విజయనగరం: నిరంకుశ పాలన సాగిస్తున్న కూటమి సర్కారును మరోసారి ఉతికి ఆరేశారు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు శాంతియుతంగా నిరసన చేపడితే అడ్డుకోవడమే కాకుండా లాఠీచార్జ్ చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. చట్టం ఏమైనా మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయనగరం నుంచి ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. ‘కొత్త జీవోలో డైరెక్ట్‌గా ఉద్యోగాలు ఇచ్చే వెసులబాటు ఉందా లేదా అని అడుగుతున్నాం.. ఆటలు రాక పోయినా సర్టిఫికెట్‌లు ఇచ్చారు. లీకేజీ అయింది. అందులో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ర్యాంక్ వచ్చింది.శాంతియుతంగా నిరసన చేస్తుంటే వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
నిరసన చేసేందుకు వీలు లేదని పోలీసులు అడ్డుకోవడం ఏంటి?, కొన్ని ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. చట్టం ఏమైనా మీ చుట్టమా?, ఇదేనా కూటమి పరిపాలన. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, ప్రజలకు వాస్తవాలను చెప్పాలి. ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారు. విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు’ అని మండిపడ్డారు.
డీఎస్సీ అక్రమాలపై గత 74 రోజులుగా తాము చేస్తున్న పోరాటాలతో పాటు ఈరోజు(సోమవారం, ఆగస్టు 10వ తేదీ) చేపట్టిన ఏపీ వ్యాప్త ర్యాలీలు విజయవంతమయ్యాయన్నారు డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాతో పాటు థర్డ్ పార్టీ విచారణ చేయమని డిమాండ్ చేస్తున్నామన్నారు బొత్స.


