డీకేకు సీఎం కిరీటం.. 2028 ఎన్నికలే లక్ష్యంగా మాస్టర్‌స్ట్రోక్‌ | Challenges and Opportunities for DK Shivakumar | Sakshi
Sakshi News home page

డీకేకు సీఎం కిరీటం.. 2028 ఎన్నికలే లక్ష్యంగా మాస్టర్‌స్ట్రోక్‌

Jun 3 2026 6:09 PM | Updated on Jun 3 2026 6:51 PM

Challenges and Opportunities for DK Shivakumar

కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్ధరామయ్య తప్పుకునేలా చేసి, డీకే శివకుమార్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం సక్సెస్‌ఫుల్‌గా అధికార మార్పిడి చేసింది. అయితే, 2028లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ వ్యూహం ఎలా ఉండనుంది? డీకే శివకుమార్‌కు ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయి?

కర్ణాటకలో నాయకత్వ మార్పును కాంగ్రెస్‌ చాలా జాగ్రత్తగా చేసింది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు అత్యంత కీలక నాయకుడిగా భావించే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలన్న తన ఎన్నో ఏళ్ల ఆకాంక్షను జూన్ 3న నెరవేర్చుకున్నారు.

కర్ణాటకలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు సిద్ధరామయ్యది. ఆయన నుంచి బాధ్యతలను శివకుమార్‌కు అప్పగించడం ద్వారా కాంగ్రెస్.. కొత్త ముఖ్యమంత్రి  అనుచరుల అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచారాన్ని నడిపిన శివకుమారే ఈ పదవికి అర్హుడని ఆయన అనుచరులు భావించారు.

రాజస్థాన్‌, పంజాబ్‌ పరిణామాలు ఇలా.. 
పైకి కనిపిస్తున్న దాని ప్రకారం.. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కర్ణాటకలో నాయకత్వ మార్పును 2020లో రాజస్థాన్, 2021లో పంజాబ్‌లో జరిగిన పరిణామాల కంటే మెరుగ్గా నిర్వహించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పటికీ 2020లో అశోక్ గెహ్లాట్‌ను కొనసాగించారు. అంటే, సచిన్ పైలట్ సీఎం పదవి కోసం ఒత్తిడి తెచ్చినా కాంగ్రెస్ అశోక్ గెహ్లాట్‌ను మార్చకుండా పదవిలోనే కొనసాగించింది. పంజాబ్‌లో 2021లో అమరిందర్ సింగ్ స్థానంలో చరణ్‌జిత్ సింగ్ చన్నీని తీసుకొచ్చారు. అయితే ఆ మార్పులు అన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం ఇవ్వలేదు.

కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటకలో నాయకత్వ మార్పును 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా చేపట్టింది. ప్రభుత్వ వ్యతిరేక భావన క్రమంగా బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్ వంటి వొక్కలిగ (కర్ణాటకలోని ఒక ప్రముఖ సామాజిక వర్గం) నాయకుడిని ఎంపిక చేసింది. బీజేపీ, జనతాదళ్ (సెక్యులర్) కూటమిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.  

అన్ని వర్గాలను కలుపుకోవాలి.. 
జేడీఎస్ అగ్ర నాయకులు కూడా వొక్కలిగ వర్గానికే చెందినవారు. పాత మైసూరు ప్రాంతంలో ఈ వర్గాన్ని ఆకర్షించేందుకు శివకుమార్ వారితో దశాబ్దాలుగా పోటీపడుతున్నారు. సాధారణంగా కర్ణాటకలో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. 35 ఏళ్ల ఈ రాజకీయ సంప్రదాయాన్ని  కాంగ్రెస్, శివకుమార్ సరైన వ్యూహంతో ముందుకు సాగితే చెరిపివేసే అవకాశం ఉంది.

రాజకీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్న శివకుమార్ ఇప్పుడు 2028 ఎన్నికల్లో విజయానికి ప్రణాళిక రూపొందించాలి. పార్టీకి చెందిన అన్ని వర్గాలను కలుపుకుని నడవాలి. కీలక విధాన నిర్ణయాల సమయంలో సంప్రదింపులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

అనేక సంక్షేమ, ప్రజాకర్షక పథకాలను అమలు చేసినప్పటికీ కాంగ్రెస్ పాలనలో కర్ణాటక ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ లోటు రూ.19,500 కోట్లు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇది అతి తక్కువ స్థాయి.

ఇది కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, కర్ణాటక మొత్తం ఆదాయ వసూళ్లలో పెరుగుదల కేవలం 6.3% మాత్రమే నమోదైంది. ప్రాంతాల మధ్య స్పష్టంగా కనిపిస్తున్న అసమానతలను తగ్గించడం ప్రాధాన్యంగా ఉండాలి. 2024-25లో బెంగళూరు నగర జిల్లా కర్ణాటక జీఎస్‌డీపీకి దాదాపు 40% వాటా అందించింది. దక్షిణ కన్నడ, బెలగావి జిల్లాలు వరుసగా 5.3%, 3.9% వాటా అందించాయి.

ప్రస్తుతం రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలు, ఆర్థిక వనరులు, అభివృద్ధి అవకాశాలు తగ్గుతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్నాయంటూ కాంగ్రెస్‌ వంటి పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాంటి సమయంలో ముఖ్యమంత్రులు వెనుకబడిన వర్గాలపై ప్రభావం చూపుతున్న క్లిష్ట సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. శివకుమార్‌కు ఉన్న అనుభవం ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు తోడ్పడవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement