Sakshi News home page

పాలమూరుపై పట్టు ఎవరిది? 

Published Mon, Oct 30 2023 4:08 AM

The consequences are hot at the time of the election - Sakshi

వలసలు, కరువే కాదు.. విభిన్న రాజకీయ  పరిణామాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న పాలమూరుపై ప్రధాన రాజకీయ పక్షాలు ప్రత్యేక నజర్‌ వేశాయి. కృష్ణానది  చెంతనే ఉన్నా చుక్క నీరు రాక విలవిల్లాడుతున్న పాలమూరు ప్రజల  దీనగాధ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ గొంతుకై దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ జిల్లా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు పర్యాయాలుగా జరిగిన ఎన్నికల్లో ‘కారు’కు అండగా నిలిచింది. ఈసారి ఎన్నికల్లోసైతం సత్తా చాటేలా బీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండగా.. పూర్వ వైభవం సాధించే దిశగా కాంగ్రెస్‌.. ఈసారైనా ఉనికి చాటాలనే లక్ష్యంతో కమలనాథులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎస్‌) 7, కాంగ్రెస్‌ 5, టీడీపీ 2 స్థానాల్లో గెలుపొందాయి. నారాయణపేటలో టీడీపీ నుంచి గెలిచిన రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లో కాంగ్రెస్‌ నుంచి విజయం సాధించిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కారెక్కగా.. బీఆర్‌ఎస్‌ బలం తొమ్మిదికి చేరింది. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ ఏకంగా 13 స్థానాల్లో గెలుపొందగా.. కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బీరం హర్షవర్దన్‌రెడ్డి విజయం సాధించారు. అనంతర పరిణామాల క్రమంలో ఆయన సైతం బీఆర్‌ఎస్‌లో చేరారు.  

పెరిగిన ‘కారు’ స్పీడ్‌ 
ఉమ్మడి జిల్లాలో అలంపూర్‌ మినహా 13 మందికి బీఫారాలు సైతం అందజేశారు. అక్కడ ఎమ్మెల్యే అబ్రహంపై అసంతృప్త జ్వాలలు ఎగిసిపడటం.. ఆయనకు బీ–ఫారమ్‌ ఇవ్వకపోవడం.. ఈ క్రమంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత సహాయకుడు విజయుడి పేరు తెరపైకి రావడం.. ఆయనపై సైతం పార్టీ శ్రేణుల్లో విముఖత వ్యక్తం కావడం గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతోపాటు కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌పై వ్యతిరేకత.. టికెట్‌ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరటం బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బేనని రాజకీయవర్గాలు విశ్లేíÙస్తున్నాయి. షాద్‌నగర్, మక్తల్, అచ్చంపేటలో సైతం బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఎదురుగాలి వీస్తున్నట్లు తెలుస్తోంది. 

చేరికలతో ‘చేయి’కి జీవం  
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నికల పోరులో వరుస పరాజయాలతో కుంగిపోయిన కాంగ్రెస్‌కు ఇటీవల ఉమ్మడి జిల్లా నుంచి కీలక నేతల చేరికలు జీవం పోశాయి. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు, డాక్టర్‌ రాజేశ్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, గద్వాలలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, వనపర్తిలో ఎంపీపీ మేఘారెడ్డి చేరడం పార్టీలో జోష్‌ నింపింది.

అయితే   కొల్లాపూర్‌లో చింతలపల్లి జగదీశ్వర్‌రావు రూపంలో అసమ్మతి భగ్గుమంటోంది. తాజాగా నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు నాగంను బీఆర్‌ ఎస్‌లోకి ఆహ్వానించారు. జడ్చర్ల, నారాయణ పేటల టికెట్‌ నుంచి ఆశించి  గపడిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌ బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించి భంగపడిన వారు ఏదైనా పార్టీ లేదా స్వతంత్రంగా బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

బీజేపీ నామమాత్రమేనా..? 
ఉమ్మడి జిల్లాలో బీజేపీ. గత రెండు ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలోనూ గెలుపొందలేదు. అయితే కల్వకుర్తిలో గతంలో స్వల్ప ఓట్లతో ఆచారి ఓటమి పాలు కాగా.. దీంతో ఈసారి ఈ స్థానంతోపాటు పట్టున్న మక్తల్, నారాయణపేటపై పార్టీ ఆశలు పెట్టుకుంది.

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ.. మారుతున్న రాజకీయ పరిణామాలు, ఇప్పటివరకు కొల్లాపూర్, కల్వకుర్తి, మహబూబ్ నగర్‌ మినహా అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. తాజాగా మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ ఆ పార్టీకి రాజీనామా చేసి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. 

రాజకీయాస్త్రంగా ‘పాలమూరు’.. 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌తోపాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలను సస్యశామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ అంశం రాజకీయాస్త్రంగా మారింది. 2014 ఎన్నికల్లో ఈ ప్రాజెక్ట్‌ నిర్మించి.. కృష్ణా నీటితో రైతుల కాళ్లు కడుగుతామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే కేసులు తదితర కారణాలతో ప్రాజెక్ట్‌ నిర్మాణంలో జాప్యం చోటుచేసుకోగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ వద్ద మొదటి మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేసి ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.

అదే రోజు కొల్లాపూర్‌లో.. ఆ తర్వాత ఈ నెల 18న జడ్చర్లలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. మరోవైపు విపక్షాలు సైతం ఒకటే మోటార్‌ ప్రారంభించి ప్రాజెక్ట్‌ పూర్తయినట్లు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ విమర్శలు గుప్పించాయి. దీంతో ఈ ఎన్నికల్లో ‘పాలమూరు’ రాజకీయాస్త్రంగా మారినట్లు స్పష్టమవుతోంది. పాలమూరు వేదికగా దక్షిణ తెలంగాణలో సత్తా చాటే వ్యూహాన్ని బీఆర్‌ఎస్‌ అమలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 


- కిషోర్‌ కుమార్‌ పెరుమాండ్ల  

Advertisement
Advertisement