె ఇంటివద్దనే చిలకలూరిపేట ఎస్‌ఐ దాష్టీకంగా ప్రవరిస్తూ తోసివేసిన వీడియో జాతీయస్థాయిలో పెద్దఎత్తున వైరల్ అయ్యింది. ఈ ఘటనను అన్ని రాజకీయపార్టీలు ముక్తకంఠంతో ఖండించడంతో ఎస్‌ఈసీ కంటితుడుపు చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన 24 గంటల తర్వాత ఆ ఎస్‌ఐను సస్పెండ్ చేస్తూ ఎన్నికల విధుల నుంచి తప్పించినట్లు ప్రకటించింది.
అలాగే అన్నమయ్య జిల్లా ములకల చెరువు ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, పక్షపాతంగా వ్యవహరించిన సీఐ దస్తగిరి, ఎస్సై రామకృష్ణపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఇద్దరు అధికారులను విధుల నుంచి రిలీవ్ చేసి నవంబర్ 5లోగా క్రమశిక్షణ చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇలా పార్టీ గుర్తులపై జరిగే మున్సిపల్, పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసే వరకు మొద్దు నిద్ర నటించిన ఎస్‌ఈసీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు చర్యలు తీసుకోవడం వల్ల ఏమి ఉపయోగం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కేవలం 27న సుప్రీంకోర్టుకు కళ్లకు గంతలు కట్టేందుకే ఈ కంటితుడుపు చర్యలు అని వ్యాఖ్యానిస్తున్నారు.


