సాక్షి, హైదరాబాద్: తమాషాలు చేస్తే.. తాట తీస్తానంటూ ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏది పడితే అది చేస్తే ఊరుకోవాలా అంటూ మండిపడ్డారు. ‘‘విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించం. కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేది లేదు. విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు. మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకుతెలుసు’’ అంటూ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు.. సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు. అరోరా కాలేజీ రమేష్‌కి ఎన్ని అనుమతులు ఇవ్వాలి?. సహకరించాల్సిన వాళ్లే కాలేజీలు బంద్ చేశారు. వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం. రేపు ఫీజులు అడగకుండా ఉంటారా? అంటూ సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై రేవంత్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.‘‘గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్ గ్రోత్ ఇంజిన్‌గా మారింది. మెట్రో,ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఇలా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. నేడు ఉన్న అంతర్జాతీయ, జాతీయ సంస్థలు అన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. హైదరాబాద్‌లో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే. కొడుకు భవిష్యత్ కోసం, వాస్తు కారణంగానే కేసీఆర్ సచివాలయం కూలగొట్టారు.’’ అని రేవంత్ మండిపడ్డారు.
‘‘వరదల్లో హైదరాబాద్ ముగినిపోతే కేంద్రం నుంచి కిషన్‌రెడ్డి చిల్లి గవ్వ తీసుకురాలేదు. కాళేశ్వరం కట్టడం, కూలడం మూడేళ్లలోనే జరిగిపోయింది. హైదరాబాద్ ఎవరి హయాంలో అభివృద్ధి చెందిందో ఆలోచన చేయండి. ఆనాడు మిగుల బడ్జెట్‌తో కేసీఆర్‌కు రాష్ట్రాన్ని అప్పగించాం. సచివాలయం కారణంగా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా?. కొత్త సచివాలయం నిర్మాణం వల్ల ప్రజలకు అణా పైసా మేలు జరిగిందా?. హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ కాదా?’’ అంటూ రేవంత్ ప్రశ్నించారు.


