
టీడీపీ హయాంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తే వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో 1 లక్షా 20 వేలమందికి ఉపాధి కలిగించామని పేర్కొన్నారు...
సాక్షి, విశాఖపట్నం:రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేస్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవ కళ కనిపిస్తోందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా.. వైఎస్సార్‌సీపీ విజయోత్సవ స్పందనను దారిమరల్చే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.
ఐటి అభివృద్ధిపై విషపు రాతలు, పారిశ్రామిక ప్రగతిపై తప్పుడు రాతలతో ఎల్లో మీడియా విశాఖపట్నంపై విషం చిమ్ముతోందని ధ్వజమెత్తారు. 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని అన్నారు. టీడీపీ హయాంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తే వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.90 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో 1 లక్షా 20 వేలమందికి ఉపాధి కలిగించామని పేర్కొన్నారు.
3.5 లక్షల ఎంఎస్ఎంఈ కంపెనీల్లో 15 లక్షల మందికి ఉపాధి కలిగిందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. కరోనా సమయంలో వేయ్యి కోట్లు ఇచ్చి సీఎం జగన్ ఎంఎస్ఎంఈలను ఆదుకున్నారని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్ ఒన్‌గా నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో కొత్త పోర్టులు నిర్మించే క్రమంలో 3 పోర్టులు వైఎస్సార్‌సీపీ సర్కారు చేపట్టిందని అన్నారు. ప్రస్తుతం రామాయపట్నం పోర్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలిపారు. తప్పుడు రాతలతో విషం చిమ్మితే జనం నమ్మే స్థితిలో లేరని అన్నారు. సీఎం జగన్‌పై అసూయతో విషం చిమ్మే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ, సీఎం జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం
ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్త కాదని.. సీఎం జగన్ తనకు అనేక పదవులు ఇచ్చారని అమర్నాథ్ తెలిపారు. సీఎం జగన్ ప్రేమాభిమానులు కోసం అమర్నాథ్ ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను సిద్ధమని స్పష్టం చేశారు. సీఎం జగన్ చెబుతున్న స్టార్ క్యాంపైనర్లలో అమర్నాథ్ ఒకరని చెప్పారు. వైఎస్సార్‌సీపీ కోసం, సీఎం జగన్ కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జగన్‌ను మరల అధికారంలోకి తీసుకురావడం చారిత్రక అవసరమని.. అదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
చదవండి: ‘టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు.. ఆ పార్టీ పని అయిపోయింది’.. ఎంపీ కేశినేని నాని విమర్శలు